Animesh Pradhan: ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్‌’లో రెండో ర్యాంకు

ఇంటర్వ్యూ సమయంలో తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి.. సివిల్స్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. అతడే ఒడిశాకు చెందిన అనిమేశ్‌ ప్రధాన్‌ (24).

Published : 17 Apr 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు.. సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఇటీవలే తల్లి ప్రాణాలు కోల్పోయింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి.. లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాడు. తాజాగా ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష (UPSC Civil Services)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. అతడే ఒడిశాకు చెందిన 24 ఏళ్ల అనిమేశ్‌ ప్రధాన్‌ (Animesh Pradhan).

అనుగుల్‌ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన అనిమేశ్‌.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ‘‘2022లో సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. రోజుకు 5- 6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు’’ అని ఓ వార్తా సంస్థకు తెలిపారు.

సివిల్స్‌లో ‘అనన్య’సామాన్యం.. సొంత ప్రిపరేషన్‌తో తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు

‘‘సివిల్స్‌ ఫలితం విషయంలో చాలా సంతృప్తిగా ఉంది. నా కల నెరవేరింది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గత నెలలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లో నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది’’ అని చెప్పారు.

ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని, ఒడిశా క్యాడర్‌ ఆశిస్తున్నట్లు అనిమేశ్‌ చెప్పారు. ‘‘నా రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా’’ అని వివరించారు. ఇంతకీ ఆయన హాబీలు ఏంటో తెలుసా..! పార్లమెంటరీ డిబేటింగ్, మీడియా అడ్వకసీ- జర్నలిజం, ఫ్రీ-స్టైల్ డ్యాన్స్.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని