close

తాజా వార్తలు

మండలి సభ్యుల్ని ఎవరెన్నుకుంటారు?

చిన్నూ: అవును తాతయ్యా... ఇంతకీ శాసనమండలి సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
ఆర్వీరామారావ్‌ తాతయ్య: శాసనసభ సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారని తెలుసుగా. దీన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. కానీ శాసనమండలి విషయం అలా కాదు. ప్రజలు నేరుగా ఎన్నుకోరు.
చిన్నూ: మరెలా?
తాతయ్య: శాసనమండలి సభ్యులను ఎన్నుకోవడానికి అయిదు పద్ధతులున్నాయి. పంచాయతీలు, మున్సిపాల్టీలు మొదలైన స్థానిక స్వపరిపాలనా సంస్థల సభ్యులు.. కొంత మంది ఈ శాసనమండలి సభ్యుల్ని ఎన్నుకుంటారు.
చిన్నూ: అంటే?
తాతయ్య: ఉదాహరణకు తెలంగాణ శాసనమండలిలో 40 మంది ఉన్నారు. ఇందులో మూడో వంతు మందిని అంటే 14 మందిని  శాసనసభ్యులు, మరో 14 మందిని స్థానిక సంస్థల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీల్లాంటి  వారు ఎన్నుకుంటారు. పట్టభద్రులు ముగ్గురిని, ఉపాధ్యాయులు ముగ్గురిని ఎన్నుకుంటారు. ఆరుగురిని గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.
చిన్నూ: మరి ఆంధ్రప్రదేశ్‌లో అయితే?
తాతయ్య: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో 58 మంది సభ్యులున్నారు. 40 మందిని శాసనసభ్యులు, స్థానిక సంస్థలు ఎన్నుకుంటాయి. 8 మందిని గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. పట్టభద్రులు.. అయిదుగురిని, ఉపాధ్యాయులు.. మరో అయిదుగురిని ఎన్నుకుంటారు.
చిన్నూ: అవునూ... తెలంగాణలో 40 మంది, ఆంధ్ర  ప్రదేశ్‌లో 58 మందే ఉండాలని ఎలా నిర్ణయించారు?
తాతయ్య: శాసనమండలి సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడో వంతు ఉండాలనుకున్నారు కాబట్టి ఈ సంఖ్య ఖరారు చేశారన్నమాట.
చిన్నూ: ఓహో అలాగా. పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు మాత్రమే ప్రత్యేకంగా ఎమ్మెల్సీలెందుకు?
తాతయ్య: సమాజంలోని వివిధ వర్గాల వారికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించి వారి నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికే పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా స్థానం కల్పించారు.
చిన్నూ: మరి స్థానిక సంస్థలు కూడా శాసనమండలి సభ్యులను ఎన్నుకుంటారన్నారు గదా?
తాతయ్య: అవును. పంచాయతీలు, మున్సిపాల్టీలకు సంబంధించిన చట్టాలను కూడా చట్టసభలు ఆమోదిస్తాయి కాబట్టి వారికి ప్రాతినిధ్యం వహించడానికే శాసనమండలిలో కొన్ని స్థానాలు కేటాయించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.