Prashant Bhojane: స్వీపర్‌ తనయుడు.. సివిల్స్‌లో సత్తా చాటాడు

స్వీపర్‌ తనయుడు సివిల్స్‌లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్‌ సురేశ్‌.. 849వ ర్యాంకు సాధించాడు. 

Published : 19 Apr 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తల్లి స్థానిక పాలన సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలు. తండ్రి నాలుగో తరగతి ఉద్యోగి. అప్పటికే ఎనిమిదిసార్లు వైఫల్యం ఎదురైంది. అయినప్పటికీ.. ఇవేవీ ఆయన ఆశయ సాధనకు అడ్డురాలేదు. ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ (UPSC Civil Services) ఫలితాల్లో సత్తా చాటి 849 ర్యాంకు సాధించారు. ఆయనే మహారాష్ట్రలోని ఠాణెకు చెందిన ప్రశాంత్‌ సురేశ్‌ భోజనే (Prashant Suresh Bhojane).

ప్రశాంత్‌ (32) తల్లి ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌లో స్వీపర్‌. తండ్రి నాలుగో తరగతి ఉద్యోగి. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ప్రశాంత్‌.. ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో 2015లో సివిల్స్‌ బాటపట్టారు. ఎనిమిది సార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. పట్టువిడవకుండా తొమ్మిదో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. దీంతో ఆయన నివాస ప్రాంతమైన ఖర్తన్‌ రోడ్‌ స్వీపర్‌ కాలనీవాసుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. దీంతో అక్కడి వాసులు ర్యాలీ తీయడం విశేషం.  

కుటుంబానికి తెలియకుండా చదివి.. సివిల్స్‌లో నాలుగో ర్యాంక్‌ కొట్టి..!

‘‘సివిల్స్‌కు సన్నద్ధమవుతోన్న తరుణంలోనే దిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మాక్‌ పేపర్ల చెకింగ్‌ చేసేవాడిని. దీంతో చదువుకోవడంతోపాటు ఉపాధి లభించినట్లయ్యింది. ఇంటికి వచ్చేయమని తల్లిదండ్రులు చెప్పేవారు. నా విషయంలో వారెంతో బాధలు పడ్డారు. ఇప్పుడు ప్రతిఫలం దక్కింది’’ అని ప్రశాంత్‌ ఓ వార్తాసంస్థతో తెలిపారు. ‘‘నా బిడ్డ ఉద్యోగం చేయాలని కోరుకునేవాడిని. కానీ, అతడు చేసింది సరైందేనని ఇప్పుడు అనిపిస్తోంది’’ అని తండ్రి తెలిపారు.

‘‘పారిశుద్ధ్య కార్మికుల పిల్లల్లోనూ ప్రతిభ ఉంటుంది. వారిని చిన్నచూపు చూడకూడదు. ప్రశాంత్‌ ఇదే విషయాన్ని నిరూపించాడు. ఇది మాకెంతో గర్వకారణం. ఆయన కాలనీలోని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు’’ అని స్థానిక శ్రామిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని