close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే అరెస్టు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ ఆలయంలో పట్టుబడ్డ నేరగాడు
యూపీలో ఇద్దరు అనుచరుల హతం

భోపాల్‌, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను బలితీసుకున్న కరడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్‌ దుబే ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ నగరంలో మహాకాలేశ్వరుడి ఆలయం వద్ద అతడు దొరికాడు. దుబే అనుచరులిద్దరు కూడా పట్టుబడ్డారని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్ర చెప్పారు. మరోవైపు యూపీలో జరిగిన రెండు వేరువేరు ఎన్‌కౌంటర్లలో అతడి ముఠా సభ్యులిద్దరు హతమయ్యారు.
దుబే అరెస్టుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉజ్జయిన్‌ ఆలయానికి అతడు కారులో వచ్చాడని హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్ర తెలిపారు. ‘‘అతడిని గుర్తుపట్టిన ఒక కానిస్టేబుల్‌ వెంటనే మిగతావారిని అప్రమత్తం చేశాడు. వీరు అతడిని పక్కకు తీసుకెళ్లి, ప్రశ్నించి, ఆ తర్వాత అరెస్టు చేశారు’’ అని చెప్పారు. అయితే ఆలయ వర్గాల కథనం ప్రకారం.. గుడి గేటు వద్దకు వచ్చిన దుబే ఒక పోలీసు శిబిరం సమీపంలో ఉన్న కౌంటర్‌లో రూ.250 టికెట్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం ఓ దుకాణానికి వెళ్లి, ప్రసాదం కొన్నాడు. ఆ షాపు యజమాని అతడిని గుర్తుపట్టి, పోలీసులను అప్రమత్తం చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, జీపు వద్దకు తీసుకొచ్చినప్పుడు అతడు తన పేరు వికాస్‌ దుబే అని, తాను కాన్పుర్‌ వాసినని బిగ్గరగా అరిచాడు. దీంతో ఓ పోలీసు అతడిపై చేయి చేసుకున్నాడు. మరోవైపు దుబేయే స్వయంగా ఆలయ భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లి, తన పేరు వెల్లడించి, పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నానని చెప్పినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
గత శుక్రవారం రాత్రి కాన్పుర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వస్తున్న పోలీసు బృందంపై దుబే, అతడి అనుచరులు ఆకస్మికంగా కాల్పులు జరిపి, ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దుబే గురించి సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అతడిపై హత్యా నేరాలు సహా 60 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.


ఎన్‌కౌంటర్‌..

దుబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బౌవా దుబే గురువారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కార్తికేయను బుధవారం అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కాన్పుర్‌ తీసుకొస్తున్నప్పుడు మార్గమధ్యంలో వాహనం టైరు పంక్చరైందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే అదునుగా అతడు పోలీసుల నుంచి పిస్తోలు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని వివరించారు. ప్రవీణ్‌ను ఇటావా వద్ద జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు. మొత్తం మీద బిక్రు ఘటన నాటి నుంచి దుబే అనుచరులు ఐదుగురు హతమయ్యారు.


ప్రాయోజిత అరెస్టు: కాంగ్రెస్‌

వికాస్‌ దుబే అరెస్టు ఉత్తుత్తదేని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. యూపీ పోలీసుల ఎన్‌కౌంటర్‌ నుంచి తనను తాను రక్షించుకునేందుకు అతడు సాగించిన ‘ప్రాయోజిత అరెస్టు’ అని చెప్పారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత ఒకరు సాయపడ్డారని ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్‌కు రక్షణ కల్పించారంటూ వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. ‘‘భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ అతడు ఉజ్జయిన్‌ చేరుకోవడాన్ని బట్టి చూస్తే వ్యవస్థలో లోపాలు, కుమ్మక్కుల గురించి స్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నారు.
దుబే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో సభ్యుడని అతడి తల్లి సరళా దేవి పేర్కొంది. తన కుమారుడి విషయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలిపింది. గతంలో తనకు ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు సాయం చేశారని దుబే చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీనిపై సరళా దేవి స్పందిస్తూ.. ‘‘దుబే ప్రస్తుతం భాజపాలో లేడు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నాడు’’ అని తెలిపింది. ఈ వాదనను సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఖండించారు. మరోవైపు ఆ నేరగాడు అరెస్టు అయ్యాడా లేక లొంగిపోయాడా అన్నదానిపై యూపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కోరారు. అతడి కాల్‌ డేటా రికార్డును కూడా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుబే కూడా హతం కావొచ్చని సివిల్‌ డిఫెన్స్‌ విభాగం ఐజీ అమితాబ్‌ ఠాకుర్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
దుబే చివరిసారిగా హరియాణాలోని ఫరీదాబాద్‌లో కనిపించాడు. బిక్రు ఘటన తర్వాత అతడు కాన్పుర్‌ నుంచి రాజస్థాన్‌లోని కోట మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, ఫరీదాబాద్‌ చేరుకున్నాడు. ఆ తర్వాత ఉజ్జయిన్‌ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్‌ చేరుకున్నాడని హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్ర చెప్పారు. పాల్‌ అనే పేరుతో తప్పుడు గుర్తింపు కార్డును అతడు కలిగి ఉన్నాడని వివరించారు.
దుబేను అరెస్టు చేసిన పోలీసులను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అభినందించారు. ‘‘ఆలయానికి వెళ్లి, తమ పాపాలను కడిగేసుకుందామనుకునే వారికి మహాకాలేశ్వరుడి గురించి తెలియదు. మా ప్రభుత్వం నేరగాళ్లను వదిలిపెట్టదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా దుబే భార్య, కుమారుణ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.