NCERT: సిలబస్‌ మార్పు, కొత్త పాఠ్య పుస్తకాలపై NCERT కీలక ప్రకటన

కొత్త పాఠ్యపుస్తకాల విడుదలకు సంబంధించి ఎన్‌సీఈఆర్టీ కీలక ప్రకటన చేసింది.

Published : 04 Apr 2024 16:04 IST

దిల్లీ: కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్‌ చివరివారంలో, ఆరో తరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని వెల్లడించింది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్‌ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు తెలిపింది. మారిన కరికులమ్‌కు అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రిపేర్‌ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం NCERT పోర్టల్‌లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉందని తెలిపింది. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేసింది.

కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.. ఎలా అప్లై చేయాలి?

‘‘పాఠశాల విద్య కోసం నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2023ని అనుసరించి 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు మాత్రమే ఎన్‌సీఈఆర్టీ  కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకొస్తోంది. మూడో తరగతి పాఠ్య పుస్తకాలు ఏప్రిల్‌ చివరి వారంలో, ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు మే మధ్యలో విడుదల చేస్తాం. 4, 5, 9, 11వ తరగతులకు బఫర్‌ స్టాక్‌ సిద్ధంగానే ఉంది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్‌ కాపీలు మా వెబ్‌సైట్‌తో పాటు DIKSHA, ePathshala పోర్టల్‌, యాప్‌లలో ఉచితంగా లభిస్తాయి’’ అని  NCERT పేర్కొంది. మరోవైపు, 4, 5, 9, 11వ తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలు విడుదలయ్యాయని.. ఈ తరగతులకు కొత్తగా మరో 1.03 కోట్ల కాపీలను ప్రింటింగ్‌ కోసం ఆర్డర్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ పుస్తకాలు మే 31 నాటికి అందుబాటులోకి రావొచ్చని తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని