నాకు ఉద్యోగార్హత ఉందంటారా?

డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చెయ్యాలనివుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ...

Published : 25 Jul 2016 01:22 IST

నాకు ఉద్యోగార్హత ఉందంటారా?

డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చెయ్యాలనివుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అందుబాటులో ఉంది? ఈ కోర్సుకు ప్రవేశపరీక్ష, సంబంధిత వివరాలు తెలుపగలరు.

- అర్జున్‌, కుడికిల్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నవాటిలో ఆతిథ్యరంగం ఒకటి. దీనిలో నిపుణుల అవసరం చాలా ఉంది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ ప్రవేశపరీక్షల ద్వారా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ- అప్లైడ్‌ న్యూట్రిషన్‌ మొదలైన సంస్థలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌, సర్టిఫికెట్‌లను అందిస్తున్నాయి.
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ వారు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాన్ని కల్పిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్ష ద్వారా ఈ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఈ ప్రవేశపరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం ఈకింది వెబ్‌సైట్లు చూడగలరు.
ఉస్మానియా:www.osmania.ac.in
ఐహెచ్‌ఎం:www.ihmhyd.org


రెగ్యులర్‌ టెన్త్‌, ఇంటర్‌లను కొన్ని కారణాల వల్ల చదవలేదు. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా బీఏ డిగ్రీ పూర్తిచేసి తర్వాత కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్‌ పీజీ ఎం.ఎ. (ఎకనామిక్స్‌) చేశాను. నాకు గ్రూప్‌-1, 2, జేఎల్‌, డీఎల్‌ పరీక్షలకు అర్హత ఉంటుందా? ఉద్యోగం వస్తే ఇస్తారా?

- జి. రాజేష్‌, దేవరకొండ (నల్గొండ జిల్లా)

టెన్త్‌, ఇంటర్‌ రెగ్యులర్‌గా చదవకపోవడం వల్ల గ్రూప్‌-1, 2 జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలకు అర్హత ఉండదనే ప్రస్తావన ఇంతవరకూ ఎక్కడా రాలేదు. నోటిఫికేషన్లలో రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన లేనంతవరకూ మీకు పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇంటర్వ్యూ సమయంలో పూర్వ విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తారు. అలాంటి సందర్భాల్లో మీకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అంతేకానీ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్‌-1, 2, జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలు రాయడానికీ అర్హత తప్పనిసరిగా ఉంటుంది.
ఇంతకుముందు మద్రాసు హైకోర్టు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. తమిళనాడు స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ నిర్వహించే పోటీపరీక్షలకు దూరవిద్య ద్వారా చదివినవారు కూడా అర్హులేనని తీర్పునిచ్చింది. అంతేకాకుండా దూరవిద్య ద్వారా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అందువల్ల పోటీపరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే మీకు ఉద్యోగం నిశ్చయంగా లభిస్తుంది. అందుకని మీకు ఆసక్తివున్న పోటీపరీక్షలు రాయడానికి సిద్ధం కండి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని