close
రోగాలను నయంచేసే మహంకాళి!

మహాచండి... మహాశక్తి... ఇలా వివిధ శక్తిరూపాల్లో ఉగ్రమూర్తిగా పార్వతీదేవి పూజలందుకుంటున్నా తనను నమ్మి కొలిచిన భక్తులపాలిట ఆ తల్లి ఎప్పుడూ కల్పవృక్షమే. అలాంటి శక్తి క్షేత్రాల్లో ఒకటిగా అత్యంత పురాతన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది మహారాష్ట్రలోని చంద్రపూర్‌ మహంకాళీ అమ్మవారి దేవాలయం.

మహారాష్ట్రవాసులకే కాదు తెలంగాణావాసుల ఆరాధ్యదేవతగానూ చంద్రపూర్‌ మహంకాళి అమ్మవారు పూజలందుకుంటోంది. ఏటా చైత్ర పౌర్ణమి నుంచి ఇరవై రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో తెలంగాణ నుంచీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మామూలు ఆలయాలకు భిన్నంగా ఇక్కడ అమ్మవారు భూమట్టానికి దిగువభాగంలో స్వయంభూగా వెలవడం విశేషం. ఏడాదికి ఒక్కసారైనా అమ్మను దర్శించుకుని, అమ్మ ఒడిని నింపితే తమ కుటుంబాలు పిల్లాపాపలతో సుభిక్షంగా ఉంటాయన్నది భక్తుల విశ్వాసం.

వేల ఏళ్లనాటి ఆలయం
చంద్రపూర్‌ పట్టణంలోని మహంకాళి ఆలయాన్ని సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం బల్లార్ష అనే గోండు రాజు స్థాపించాడని స్థలపురాణం తెలియజేస్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించే బల్లార్ష అనే రాజును ఎప్పుడూ ఏదో ఒక సుస్తీ వేధిస్తూనే ఉండేదట. ఒకరోజు రాజు ఇక్కడి అడవుల్లో వేటకు వెళ్లినపుడు మధ్యలో దాహార్తిని తీర్చుకోవడానికి పక్కనే ఉన్న ఇరయి నది వద్దకు వెళ్లగా, కొంచెం నీళ్లు తాగేసరికి ఆశ్చర్యకరంగా తన అనారోగ్యాల నుంచి
ఉపశమనం పొందిన అనుభూతి కలిగిందట. ఈ నదికి ఏదో మహత్యం ఉందని భావించిన రాజు వెంటనే ఒడ్డున ఒక శివాలయాన్ని నిర్మించి, నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించడం ప్రారంభించాడు. ఒకనాడు బల్లార్ష రాజుకు పార్వతీదేవి కలలో కనిపించి దగ్గరలో ఉన్న ప్రాచీన గుహల్లో తన విగ్రహం ఉందనీ, దానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చెయ్యమనీ ఆదేశిస్తుంది. కలలో కనిపించిన గుహను వెతుక్కుంటూ వెళ్లిన రాజుకు గుహలో అయిదున్నర అడుగుల దేవీ విగ్రహం దర్శనమిస్తుంది. దీంతో ఆ గుహని ఆలయంగా మార్చి, అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలోనే ఖిల్లాను ఏర్పరుచుకొని పరిపాలన సాగించాడు. 1700 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించే రాజా బీర్‌షా తన యుద్ధ విజయాలకు గుర్తుగా అమ్మవారికి ఆలయాన్ని పునర్నిర్మించి, ఎన్నో కానుకలను ఈ ఆలయానికి సమర్పించాడు.

20 రోజుల జాతర
ఏటా చైత్రమాసంలోని పౌర్ణమి రోజున అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. సుమారు ఇరవై రోజుల పాటు సాగే ఈ జాతరకోసం అక్కడి ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేపడుతుంది. ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇరయి నదిలో స్నానమాచరించి, సపరివారంగా డప్పువాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. గోధుమ పిండితో చేసిన ప్రత్యేక ప్రమిదల్లో నేతితో దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. దేవి ఒడి నింపడం ఈ జాతరలోని ప్రత్యేకత. అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపూ కుంకుమ, ప్రసాదాలు మొదలైనవన్నీ తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం నడుముకు కట్టిన ఒడికట్టుచీరలో వేస్తారు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం భూ మట్టం కంటే కొంచెం కిందకి ఉంటుంది. భక్తులు గుహలోనుంచి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. జాతర రోజుల్లోనూ, నవరాత్రుల్లోనూ, ప్రతి మంగళ,
శుక్రవారాల్లోనూ అమ్మవారికి వెండి కిరీటాన్ని ధరింపచేయడంతోపాటు ప్రత్యేక అలంకారాలను చేస్తారు.

జాతరకు ప్రత్యేక బస్సులు
మహారాష్ట్రలోని నాందేడ్‌, ఫర్భిణీ, లాతూర్‌ తదితర జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీగా భక్తులు జాతరకు వస్తుంటారు. తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం జాతర ప్రారంభం రోజు నుంచీ సుమారు ఇరవై రోజులపాటు రోజుకు 20 అదనపు ప్రత్యేక బస్సులను ఆదిలాబాద్‌ డిపో ఏర్పాటు చేస్తుంది.

- బండారి సాయికుమార్‌, ఆదిలాబాద్‌ డెస్క్‌
ఫొటోలు: శ్రీనివాస్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.