Manipur: రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్‌ శిబిరంపై 2 గంటల పాటు తూటాల వర్షం

Manipur: మణిపుర్‌లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులతో విరుచుకుపడ్డారు.

Updated : 27 Apr 2024 17:16 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో గతేడాది అట్టుడుకిపోయిన ఈశాన్యం రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బిష్ణూపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది క్యాంప్‌పై మిలిటెంట్లు (Militant attack) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ (CRPF) సిబ్బంది అమరులయ్యారు.

లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్‌ మణిపుర్‌ స్థానానికి శుక్రవారం పోలింగ్‌ జరిగింది. నరన్‌సైనా ప్రాంతంలో ఓటింగ్‌ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది నిన్న రాత్రి ఇక్కడి ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ (IRBn) క్యాంప్‌ వద్ద బస చేశారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండల ప్రాంతం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత మొదలైన కాల్పులు దాదాపు 2.30 గంటల వరకు సాగాయి. క్యాంప్‌పైకి మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు.

వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.1000 కోట్ల పైమాటే!

అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ బలగాలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. సర్కార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అరూప్‌ సైనీ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రస్తుతం అటవీప్రాంతంలో నక్కిన మిలిటెంట్ల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని