నేటి నుంచి హుజూరాబాద్‌లో బండి సంజయ్‌ ప్రచారం

ప్రధానాంశాలు

నేటి నుంచి హుజూరాబాద్‌లో బండి సంజయ్‌ ప్రచారం

22, 23 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 20న జమ్మికుంట గ్రామీణ మండలంలో, 21న హూజూరాబాద్‌ గ్రామీణ మండలంలో, 22న కమలాపూర్‌లో ప్రచారం నిర్వహిస్తారు. జాతీయ కార్యవర్గసభ్యులు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి బుధవారం, విజయశాంతి గురువారం ప్రచారం చేయనున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి 22, 23 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటారు. 22న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జమ్మికుంటలో, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వీణవంక మండలంలో, ఎమ్మెల్యే రఘునందన్‌రావు హుజూరాబాద్‌ పట్టణంలో, బాబూమోహన్‌ కమలాపూర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.

నిలిపివేతకు కారణం కేసీఆరే: అరుణ

ఈనాడు, దిల్లీ, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ ఆరోపించారు. భాజపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పథకం ప్రకటించిన తర్వాత రెండు నెలలు ఎందుకు పక్కన పెట్టారని ఆమె ప్రశ్నించారు. దళితబంధు ఆపాలని భాజపా లేఖలు రాసిందని ఆరోపిస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌ వాటిని చూపాలన్నారు.

నిధుల్లేక ముఖ్యమంత్రే నిలిపేయించారు: అర్వింద్‌

రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకనే సీఎం కేసీఆర్‌ పైరవీ చేసి దళితబంధు పథకాన్ని నిలిపేసి ఉండవచ్చని నిజామాబాద్‌ ఎంపీ, భాజపా నేత అర్వింద్‌ ఆరోపించారు. దళితులపై నిజమైన ప్రేమే ఉంటే ఇతర నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్‌ మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత దళితబంధుపై మాట మార్చడం ఖాయమన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని