JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌లో మళ్లీ స్వల్ప మార్పు!

జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) పరీక్ష తేదీలో మరోసారి మార్పు చోటుచేసుకుంది.

Updated : 29 Mar 2024 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గత నెలలో ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా ఈ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల విడుదల సందర్భంగా గురువారం ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను పొందుపరిచింది. అంతకుముందు షెడ్యూల్‌ విడుదల సమయంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య JEE Main session 2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న NTA.. ఆ తర్వాత ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షెడ్యూల్‌లోనూ మార్పులు చేయడం గమనార్హం.

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం క్లిక్‌ చేయండి

సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) పరీక్ష ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా; పేపర్‌ - 2 పరీక్ష ఏప్రిల్‌ 12న నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరగనుంది. అలాగే, పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) నిర్వహించనున్నారు. 

ఇదిలాఉండగా.. అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విడుదల చేయనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు