స్వాగతిస్తోంది.. స్టేట్‌ బ్యాంకు!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ) పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 5280 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అమరావతి సర్కిల్‌ ఆంధ్రప్రదేశ్‌లో 400, హైదరాబాద్‌ సర్కిల్‌  తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.

Updated : 08 Dec 2023 09:52 IST

5280 సీబీఓ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ) పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 5280 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అమరావతి సర్కిల్‌ ఆంధ్రప్రదేశ్‌లో 400, హైదరాబాద్‌ సర్కిల్‌  తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకు కార్యకలాపాల పట్ల అనుభవం ఉన్న అభ్యర్థులను నియమిస్తే కాలయాపన, శిక్షణ అవసరం లేకుండా అభ్యర్థులు తమ విధులను నిర్వర్తించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ నియామకాలను చేపడుతోందని భావించవచ్చు.  ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించి, ప్రైవేటు బ్యాంకుల్లో అవకాశం వచ్చిన కారణంగా చేరిన అభ్యర్థులకూ; అదేవిధంగా గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్నవారికీ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో స్కేల్‌-1 ఆఫీసర్‌గా ఉద్యోగం పొందే అవకాశం ఈ ప్రకటనతో లభిస్తుంది. ఎంపికైనవారికి పదోన్నతులు కూడా ప్రొబేషనరీ ఆఫీసర్లగా నియమితులైనవారి మాదిరిగానే ఉంటాయి.  

ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఏదో ఒక సర్కిల్‌కే దరఖాస్తు చేసుకోవాలి. అవకాశం వస్తే ఆ సర్కిల్‌లోనే విధులు నిర్వహిస్తారు. స్కేల్‌ 4 ఆఫీసర్‌ స్థాయికి చేరుకునే వరకు లేదా 12 ఏళ్ల అనుభవం (వీటిలో ఆలస్యమైనదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు) అదే సర్కిల్‌లో సేవలు అందించాలి. ప్రొబేషన్‌ వ్యవధి 6 నెలలు. ఈ వ్యవధిలో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినవారిని స్కేల్‌-1 ఆఫీసర్‌గా అవకాశమిస్తారు. అప్పటి వరకు వీరిని సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ)గా వ్యవహరిస్తారు.

వీరికి రూ.36,000 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో సుమారు రూ.70 వేలకుపైగా వేతనం అందుకోవచ్చు.

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూలతో

పరీక్ష ఇలా

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 120 ప్రశ్నలు. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ సమయ నిబంధన ఉంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు అరగంట, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలకు 40 నిమిషాలు, జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమీ 30 ప్రశ్నలకు అరగంట, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలకు 20 నిమిషాలు కేటాయించారు. రుణాత్మక మార్కులు లేవు. అలాగే సెక్షన్ల వారీ కనీస మార్కుల నిబంధన లేదు.

డిస్క్రిప్టివ్‌: ఈ పరీక్ష వ్యవధి అరగంట. ఆంగ్లంలో రాత నైపుణ్యాలు పరిశీలిస్తారు. లెటర్‌ రైటింగ్‌, ఎస్సేల ద్వారా ప్రతిభ తెలుసుకుంటారు.

ఇంటర్వ్యూ: 50 మార్కులు.

తుది నియామకాలు: ఆన్‌లైన్‌ టెస్టు (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), ఇంటర్వ్యూ మార్కులతో ఉంటాయి. పరీక్ష మార్కులను 75కి, ఇంటర్వ్యూని 25కి కుదించి, వచ్చిన మార్కులను కలిపి, మెరిట్‌, రిజర్వేషన్‌, సర్కిల్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు.

ముఖ్య వివరాలు

పోస్టు: సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

ఖాళీలు: 5280+ బ్యాక్‌లాగ్‌ 167 (అమరావతి 400, హైదరాబాద్‌ 425)

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి రెండేళ్లు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకు (రీజనల్‌ రూరల్‌ బ్యాంకు)ల్లో ఆఫీసర్‌ స్థాయిలో పనిచేసి ఉండాలి. అక్టోబరు 31, 2023 నాటికి రెండేళ్ల అనుభవం పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకున్న సర్కిల్‌కు చెందిన స్థానిక భాషలో రాయడం, మాట్లాడటం, చదవడం, అర్థం చేసుకోవడం రావాలి. ఇందుకోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పది లేదా ఇంటర్మీడియట్‌లో ఆ స్థానిక భాష చదివితే పరీక్ష మినహాయిస్తారు.

వయసు: అక్టోబరు 31, 2023 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. అంటే నవంబరు 1, 1993 - అక్టోబరు 31, 2002 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు

రూ.750. ఇతర వర్గాలు చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023

పరీక్షలు: జనవరి, 2024లో ఉండొచ్చు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings

సన్నద్ధత ఇలా!

1.ఈ ఉద్యోగానికి రెండేళ్ల అనుభవం తప్పనిసరి కాబట్టి పరీక్ష కఠినంగానే ఉంటుంది. అభ్యర్థుల నుంచి అత్యున్నత స్థాయి నైపుణ్యాలను ఆశిస్తారు. అలాగే ఒకటే పరీక్ష కాబట్టి అది ఎస్‌బీఐ మెయిన్స్‌ స్థాయి కంటే కొంచెం కఠినంగానే ఉంటుందని భావించాలి.

2.ఇటీవల నిర్వహించిన ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ మెయిన్స్‌ ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయాలి.

3.వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితాలు సమీక్షించుకోవాలి.

4.ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష పూర్తికాగానే డిస్క్రిప్టివ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇప్పటి నుంచే రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. విషయంతోపాటు, వ్యక్తీకరించిన విధానానికి మార్కులు ఉంటాయి.

5.ఎస్‌బీఐలో రెండేళ్ల అనుభవం ఉన్న అధికారికి ఎలాంటి నైపుణ్యాలు ఉంటాయో వాటినే అభ్యర్థుల నుంచి ఆశిస్తారు. అందువల్ల ఆ స్థాయి పరిజ్ఞానం ఉంటేనే పరీక్షలో విజయవంతం కాగలరు. ఇప్పటికే ఆ బ్యాంకులో సర్కిల్‌ బేస్డ్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నవారి నుంచి సలహాలు పొందవచ్చు.

ప్రశ్నలు వేటిలో?

బ్యాంకింగ్‌ నాలెడ్డ్‌: ఈ విభాగానికి 40 మార్కులు. బ్యాంకు వ్యవహారాలపై అత్యున్నత స్థాయిలో పరిజ్ఞానం ఉంటేనే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు. వీటిని అనువర్తిత ధోరణిలో అడగవచ్చు. ఆర్‌బీఐ, బ్యాంకు పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు  0-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమీ: వీటిలో రోజువారీ సంఘటన (వర్తమాన వ్యవహారాలు)లు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో ప్రాథమికాంశాలు చదువుతూ, లోతైన అధ్యయనమూ ఉండాలి. బ్యాంకుల ఆర్థిక వ్యవహారాలపై పట్టు పెంచుకోవాలి.

కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: కంప్యూటర్‌/ఐటీల్లో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. బ్యాంకు కార్యకలాపాలకు అవసరమయ్యే కనీస సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించగలరో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు రూపొందిస్తారు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు ఉండాలి. ఆంగ్ల దినపత్రికల్లో వ్యాసాలు చదివి భాషపై పట్టు పెంచుకోవాలి. కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌, వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ స్పీచ్‌లలో ప్రశ్నలు రావచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని