CBSE: అది నమ్మొద్దు.. అలాంటి నిర్ణయమేదీ మేం తీసుకోలేదు

రైతుల ఆందోళనల నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని సీబీఎస్‌ఈ ఖండించింది.

Published : 16 Feb 2024 18:34 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న ఓ నకిలీ లేఖపై CBSE బోర్డు స్పందించింది. పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు అందులో ఉన్న నకిలీ సమాచారంపై పాఠశాలలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేసింది. కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని, పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ ప్రిన్సిపాళ్లకు అడ్రస్‌ చేస్తూ సీబీఎస్‌ఈ బోర్డు పేరిట ఓ నకిలీ లేఖ హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసింది.  ‘‘అప్రమత్తంగా ఉండండి.. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఆ లేఖ నకిలీది.. తప్పుదోవ పట్టించేది. అలాంటి నిర్ణయం ఏదీ బోర్డు తీసుకోలేదు’’ అని పేర్కొంది.

ఆ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఫేక్‌.. ఫాలో కావొద్దు: సీబీఎస్‌ఈ హెచ్చరిక

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి  మొదలైన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు 27 దేశాల్లో దాదాపు 39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.  రైతుల దిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయల్దేరి పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఇప్పటికే సీబీఎస్‌ఈ సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు, ‘ఎక్స్‌’లో CBSE పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరిన బోర్డు ఇటీవల 30 నకిలీ ఖాతాల జాబితాను విడుదల చేసింది. '@cbseindia29' హ్యాండిల్‌ మాత్రమే అధికారిక ఖాతా అని, దాంట్లో వచ్చిన సమాచారాన్నే నమ్మాలని కోరింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని