దూరవిద్యలో బీటెక్‌?

ఇంటర్‌ పూర్తి చేశాక గ్రూప్‌ 4 రాసి, ఆర్‌ అండ్‌ బీలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నా. దూరవిద్య ద్వారా బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఉంది. ఏ విశ్వవిద్యాలయాలయినా ఈ అవకాశం కల్పిస్తున్నాయా?

Published : 10 Jul 2017 01:53 IST

దూరవిద్యలో బీటెక్‌?

*ఇంటర్‌ పూర్తి చేశాక గ్రూప్‌ 4 రాసి, ఆర్‌ అండ్‌ బీలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నా. దూరవిద్య ద్వారా బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఉంది. ఏ విశ్వవిద్యాలయాలయినా ఈ అవకాశం కల్పిస్తున్నాయా?
- ఇబ్రహీం, కాకినాడ

* ఉద్యోగం చేస్తూ మీ విద్యార్హతను పెంచుకోవాలనే ఆలోచనకు అభినందనలు. బీఈ లేదా బి.టెక్‌ లాంటి ప్రొఫెష్నల్‌ కోర్సులను రెగ్యులర్‌గా అభ్యసించడం అనేది శ్రేయస్కరం. మీ విషయంలో రెగ్యులర్‌ విద్య అభ్యసించడం కుదరదు కాబట్టి మీరు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ వారు అందిస్తున్నటువంటి ఎ.ఎం.ఐ.ఇ. లేదా ఐ.ఇ.టి.ఇ. వారి ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సులను ఎంచుకోవచ్చు. 10+2 లేదా, డిప్లొమా చేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.

ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ కోర్సును పదకొండు స్పెషలైజేషన్స్‌లో అందిస్తున్నారు. మీరు కోరుకున్నటువంటి సివిల్‌ ఇంజినీరింగ్‌ కూడా ఈ స్పెషలైజేషన్‌లో ఉంది. సెక్షన్‌ ఎ. సెక్షన్‌ బి కింద ఈ కోర్సును రూపొందించారు. మొత్తం 19 సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

ఉత్తీర్ణత సాధించిన వారు అసోసియేట్‌ మెంబర్‌ ఇన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌గా నమోదవుతారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో ఈ కోర్సును పూర్తి చేయాలి. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్షలు జరుగుతాయి. సంవత్సరం పొడుగునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.ieindia.org ని సందర్శించండి. ఐ.ఇ.టి.ఇ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సును అందిస్తున్నారు. జూన్‌ నెలలో పరీక్ష కొరకు ఫిబ్రవరి లోగా, డిసెంబర్‌ నెల పరీక్ష కొరకు ఆగస్టు లోగా దరఖాస్తు చేసుకోవాలి. అయిదు సంవత్సరాల వ్యవధిలో కోర్సును పూర్తి చేయాలి.

పైన పేర్కొన్న రెండు కోర్సులు రెగ్యులర్‌ మోడ్‌లో బి.టెక్‌తో తత్సమాన అర్హతగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలకు అర్హత కల్పిస్తాయి. ఉన్నత చదువులు అభ్యసించడానికి కూడా తోడ్పడతాయి.



* హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలని ఉంది. దూరవిద్య/ కరస్పాండెన్స్‌లో ఈ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలేవి?
- ఎ. కేదార్‌

* పర్యటక రంగ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏ చేయాలనుకునే అభ్యర్థులు ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సును దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది. ఫలితంగా వృత్తిపరమైన నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఏదైనా దూరవిద్య కోర్సును అభ్యసిం ముందు ఆ కోర్సును అందించే విశ్వవిద్యాలయం, సంబంధిత కోర్సుకు డిఫెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ), యూజీసీ అనుమతి ఉందో లేదో తెలసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయ కోర్సును మాత్రమే ఎంచుకోవాలి. ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వారు ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) వారి సౌజన్యంతో ఎంబీఏ హెచ్‌ఎం కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు.

సింబయాసిస్‌, సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీల వారు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నారు.



* బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. నాకు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌పై ఆసక్తి ఉంది. ఈ కోర్సులను అందించే ప్రభుత్వ సంస్థల వివరాలను తెలపండి. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
- ప్రగడ రాజేష్‌, విశాఖపట్నం

* మనిషి సాయం లేకుండా కంప్యూటర్లు, రోబోలు, కంట్రోల్‌ సిస్టమ్స్‌ ద్వారా ఇండిస్ట్రియల్‌ ప్రాసెస్‌ జరపడానికి ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ వీలు కల్పిస్తుంది. ఎన్‌పీటీఈఎల్‌, ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈ కోర్సును అందిస్తున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)- కాలికట్‌ వారు నాలుగు నెలల వ్యవధి ఉన్న అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా- పీఎల్‌సీ/ స్కాడా/ డీసీఎస్‌ కోర్సులు, పీజీ డిప్లొమా ఇన్‌ ఇండిస్ట్రియల్‌ ఆటోమేషన్‌ సిస్టమ్స్‌ డిజైన్‌లను అందిస్తున్నారు.

ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ప్రభుత్వ, బహుళజాతి పారిశ్రామిక యూనిట్లలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ, ఈ కోర్సులతోపాటు వివిధ సాఫ్ట్‌వేర్ల వాడకంపైనా పట్టు పెంచుకున్నవారికే మెరుగైన అవకా.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని