Corona: రెండో దఫా విజృంభణ ముగిసిందా..?

తాజా వార్తలు

Published : 05/07/2021 17:51 IST

Corona: రెండో దఫా విజృంభణ ముగిసిందా..?

దిల్లీ: దాదాపు రెండు నెలల క్రితం దేశంలో ఒక్కరోజే నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. క్రియాశీల కేసులు 37.41 లక్షల చేరాయి. ఇప్పుడు కొత్త కేసులు 40వేలకు, క్రియాశీల కేసులు 4.77లక్షలకు పడిపోయాయి. క్రమంగా ఈ తగ్గుదల కొనసాగుతోంది. కేసులు సంఖ్య క్షీణిస్తుండటంతో.. రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. అయితే అంతా సర్దుకుందని అనుకోవడానికి లేదని ఇటీవల కేంద్రం హెచ్చరించింది. రెండో దఫా విజృంభణ ముగియలేదని ప్రజలను అప్రమత్తం చేసింది. ‘దేశం మొత్తం సురక్షితంగా ఉండేవరకూ మనం వైరస్‌ నుంచి బయటపడినట్లు కాదు’ అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. ఆయన అలా అనడానికి కారణం లేకపోలేదు. 

కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలోనే కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో రోజూవారీ సగటు పాజిటివిటీ రేటు 3 శాతం దిగువనే నమోదవుతోంది. వారపు సగటు పాజిటివిటీ రేటు 3శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కానీ, దేశంలో 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క జూన్ 30 నాటికి 12 రాష్ట్రాల్లో 56 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. అదే కచ్చితమైన సంఖ్య కాదు. అన్ని కేసుల్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం కుదరదు. దాంతో ప్రస్తుతానికి డెల్టాప్లస్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. 12 రాష్ట్రాల్లో ఇవి వెలుగుచూడటం ఆందోళనకర పరిణామమేనని నిపుణులు అంటున్నారు. 

రెండో దఫా ముగియలేదని చెప్తోన్న కేంద్రం..అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపింది. వారపు సగటు పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ జిల్లాలను కంటైన్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ కిందికి తీసుకురావాలని వెల్లడించింది. ఇక వైరస్‌ కట్టడిలో టీకా కార్యక్రమానిది ప్రధాన పాత్ర అని తెలిసిందే. గర్భిణీలు కూడా టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. జూన్‌ 21 నుంచి విస్తృతంగా టీకా పంపిణీ చేపడుతోంది.  ఇదిలా ఉండగా.. రెండో దఫా వైరస్ విజృంభణ ముగియలేదని కేంద్రం చెబుతుండగా..ఆగస్టు-సెప్టెంబర్‌లో మూడో ముప్పు ఉందని మరికొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. కొవిడ్ నిబంధనలు, టీకా వేయించుకోవడమే ప్రస్తుతమున్న నివారణ మార్గాలని ప్రజలు గుర్తించాలని నిపుణులు అంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని