అవుతారా... ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌?

దేశంలో ప్రభుత్వ పరంగా జరిగే నియామకాల్లో ముఖ్యమైన విభాగాల్లో కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఒకటి. సాధారణ డిగ్రీ విద్యార్హతతో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి పోటీ పడే అవకాశం వచ్చింది.

Updated : 04 Dec 2023 02:57 IST

డిగ్రీ అర్హత
995 పోస్టులు

దేశంలో ప్రభుత్వ పరంగా జరిగే నియామకాల్లో ముఖ్యమైన విభాగాల్లో కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఒకటి. సాధారణ డిగ్రీ విద్యార్హతతో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి పోటీ పడే అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా 995 ఖాళీలున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు లెవెల్‌-7 వేతన శ్రేణితో మొదటి నెల నుంచే రూ.80వేలకు పైగా పొందవచ్చు. ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవారు ఈ పోటీ పరీక్షను ఎదుర్కోవచ్చు.

క్కువమంది యువత ఇష్టపడే, పోటీ పడుతోన్న ఉద్యోగాల్లో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఒకటి. సామాజిక గుర్తింపు, హోదా, ఆకర్షణీయ వేతనం, వృత్తిపరమైన సవాళ్లు, వాటి ద్వారా లభించే సంతృప్తి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం.. ఇవన్నీ యువతలో ఈ ఉద్యోగంపై ఆసక్తిని పెంచుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతం నుంచైనా సేవలు అందించడానికి సిద్ధమైనవారు ఇంటెలిజెన్స్‌ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఇప్పటికే పోటీ పరీక్షల సన్నద్ధతలో ఉన్నవారు ఈ పరీక్షను కొంచెం సులువుగానే ఎదుర్కోవచ్చు. తాజా గ్రాడ్యుయేట్లు సైతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మొదటిసారే మెరిసే అవకాశం ఉంది. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ప్రతిభతో తుది నియామకాలుంటాయి. ఇలా అవకాశం వచ్చినవారికి రూ.44,900 మూలవేతనంతోపాటు డీఏ, ఎస్‌ఎస్‌ఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రయోజనాలూ దక్కుతాయి. మొత్తం మీద వీరు రూ.80 వేలకు తగ్గకుండా మొదటి నెల నుంచే వేతనం పొందవచ్చు.


పరీక్షలు ఇలా

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. టైర్‌-1 పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో, టైర్‌-2 డిస్క్రిప్టివ్‌గానూ ఉంటుంది.  

టైర్‌-1: ఇందులో 5 విభాగాల నుంచి వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ ఒక్కో విభాగంలో 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి ఒక గంట.

టైర్‌-2: దీనికి 50 మార్కులు. ఇందులో ఎస్సే 30 మార్కులకు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసీ రైటింగ్‌ 20 మార్కులకు ఉంటాయి. వ్యవధి గంట.

ఇంటర్వ్యూ: దీనికి వంద మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా సైకోమెట్రిక్‌/ ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహిస్తారు.


ఎంపికవ్వాలంటే..

టైర్‌-1 పరీక్షలో అన్‌ రిజర్వ్‌డ్‌, ఈడబ్ల్యుఎస్‌ 35, ఓబీసీ 34, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు పొందాలి. ఇలా కనీస మార్కులు పొందినవారి జాబితా నుంచి ఆ విభాగాల వారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను టైర్‌-2కి ఎంపిక చేస్తారు. టైర్‌-2లో కనీసం 17 మార్కులు పొందడం తప్పనిసరి. ఇందులో అర్హత పొందినవారి జాబితాకు వారు టైర్‌-1లో పొందిన మార్కులను కలుపుతారు. ఈ మార్కుల మెరిట్‌తో విభాగాల వారీ ఖాళీలకు ఐదు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది నియామకాలు టైర్‌-1, టైర్‌-2, ఇంటర్వ్యూల్లో సాధించిన మొత్తం మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి.


ఏ విభాగం ఎలా?

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌: ఇందులో ఎక్కువ ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. అయితే జవాబు కోసం ఎక్కువ సమయం అవసరం. అందువల్ల పరీక్షకు ముందు వీలైనన్ని  మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు తక్కువ వ్యవధిలో సమాధానాలు గుర్తించగలరు. బ్యాంకు క్లరికల్‌ ప్రిలిమ్స్‌ స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. అంకెలపై పట్టు పెంచుకోవాలి. భాగహారం, గుణకారం, కూడికలు, తీసివేతలను క్షుణ్నంగా సాధన చేయాలి. వర్గాలు, ఘనాలు, ఘాతాంకాలు, భిన్నాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. కాలం-పని, కాలం-దూరం, లాభనష్టాలు, శాతాలు, సరాసరి, నిష్పత్తులు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలైన అంశాలనూ చదవాలి. 8, 9, 10 తరగతుల గణిత పుస్తకాల్లోని జనరల్‌ మ్యాథ్స్‌ అధ్యాయాలు సాధన చేయాలి. ఈ విభాగంలో కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లను ఎలిమినేట్‌ చేస్తూ సరైన జవాబు గుర్తించవచ్చు.


రీజనింగ్‌/ లాజికల్‌ ఆప్టిట్యూడ్‌: నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మన్‌ అవుట్‌, క్లాక్‌, క్యాలెండర్‌, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్‌, డైస్‌, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్‌, పజిల్స్‌, సిలాజిజమ్‌, ర్యాంకింగ్‌, సీక్వెన్స్‌, సింబాలిక్‌ ఆపరేషన్స్‌, నెంబర్‌ ఎనాలజీ, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ క్లాసిఫికేషన్‌, సిరీస్‌, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. అలాగే తర్కాన్నీ ఉపయోగించాలి.  

జనరల్‌ స్టడీస్‌: స్టాక్‌ జీకే అధ్యయనం చేయాలి. వివిధ అంశాలకు సంబంధించి ఎత్తయినవి, లోతైనవి, పొడవైనవి, పొట్టివి, పెద్దవి...ఇలా వీటిపై కొన్ని ప్రశ్నలు రావచ్చు. అలాగే దేశాలు... వాటి రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్‌ పేరు, ప్రధాని లేదా అధ్యక్షులు...ఈ రకమైన ప్రశ్నలూ ఉండొచ్చు. ఉద్యోగం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో కాబట్టి ప్రపంచ స్థాయిలో తీవ్రవాదం, హింస...మొదలైనవాటిని ఎదుర్కోవడానికి జరుగుతున్న కృషి, ఈ దిశగా పనిచేస్తున్న సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ నేరాలు, మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అంతర్జాతీయ సమస్యలు, భద్రత, సరిహద్దు గొడవలు, విభజన రేఖలు...ఇవన్నీ ప్రశ్నలడగడానికి అవకాశం ఉన్నవే. భారతదేశం ఎదుర్కొంటోన్న సమస్యలు, సవాళ్లు, ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాలు, దేశ సరిహద్దులు వీటిని చదవాలి.

కరెంట్‌ అఫైర్స్‌: తాజా పరిణామాలపై పరిశీలన, అవగాహనను పరిశీలించే ప్రశ్నలుంటాయి. ఇటీవల నోబెల్‌ బహుమతులు ప్రకటించారు. వాటి నుంచి కనీసం ఒక ప్రశ్న రావచ్చు. అలాగే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌, ఆసియా క్రీడలు, తాజా ఎన్నికల ఫలితాలు, వివిధ అంతర్జాతీయ సమావేశాలు, ప్రధాని విదేశీ పర్యటనలు, ప్రభుత్వ కొత్త పథకాలు... ఇలా జాతీయ స్థాయిలో ముఖ్యమైన అంశాలన్నీ ప్రశ్నలుగా రావడానికి అవకాశం ఉన్నవే. వీటిని ఎదుర్కోవడానికి రోజూ ఏదైనా వార్తాపత్రికను చదువుతూ, ముఖ్యాంశాలను నోట్సు రాసి, పరీక్ష ముందు మరోసారి చదవాలి. జనవరి, 2023 నుంచి, పరీక్ష తేదీకి పది రోజుల ముందు వరకు జరిగిన ముఖ్య సంఘటనలకు ప్రాధాన్యమివ్వాలి.  

ఇంగ్లిష్‌: వ్యాకరణాంశాలు, పద సంపదపై పట్టు పెంచుకోవాలి. ఆర్టికల్స్‌, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌, వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. హైస్కూల్‌ స్థాయి వ్యాకరణాంశాలను బాగా సాధన చేయాలి.

టైర్‌-2: ఈ విభాగంలో అభ్యర్థి పరిజ్ఞానం, ఆంగ్ల నైపుణ్యం పరిశీలిస్తారు. విశ్లేషణాత్మకంగా రాయగలిగే నేర్పు ఉండాలి. రాత నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. తాజా పరిణామాలపై నిపుణులు రాసిన వ్యాసాలు అధ్యయనం చేయాలి. పరీక్ష ఇంటెలిజెన్స్‌ బ్యూరో కాబట్టి సెక్యూరిటీ (సోషల్‌, సైబర్‌), టెర్రరిజం, క్రైమ్‌, బోర్డర్‌ సమస్యలు...ఈ అంశాల్లో వచ్చిన వ్యాసాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ద హిందూ/టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎడిట్‌ పేజీలు చదవాలి. అనంతరం చదివిన వ్యాసంలో ముఖ్యాంశాలను సొంతంగా రాసి, తప్పులు సరిదిద్దుకోవాలి.


కేవలం 36 సెకన్లే!

టైర్‌-1లో వంద ప్రశ్నలకు ఒక గంట. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయమే లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు కచ్చితత్వంతో జవాబులు గుర్తించాలి.
ఎలిమినేషన్‌ టెక్నిక్‌ ఉపయోగించాలి. తెలియనివాటి జోలికి వెళ్లకుండా, జవాబు కోసం ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను వదిలేయాలి.

కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసుకోవాలి. ఇలాచేస్తేనే న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాల్లో గరిష్ఠ ప్రశ్నలకు జవాబు గుర్తించే అవకాశం దక్కుతుంది.


మెలకువలు ఇవీ

1 కొత్తగా సన్నద్ధమవుతున్నవారు ప్రాథమికాంశాలను బాగా చదవాలి.

2 విభాగాల వారీగా వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. తప్పులు జరుగుతోన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

3 పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. దీంతో ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో తెలుస్తుంది.

4 ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఐబీపీఎస్‌ల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.

5 పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. ఆ ఫలితాలు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. తుది సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి.

6 స్కోరు 60కి తగ్గకుండా చూసుకుంటే తర్వాత దశకు చేరుకోవచ్చు.

7 పరీక్ష రాసినప్పుడు తెలియని ప్రశ్నలు వదిలేయాలి. అలాగే ఎక్కువ వ్యవధి తీసుకునేవాటిని ఆఖరులో సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.


ముఖ్య సమాచారం

ఖాళీలు: 995. అన్‌రిజర్వ్‌డ్‌ 377, ఈడబ్ల్యుఎస్‌ 129, ఓబీసీ 222, ఎస్సీ 134, ఎస్టీ 133.
అర్హత: ఏదైనా డిగ్రీ. దివ్యాంగులకు అవకాశం లేదు.

వయసు: డిసెంబరు 15, 2023 నాటికి 18 - 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు. భర్త చనిపోయిన, విడాకులు పొంది తిరిగి పెళ్లి చేసుకోని జనరల్‌ మహిళలైతే 35 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలైతే 40 ఏళ్ల వయసు వరకు మినహాయింపు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15  

పరీక్ష ఫీజు: రిక్రూట్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ ఛార్జీ రూ.450 అభ్యర్థులందరూ చెల్లించాలి. దీంతోపాటు యూఆర్‌, ఈడబ్ల్యుఎస్‌, ఓబీసీ విభాగాల పురుషులు రూ.వంద పరీక్ష ఫీజు కట్టాలి.
పరీక్ష తేదీలు: ప్రకటించలేదు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని