TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు.. అప్లై చేసేందుకు ఇంకా రెండు రోజులే!

తెలంగాణలో ఈఏపీసెట్‌కు దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. గడువు ముగియకముందే గతేడాది కన్నా అధికంగా దరఖాస్తులు వచ్చాయి.

Published : 04 Apr 2024 20:18 IST

TS EAPCET 2024| హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఈఏపీసెట్‌-2024 (TS EAPCET 2024)కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 26న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 6తో ముగియనుంది. ఆలస్యరుసుం లేకుండా దరఖాస్తు చేసుకొనేందుకు విద్యార్థులకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను జేఎన్టీయూ-హెచ్‌ బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇంజినీరింగ్‌ విభాగంలో 2,33,517 మంది, అగ్రికల్చర్‌/ఫార్మా విభాగాల్లో 87,819 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. మూడు విభాగాలకూ 268 మంది దరఖాస్తు చేసుకున్నట్లు  తెలిపింది. దీంతో ఈఏపీ సెట్‌కు మొత్తంగా 3,21,604 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

చీటింగ్‌ చేస్తే.. కఠిన చర్యలు తప్పవ్‌: జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ఎన్‌టీఏ హెచ్చరిక

గతేడాది మూడు విభాగాలకు కలిపి 3,20,683 దరఖాస్తులు రాగా.. ఈసారి గడువు ముగియకముందే ఆ సంఖ్యను మించి దరఖాస్తులు రావడం గమనార్హం. ఈఏపీ సెట్‌ రాయాలనుకొనే విద్యార్థులు ఏప్రిల్‌ 6 లోగా ఆన్‌లైన్‌లో https://eapcet.tsche.ac.in/ దరఖాస్తు చేసుకోవచ్చని జేఎన్టీయూ-హెచ్‌ విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. ఈఏపీ సెట్‌ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు; మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలను ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని