
తాజా వార్తలు
పంత్ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాటలు తనలో స్ఫూర్తిని రగిలించాయని యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. గబ్బా మైదానంలో జరిగిన ఆఖరి టెస్టులో సుందర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అర్ధశతకం సాధించడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.
‘‘కోచ్ రవిశాస్త్రి తన కెరీర్లో ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న విధంగానే.. సవాళ్లకు నేనూ సంసిద్ధంగా ఉన్నా. టెస్టుల్లో భారత ఓపెనర్‌గా బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నా. అయితే రవి సర్.. ఆయన ఆడిన రోజుల్లో జరిగిన స్ఫూర్తిదాయక సంఘటనలు మాతో పంచుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి, 10వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత టెస్టు ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి గొప్ప పేసర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఆయనలానే టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలని ఉంది’’ అని సుందర్ తెలిపాడు.
‘‘అంతేగాక డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో మంది రోల్ మోడల్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్ గొప్ప ఆటగాళ్లు. వాళ్లందరూ యువకులకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే టెస్టుల కోసం ఆస్ట్రేలియాలోనే ఉండటం వల్ల నా ఆట మరింత మెరుగైంది. దీనిలో మా కోచ్‌ల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ అరుణ్ సర్ ఎంతో సాయం చేశారు. బ్రిస్బేన్ టెస్టు తొలి రోజు పిచ్ స్పిన్నర్లకు అంతగా సహకరించలేదు. అయినప్పటికీ నా తొలి వికెట్‌గా స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని అన్నాడు.
‘‘పంత్ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి ఉంటుంది. 10 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన తరుణంలో.. 25-30 పరుగులు వేగంగా చేయాలని భావించాం. అలా చేస్తే లక్ష్యాన్ని ఛేదించగలమని అనుకున్నాం. విజయం సాధించాం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు. అతడితో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాను’’ అని సుందర్ అన్నాడు. ఛేదనలో పంత్‌తో కలిసి సుందర్ వేగంగా పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌లో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టెస్టులకు బ్యాకప్ ప్లేయర్‌గా ఉన్న సుందర్ ఆఖరి టెస్టులో అరంగేట్రం చేసి అంచనాలకు మించి అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి
‘301’ క్యాప్.. వెలకట్టలేని సంపద
మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..