Lefthanders Day: ఎడమ చేతివాటం వారిలో ఉండే ప్రత్యేకతలివే..!

తాజా వార్తలు

Published : 13/08/2021 15:46 IST

Lefthanders Day: ఎడమ చేతివాటం వారిలో ఉండే ప్రత్యేకతలివే..!

నేడు అంతర్జాతీయ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని అంచనా. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎడమ చేతి ఉపయోగించడాన్ని దురాచారంగా భావిస్తుంటారు. అయితే, దీంతో కొన్ని చోట్ల వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎడమ చేతి వాటం ఉన్న వారి ఇబ్బందులపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం, వారి ప్రత్యేకతలను చాటి చెప్పడమే లక్ష్యంగా ఏటా ఆగస్టు 13న ‘అంతర్జాతీయ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ఈ సంప్రదాయం 1992, ఆగస్టు 13 నుంచి ప్రారంభమైంది. వాస్తవానికి డీన్‌ ఆర్‌ క్యాంప్‌బెల్‌ అనే వ్యక్తి 1976లో లెఫ్ట్‌హ్యాండర్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీని స్థాపించారు. అనంతరం అంతర్జాతీయ ‘లెఫ్ట్‌హ్యాండర్స్‌ క్లబ్‌’ ఒకటి ఏర్పాటై ఆగస్టు 13ను ‘లెఫ్ట్‌హ్యాండర్స్ డే’గా జరపుకోవాలని 1992లో నిర్ణయించారు.

ఎందరో ప్రముఖులు..

ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. మహాత్మాగాంధీ, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జి బుష్‌, ఒబామా, సింగర్‌ లేడీ గాగా, జస్టిన్‌ బీబర్‌, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి, ఇలా ఎడమ చేతివాటం వ్యక్తుల జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు.

ఎడమ చేతివాటం వారిపై జరిపిన పలు అధ్యయనాల్లో తేలిన ఆసక్తికరమైన విషయాలు..

* స్వతంత్ర భావాలు ఎక్కువ. జ్ఞాపక శక్తి మెండు.

* ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది.

* చిత్రకారులు, సంగీతకారులు, ఆర్కిటెక్ట్‌ల్లో ఎక్కువగా ఎడమ చేతివాటం వారే ఉంటారు.

* బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.

* బేస్‌బాల్‌, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, టెన్నిస్‌ వంటి క్రీడల్లో కుడి చేతివాటం వారితో పోలిస్తే ఎడమ చేతివాటం వారికి కాస్త ప్రయోజనం ఎక్కువ.

* టైపింగ్‌లోనూ వీరికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. క్వర్టీ కీబోర్డులో ఒక్క ఎడమ చేతితో వీరు 3000 పదాలను టైప్‌ చేయగలరు. అదే కేవలం కుడి చేయి మాత్రమే వినియోగించి 300 పదాలు మాత్రమే టైప్‌ చేయగలం.

* కొంతమంది ఎడమ చేతివాటం వారన్నా.. ఎడమ దిశ అన్నా.. భయపడుతుంటారు. దాన్ని సినిస్ట్రోఫోబియా అంటారు.

* ప్రపంచ జనాభాలో 10-12 శాతం మంది ఎడమ చేతివాటం వారే.

* మెదడులోని ఎడమ, కుడి భాగాల్లో మెరుగైన అనుసంధానం ఉంటుంది.

* కుడి చేతి అలవాటున్న వారి కన్నా ఎడం చేతి అలవాటున్న వారికి షిజోఫెర్నియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు.

* కుడి చేతివాటం వారితో పోలిస్తే.. ఎడమ చేతివాటం వారికి నీటి లోపల చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని