UGC: ‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త: UGC హెచ్చరిక

ఆన్‌లైన్‌లో నకిలీ డిగ్రీ కోర్సుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది.

Updated : 23 Apr 2024 19:53 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) విద్యార్థులకు కీలక హెచ్చరిక చేసింది. విద్యార్థుల్ని ఆకట్టుకొనేందుకు ‘పది రోజుల్లోనే ఎంబీఏ’ వంటి కోర్సుల పేర్లతో ప్రచారం చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపుపొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ల మాదిరిగానే సంక్షిప్త పదాలతో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లు, కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అలాంటివాటిలో '10 రోజుల MBA' అంశం తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ తెలిపారు. 

నాలుగేళ్ల డిగ్రీతో ఇకపై నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు: యూజీసీ ఛైర్మన్‌

కేంద్ర చట్టం లేదా ప్రాంతీయ, రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయం, డీమ్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉంటుందని మనీష్‌ జోషీ స్పష్టంచేశారు. ఉన్నత విద్యాసంస్థలు ఏదైనా ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించాలనుకుంటే UGC అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లను అందించేందుకు అనుమతి పొందిన ఉన్నత విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల జాబితా deb.ugc.ac.inలో ఉందన్నారు.  అందువల్ల ఆన్‌లైన్‌ కోర్సులకు దరఖాస్తులు/అడ్మిషన్లకు ముందు అవి చెల్లుబాటయ్యేవో, కాదో నిర్ధారించుకోవాలని ఈసందర్భంగా విద్యార్థులకు సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని