టూరిజం కోర్సులకు నాకు అర్హత ఉందా?

ఈసీఈ బ్రాంచితో 2012లో డిప్లొమా పూర్తిచేశాను. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌లో గతంలో ప్రాజెక్టు చేశాను. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌...

Published : 16 Jan 2017 01:15 IST

 

టూరిజం కోర్సులకు నాకు అర్హత ఉందా?

* ఈసీఈ బ్రాంచితో 2012లో డిప్లొమా పూర్తిచేశాను. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌లో గతంలో ప్రాజెక్టు చేశాను. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలని కోరిక. కోర్సు పూర్తయిన వెంటనే డిప్లొమా మీదనే ఉద్యోగం దొరుకుతుందా? నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని కావాలంటే ఏం చేయాలి?

- మౌనిక, దుగ్గిరాల, పశ్చిమగోదావరి జిల్లా

కోర్సు పూర్తయిన వెంటనే డిప్లొమా మీద ఉద్యోగం చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కానీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మొదట మీకు ఏ విభాగంలో ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉందో స్పష్టతను ఏర్పరచుకోండి. దాని ప్రకారం ముందుకు వెళ్లండి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కావాలనుకుంటే, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, సీ, సీ++, జావా మొదలైనవాటిపై పట్టు సాధించాల్సి ఉంటుంది.

కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుకుంటే, వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. అయితే డిప్లొమా తర్వాత కంటే, ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగానికి ప్రయత్నించడం మేలు. దానివల్ల మీకు జీతభత్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కెరియర్‌లోనూ ఉన్నతిని సాధించవచ్చు. కాబట్టి చదువును ఇంతటితో ఆపేయకుండా, కొనసాగించడానికి ప్రయత్నించండి.



* నేను 2014లో బీఏ డిగ్రీ పూర్తిచేశాను. గత రెండు సంవత్సరాలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రిసెప్షన్‌లో పని చేస్తున్నాను. ఈ ఉద్యోగం కొనసాగిస్తూ, ఏదైనా దూరవిద్య అభ్యసించడానికి సూచనలు ఇవ్వగలరు. టీవీ జర్నలిజం, ట్రావెల్స్‌- టూరిజం కోర్సులకు నేను అర్హుడినేనా?

- ఎ. శంకర్‌, పిట్లం, కామారెడ్డి

దూరవిద్య ద్వారా కంటే, రెగ్యులర్‌గా చదవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండి, చదువుపట్ల ఆసక్తి ఉంటే రెగ్యులర్‌ విధానానికే ప్రయత్నించండి. ఏ కోర్సు చదవాలనే నిర్ణయం మీకున్న సామర్థ్యం, నైపుణ్యాలనుబట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరో చెప్పారనో, ఇంకెవరో చదువుతున్నారనో కాకుండా ఆసక్తిని బట్టి ఎంచుకుంటే దానిలో రాణించగలుగుతారు.

టీవీ జర్నలిజంలాంటి కోర్సులు చదవడానికి ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు బీఏ జర్నలిజం లేదా మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదివినవారికే ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ట్రావెల్స్‌-టూరిజం కోర్సులకు ఇంటర్మీడియట్‌లో ఏ కోర్సు చదివినవారికైనా అర్హత ఉంటుంది. డిగ్రీలో బీఏ టూరిజం, బీఎస్‌సీ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటివి చదివినవారికే పీజీ ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం చదవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎంబీఏ ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం కోర్సును కూడా ఎంచుకోవచ్చు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని