close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరంభం అదిరింది!

360 డిగ్రీల ఆటగాడు

సూర్యకుమార్‌ యాదవ్‌... అరంగేట్ర అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలిబంతిని సిక్సర్‌ కొట్టిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్‌. అదే జోరుతో అర్ధ సెంచరీ చేశాడు. ఇషాన్‌ కిషన్‌... ఆడిన మొదటి టీ20లోనే 32 బంతుల్లో 56 పరుగులతో చెలరేగిపోయాడు. అదిరే ఆరంభం వెనక వీళ్ల శ్రమ ఎంతో..!

ఆరేళ్లు వేచి చూశా!

పదేళ్లుగా రంజీలూ, ఐపీఎల్‌ ఆడుతున్నా. ఇండియాకి ఆడాలని పదే పదే అనుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. జట్టులో స్థానం దొరకనపుడు నాకు అన్యాయం జరిగిందని బాధపడలేదు. పరుగులు సాధిస్తూ, మ్యాచ్‌లు గెలుస్తుంటే కచ్చితంగా న్యాయం జరుగుతుందనుకుంటూ ఆడుతూ వచ్చా.అలా ఆరేళ్లు కష్టపడ్డా.

క్రికెట్‌లోకి ఎలా?

పుట్టి పెరిగింది ముంబయిలో. చిన్నపుడు బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ రెండూ ఆడేవాణ్ణి. ఏదో ఒకటి ఎంచుకోమని నాన్న అడిగినపుడు క్రికెట్‌ని ఎంచుకున్నా.

ప్రశాంతత అవసరం

ఈ ఆటలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. అందుకోసమే నా ఫోన్లో ‘వన్‌ జయంట్‌ మైండ్‌’ ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా. ఒత్తిడిలో ఉన్నపుడు ఎలా శ్వాస తీసుకోవాలీ,ఎలా సానుకూలంగా ఆలోచించాలీ లాంటి విషయాల్ని చెబుతుందిది. ఈ ఆప్‌ నాలో చాలా మార్పు తెచ్చింది.

ఆనందంతో ఏడ్చేశాం

గత ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చా. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయకపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డా. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికయ్యానని తెలియగానే అమ్మానాన్నలకీ, నా భార్యకీ, చెల్లికీ ఫోన్‌చేశా. వీడియో కాల్‌లో మాట్లాడుతుంటే అందరి కళ్లలోనూ ఆనందబాష్పాలే.

ప్రత్యేకమైన షాట్లు

చిన్నప్పట్నుంచీ నిర్భయంగా షాట్లు ఆడతాను. అలాగని అన్ని షాట్లనీ ముందుగా ప్రాక్టీసు చేయను. బంతినిబట్టి స్పందిస్తానంతే. పోటీ ఎక్కువగా ఉండే టీ20 క్రికెట్‌లో ప్రత్యేక షాట్లు ఆడకుంటే పరుగులు రాబట్టలేం. ప్రత్యేక గుర్తింపు ఉండదు కూడా. అందుకే మైదానంలో అన్నివైపులా (360 డిగ్రీల్లో) ఆడతా.

‘ఛోటా డైనమైట్‌’
బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌కు

మా సొంతూరు బిహార్‌లోని నవాడా. ఏడేళ్లకే క్రికెట్‌ అకాడమీలో నన్నూ అన్నయ్య రాజ్‌నీ చేర్పించారు నాన్న. ‘క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకోవడానికి ఒకరికే ఛాన్స్‌’ అని నాన్న చెప్పేసరికి నాకోసం అన్నయ్య క్రికెట్‌ వదులుకున్నాడు. బిహార్‌ క్రికెట్‌ బోర్డు సభ్యత్వాన్ని బీసీసీఐ రద్దుచేయడంతో 15 ఏళ్లపుడు ఝార్ఖండ్‌కు మారా.

ఐపీఎల్‌ అనుభవం

ఐపీఎల్‌లో 2018 నుంచి ముంబయి ఇండియన్స్‌ జట్టుకి ఆడుతున్నా. ర్యాంప్‌, రివర్స్‌ స్వీప్స్‌ లాంటివి జట్టులోని సీనియర్ల దగ్గరే నేర్చుకున్నా. పోలార్డ్‌, హార్దిక్‌ పాండ్యాల ఆట గమనిస్తాను. వాళ్లు ధాటిగా ఆడటమే కాదు, గేమ్‌ని ఆఖరి ఓవర్‌ వరకూ తీసుకువెళ్తారు. బౌలర్లమీద ఒత్తిడి పెంచుతారు.

ఫోన్‌ తీయలేదు

గత ఐపీఎల్‌లో 483 పరుగులు చేశా. టీమిండియాలో చోటు వస్తుందని ఊహించా. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి ఎంపికయ్యానని తెలిశాక ఇంటికి ఫోన్‌ చేస్తే అమ్మానాన్నా, అన్నయ్యా ఎవరూ ఫోన్‌ తీయలేదు. దాదాపు నాలుగు గంటల తర్వాత వాళ్లు తిరిగి ఫోన్‌ చేశారు. భావోద్వేగానికి లోనై ఏడవడం మొదలుపెట్టారు.

ధోనీతో పోలిక

ఓరోజు స్కూల్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్‌ రాకపోవడంతో నాకు గ్లవ్స్‌ ఇచ్చారు. ఆరోజు కీపింగ్‌ బాగా చేయడంతో వికెట్‌ కీపర్‌గా తర్వాత నన్నే కొనసాగించారు. కొన్నాళ్లకు నన్ను ధోనీతో పోల్చుతూ ‘ఛోటా డైనమైట్‌’ అనడం మొదలుపెట్టారు. నేనూ ధోనీకి వీరాభిమానిని. 2015-16లో విజయ్‌ హజారే ట్రోఫీలో అతడితో కలిసి ఆడటాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ‘బ్యాటింగ్‌లో అటాకింగ్‌ చేసేటపుడు మధ్య మధ్యలో నియంత్రించుకోవాలి. నీ దగ్గర ఎన్నో షాట్లు ఉన్నాయి. క్రీజ్‌లో నిలదొక్కుకుంటేనే అవి ఆడగలవు’ అని ధోనీ చెప్పిన
సలహాని ఇప్పటికీ పాటిస్తా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు