NEET UG: ఆ 1500 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కుల్ని సమీక్షిస్తాం: ఎన్టీఏ డీజీ

నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని ఎన్టీఏ డీజీ వెల్లడించారు.

Updated : 08 Jun 2024 19:27 IST

దిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష (NEET 2024)లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు.

గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ .. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియపైనా ఏ ప్రభావమూ చూపదని పేర్కొన్నారు. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్‌ లీక్‌ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై నిర్ణయం కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు