అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చేస్తే?

అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? దానిలో ప్రవేశం పొందడం ఎలా?

Published : 15 Jan 2018 02:06 IST

అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చేస్తే?

* అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? దానిలో ప్రవేశం పొందడం ఎలా?

- కీర్తి, నర్సీపట్నం

జ: మనది వ్యవసాయాధారిత దేశం. కాబట్టి ఈ రంగంలో అపార విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఆహారోత్పత్తిలో, ప్రాసెసింగ్‌లో అభివృద్ధిని సాధించడమే అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ ఉద్దేశం. ఇంటర్‌లో మ్యాథ్స్‌, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివినవారు ఈ కోర్సును చదవడానికి అర్హులు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, డా. వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, గుంటూరు; విజ్ఞాన్‌ యూనివర్సిటీ, ఇతర అనుమతి పొందిన అనుబంధ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌) కోర్సు కాలవ్యవధి 4 సంవత్సరాలు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌వారు ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.
ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఫుడ్‌ సూపర్‌వైజర్‌, ఆగ్రో ఎకనమిస్ట్‌, సాయిల్‌ సైంటిస్ట్‌, ఫార్మ్‌ షాప్‌ మేనేజర్‌, రిసెర్చర్‌, ప్లాంట్‌ ఫిజియాలజిస్ట్‌, సర్వే ఇంజినీర్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ వంటి ఉద్యోగాలు పొందుతారు. జేఈఈ ద్వారా కూడా కొన్ని విద్యాసంస్థలు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.


యానిమేషన్‌ రంగం ఎలాఉంది?

* యానిమేషన్‌ రంగంలో చేరాలంటే ఏ అర్హతలుండాలి? అందులో ఏ కోర్సులుంటాయి? ఉపాధి అవకాశాలు బాగుంటాయా? ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను తెలపండి.

- మధు, నూజివీడు

జ: యానిమేషన్‌ రంగంలో చేరాలనుకునేవారికి కనీస కంప్యూటర్‌ అవగాహన, వైవిధ్యంగా ఆలోచించే ధోరణి, సృజనాత్మకత వంటి ప్రధాన నైపుణ్యాలుండాలి. మల్టీమీడియా రంగం అభివృద్ధి చెందడంతో యానిమేషన్‌ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ రంగంలో గేమింగ్‌ డిజైన్‌, వీఎఫ్‌ఎక్స్‌, 3డీ యానిమేషన్‌, మిక్సింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, విజువల్‌ ఆర్ట్స్‌ వంటి వివిధ విభాగాలుంటాయి. అభ్యర్థులు ఆసక్తిని బట్టి కోర్సునూ, రంగాన్నీ ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో చేరాలంటే 10+2 పూర్తిచేసి ఉండాలి.
ప్రభుత్వ సంస్థలు ఈ కోర్సును అందించడం లేదు. మాయ అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్స్‌ (ఎంఏఏసీ), ఎరీనా అకాడమీ, షాప్ట్‌ యానిమేషన్‌ సంస్థలు ప్రైవేటు రంగంలో  ట్రెయినింగ్‌, ప్లేస్‌మెంట్లను అందిస్తున్నాయి. ఉపాధిపరంగా గ్రాఫిక్‌ డిజైనర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌, గేమింగ్‌ గ్రాఫిక్స్‌ ఇంజినీర్‌, యానిమేషన్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి అవకాశాలుంటాయి.


ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని