సూపర్‌వైజర్‌ ట్రెయినీగా చేరతారా?

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ (ఐఆర్‌ఈఎల్‌-ఇండియా) లిమిటెడ్‌ 56 నాన్‌-అన్‌యూనియనైజ్డ్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 07 Nov 2023 04:01 IST

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ (ఐఆర్‌ఈఎల్‌-ఇండియా) లిమిటెడ్‌ 56 నాన్‌-అన్‌యూనియనైజ్డ్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌) -03, గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (హెచ్‌ఆర్‌)-04, డిప్లొమా ట్రెయినీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌)- 37, ట్రెయినీ (జియాలజిస్ట్‌/పెట్రోలజిస్ట్‌)-08, ట్రెయినీ కెమిస్ట్‌-04 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 56 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 22, ఈడబ్ల్యూఎస్‌కు 06, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 15, ఎస్సీలకు 9, ఎస్టీలకు 04 కేటాయించారు.

ఏ అర్హతలు ఉండాలి?

1 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌): కామర్స్‌ డిగ్రీ.

2 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (హెచ్‌ఆర్‌): ఏదైనా డిగ్రీ.

3 డిప్లొమా ట్రెయినీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌): సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా.

4 ట్రెయినీ (జియాలజిస్ట్‌/పెట్రోలజిస్ట్‌): జియాలజీ/  అప్లైడ్‌ జియాలజీలో డిగ్రీ.

5 ట్రెయినీ కెమిస్ట్‌ : మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా/ కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా సైన్స్‌ డిగ్రీ.

  • ఈ పోస్టులన్నింటికీ రెగ్యులర్‌గా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. యూఆర్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి.
  • ఎంఎస్‌-ఆఫీస్‌, విండోస్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
  • అన్ని పోస్టులకూ 26 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఈఎస్‌ఎంలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు దరఖాస్తు   ఫీజు రూ.500. దీన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మహిళలు,  ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్‌ఎం కేటగిరీలకు  చెందిన అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం

రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వయసు, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ముందుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు ఎంపికచేస్తారు.

సీబీటీ: దీంట్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-2లో జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీకి, జనరల్‌ ఇంగ్లిష్‌కు చెందిన 50 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. జనరల్‌ (యూఆర్‌), ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను స్కిల్‌/ ట్రేడ్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.

రాత పరీక్ష కేంద్రాలు: ముంబయి, నాగ్‌పుర్‌, త్రివేండ్రం, కొచ్చి, భువనేశ్వర్‌, నాగర్‌కోయల్‌. అభ్యర్థులు రెండు కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మార్చడానికి అవకాశం ఉండదు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. వీరిని దేశంలోని సంస్థ యూనిట్లు/ ఆఫీసుల్లో ఎక్కడైనా నియమించవచ్చు.

సన్నద్ధత: పేపర్‌-1లో డిగ్రీ లేదా డిప్లొమాలో చదివిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి వాటిని పునశ్చరణ చేసుకోవాలి. చదివన అంశాలేనని నిర్లక్ష్యం చేయకుండా వాటిపై పట్టు సాధించాలి.

  • బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాల్లోని జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీకి, జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండే నమూనా పరీక్షలు రాస్తే మేలు. ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారో, వేటిల్లో వెనకబడి ఉన్నారనే విషయంలో స్పష్టత వస్తుంది.
  • నమూనా పరీక్షలు రాయడంతో నైపుణ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని మెరుగుపరుచుకునే వీలు  కలుగుతుంది.
  • పట్టు తక్కువ ఉన్న చాప్టర్లకు ఎక్కువ సమయాన్ని కేటాయించి పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.
  • పోటీ పరీక్షల్లో సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది. సాధన ద్వారా దీనిపై పట్టు సాధించవచ్చు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 14.11.2023

వెబ్‌సైట్‌: http://www.irel.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని