ఒత్తిడి.. జుట్టుకూ చేటే!

జుట్టు ఊడిపోవటానికి కారణాలు ఎన్నెన్నో. వీటిల్లో ఒత్తిడీ ఒకటి. శారీరకంగా.....

Published : 20 Mar 2018 01:16 IST

ఒత్తిడి.. జుట్టుకూ చేటే!

జుట్టు ఊడిపోవటానికి కారణాలు ఎన్నెన్నో. వీటిల్లో ఒత్తిడీ ఒకటి. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు కొందరికి జుట్టు ఊడిపోతుంటుంది. కొందరికి కొన్ని వారాలు, నెలల పాటూ జుట్టు రాలిపోతుంటుంది. ఆందోళనకు గురిచేసేదే అయినా ఇది తాత్కాలిక సమస్యే. ఒత్తిడి తగ్గితే జుట్టు తిరిగి మొలుస్తుంది. ఒత్తిడి మూలంగా జుట్టు రాలటమనేది సాధారణంగా మూడు రకాలుగా కనబడుతుంది.
* ఒత్తిడికి లోనైనప్పుడు చాలా వెంట్రుకల కుదుళ్లు విశ్రాంతి దశలోకి వెళ్లిపోతుంటాయి. ఫలితంగా వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది. ఇలాంటి కుదుళ్లతో కూడిన వెంట్రుకలు కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా కుచ్చుకుచ్చులుగా ఊడిపోవటం మొదలవుతుంది. దీంతో తలలో అక్కడక్కడా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది.
* పేను కొరుకుడుకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. ఒత్తిడి మూలంగానూ ఇది రావొచ్చు. వీరిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వెంట్రుకల కుదుళ్లపై దాడిచేసి వెంట్రుకలు ఊడిపోవటానికి కారణమవుతుంది.
* కొందరు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, ఒంటరితనం వంటి వాటి నుంచి బయటపడటానికి జుట్టును చేతులతో బలంగా లాగుతుంటారు. ఇదీ వెంట్రుకలు ఊడి రావటానికి దారితీస్తుంది.


తగ్గించుకోవటమెలా?

ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా కీలకం. ఒత్తిడి తగ్గితే జుట్టు తిరిగి మొలుస్తుంది. ఇందుకు జీవనశైలి మార్పులు బాగా తోడ్పడతాయి.
* రోజూ రాత్రిపూట 7-8 గంటల సేపు కంటి నిండా నిద్రపోవటం మంచిది.
* తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం అల్పాహారం మానెయ్యరాదు.
* వ్యాయామంతో ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి.
* గోరువెచ్చటి నూనెతో నెమ్మదిగా మర్దన చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు ఊడటం తగ్గొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని