గ్రామీణ బ్యాంకుల్లో 9995 కొలువులు!

బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త! దేశంలోని 43 గ్రామీణ బ్యాంకుల్లో  9995 కొలువుల నియామకానికి ప్రకటన వెలువడింది. ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్కేల్‌ 1, 2, 3 ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 450 (ఆఫీస్‌ అసిస్టెంట్లు-150, ఆఫీసర్లు-300), తెలంగాణలో 700 (ఆఫీస్‌ అసిస్టెంట్లు-420, ఆఫీసర్లు-280) ఖాళీలున్నాయి.

Published : 10 Jun 2024 00:33 IST

బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త! దేశంలోని 43 గ్రామీణ బ్యాంకుల్లో  9995 కొలువుల నియామకానికి ప్రకటన వెలువడింది. ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్కేల్‌ 1, 2, 3 ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 450 (ఆఫీస్‌ అసిస్టెంట్లు-150, ఆఫీసర్లు-300), తెలంగాణలో 700 (ఆఫీస్‌ అసిస్టెంట్లు-420, ఆఫీసర్లు-280) ఖాళీలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే పోస్టులు బాగా పెరిగాయి. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకుని ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు!

నియామక పరీక్షను ఇంగ్లిష్, హిందీతోపాటుగా తెలుగులో కూడా రాసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు వీటితో పాటుగా ఉర్దూలో కూడా రాసే వీలుంది. పుదుచ్చేరి రాష్ట్రంలో నిర్వహించే పరీక్షను కూడా తెలుగులో రాసుకునే వీలుంది. అక్కడ ఇంగ్లిష్, హిందీ, తమిళం, మలయాళంతోపాటు తెలుగులో కూడా పరీక్షను నిర్వహిస్తారు. పుదుచ్చేరిలో ‘పుదువై భారతీయార్‌ గ్రామ బ్యాంక్‌’లో ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్ల ఖాళీలు 25 ఉన్నాయి.

ఆన్‌లైన్‌ పరీక్ష

ఆఫీస్‌ అసిస్టెంట్‌ (క్లర్క్‌) పోస్టులను రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో మొదటి దశ (ప్రిలిమ్స్‌) అర్హత పరీక్ష అయితే.. రెండో దశ (మెయిన్స్‌)లో నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

స్కేల్‌-1 ఆఫీసర్ల (ప్రొబేషనరీ ఆఫీసర్లు)ను రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తారు. అభ్యర్థులను రెండో దశ (మెయిన్స్‌), ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్ల ఎంపిక ఒకే దశలో నిర్వహించే పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.

ఒకే తరహా: ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్కేల్‌-1 ఆఫీసర్ల ఎంపికలో రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. అయితే వీటిలోని ప్రశ్నల కాఠిన్యతలో కొద్దిగా భేదముంటుంది. ఆఫీస్‌ అసిస్టెంట్లలో తక్కువ స్థాయిలోనూ, ఆఫీసర్‌ స్కేల్‌-1 పరీక్షలో హెచ్చు స్థాయిలోనూ ప్రశ్నలు ఉంటాయి.

నోటిఫికేషన్‌ వివరాలు

పోస్టులు   : ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఆఫీసర్లు (స్కేల్‌-1, 2, 3)
పోస్టుల సంఖ్య  :  9995 (తెలంగాణ-700, ఆంధ్రప్రదేశ్‌-450
విద్యార్హత (27.06.2024 నాటికి) :   ఏదైనా డిగ్రీ  (ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్కేల్‌-1 ఆఫీసర్లు)
వయసు (01.06.2024 నాటికి) :  18-28 సంవత్సరాలు (ఆఫీస్‌ అసిస్టెంట్లు), 18-30 సంవత్సరాలు (స్కేల్‌-1 ఆఫీసర్లు) 
దరఖాస్తు ఫీజు :   రూ.175 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం) రూ.850 (ఇతరులు)    
దరఖాస్తుకు చివరి తేదీ  :  27.06.2024
పరీక్ష తేదీ  :  ప్రిలిమ్స్‌ - ఆగస్టు 2024 , మెయిన్స్‌ - సెప్టెంబరు/ అక్టోబరు 2024
వెబ్‌సైట్‌ : www.ibps.in

సన్నద్ధత ఇలా

బ్యాంకు పరీక్షలన్నింటిలోనూ కొద్దిగా సులభంగా ఉంటుందీ పరీక్ష. ప్రిలిమినరీ పరీక్షలో రెండు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మెయిన్స్‌ పరీక్ష కోసం మొదటి నుంచీ సన్నద్ధం అవ్వాలి.

  • అభ్యర్థులకు సబ్జెక్టులపై ఉండే అవగాహన, పరీక్షకు ఉండే సమయం ఆధారంగా సన్నద్ధత ప్రణాళిక తయారు చేసుకోవాలి.
  • మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు గమనించాలి. వివిధ విభాగాల్లోని ప్రశ్నలు ఏ తరహాలో, ఏ స్థాయిలో ఉంటాయో అవగతమవుతుంది.
  • మెయిన్స్‌లో ఉండే ఐదు విభాగాలకు ప్రారంభం నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి.
  • అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ విభాగాల్లోని టాపిక్స్‌లో అవగాహనలేని వాటిని ముందుగా పూర్తిచేసుకుని ఆపై అన్ని టాపిక్స్‌లోని వివిధ స్థాయి ప్రశ్నలను బాగా సాధన చేయాలి.
  • ప్రిలిమ్స్‌లో ఈ రెండు విభాగాలే ఉంటాయి. కాబట్టి ఒకసారి ఈ రెండిటిలోని టాపిక్స్‌ పూర్తయ్యాక ప్రిలిమ్స్‌ మోడల్‌ పేపర్‌ ప్రతిరోజూ ఒకటి చొప్పున రాయాలి. ఆపై దాన్ని విశ్లేషించుకుని తాము ఏయే టాపిక్స్‌లో ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉందో గమనించుకుని తదనుగుణంగా సన్నద్ధతను కొనసాగించాలి.
  • ప్రిలిమ్స్‌ పరీక్ష తేలికగా ఉంటుంది. కాబట్టి పరీక్షకు ఉండే మొత్తం 80 మార్కులూ సాధించగలిగే అవకాశం ఈ పరీక్షకు మాత్రమే ఉంటుంది.
  • ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయ్యాక మెయిన్స్‌ పరీక్ష మోడల్‌ పేపర్‌లు ప్రతిరోజూ ఒకటి చొప్పున రాయాలి.
  • అన్ని విభాగాల్లోనూ విడి విడిగా కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. కాబట్టి అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • అయితే విభాగాల సంక్లిష్టత, వాటికి కేటాయించిన మార్కుల ఆధారంగా ప్రతిరోజూ చేసే సాధనలో వాటికి సమయం కేటాయించాలి.
  • రోజుకు కనీసం 10 గంటల సమయం తగ్గకుండా సాధన చేయాలి. లేకపోతే విభాగాలన్నింటినీ కవర్‌ చేయడం కష్టమవుతుంది.

ప్రిలిమ్స్, మెయిన్స్‌ ప్రశ్నలు ఏ టాపిక్స్‌లో?

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్స్, నంబర్‌ సిరీస్, అరిథ్‌మెటిక్‌లోని వివిధ టాపిక్స్‌. వీటిలో.. పర్సంటేజ్, యావరేజ్, రేషియో-ప్రపోర్షన్, ఏజెస్, ప్రాఫిట్‌- లాస్, డిస్కౌంట్స్, టైమ్‌-వర్క్, పైప్స్‌-సిస్టర్న్, టైమ్‌-డిస్టెన్స్, ట్రెయిన్స్, బోట్స్‌-స్ట్రీమ్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్ముటేషన్‌-కాంబినేషన్, ప్రాబబిలిటీ ముఖ్యమైనవి.
రీజనింగ్‌: ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, డైరెక్షన్స్, ఆర్డర్‌-ర్యాంకింగ్, బ్లడ్‌ రిలేషన్స్, నంబర్‌ సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్, సిలాజిజమ్, వెన్‌ డయాగ్రమ్, డేటా సఫిషియన్సీ, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, కాజ్‌-ఎఫెక్ట్, స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు ముఖ్యమైనవి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ (సిననిమ్స్, యాంటనిమ్స్‌)తో పాటుగా గ్రామర్‌ ఆధార ప్రశ్నలు ఉంటాయి. సెంటెన్స్‌ కరెక్షన్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, ఫైండింగ్‌ ఎర్రర్స్, క్లోజ్‌ టెస్ట్, ఫిల్లర్స్, డబుల్‌ ఫిల్లర్స్‌..
జనరల్‌ అవేర్‌నెస్‌: వివిధ రంగాల్లోని తాజా పరిణామాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. దేశ, అంతర్జాతీయ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ముఖ్యమైన దేశీయ/ అంతర్జాతీయ దినోత్సవాలు, ముఖ్య వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, క్రీడలు మొదలైన వాటితోపాటుగా స్టాటిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: కంప్యూటర్‌ బేసిక్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఎవల్యూషన్‌ ఆఫ్‌ కంప్యూటర్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ఎంఎస్‌-ఆఫీస్, ఇంటర్నెట్, నెట్‌ వర్కింగ్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్‌ సెక్యూరిటీ, హ్యాకింగ్, వైరస్‌లు, కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు మొదలైనవి.

కెరియర్‌ అభివృద్ధి

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్ష ద్వారా పీవోగా ఎంపికై అభ్యర్థులు తమ పనితీరు, అనుభవం, అదనపు అర్హతలు, సంస్థలో ఉన్న ఖాళీల ఆధారంగా అంచెలంచెలుగా వివిధ స్థాయుల్లో పదోన్నతులు పొందుతారు. గ్రామీణ బ్యాంకుల్లో సాధారణంగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ (స్కేల్‌-1 ఆఫీసర్‌) తర్వాత వరుసగా అసిస్టెంట్‌ మేనేజర్, బ్రాంచ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌ (ఏజీఎం, డీజీఎం, జనరల్‌ మేనేజర్‌ (జీఎం), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌/ డైరెక్టర్, ఛైర్మన్‌/ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయులుంటాయి.

డా. జీఎస్‌ గిరిధర్‌ డైరెక్టర్, రేస్‌ ఇన్‌స్టిట్యూట్‌గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని