పథ్యం పెద్ద రక్ష!

శరీరంలో వ్యర్థాలను వడపోస్తూ.. లవణాలు, ఖనిజాలను సమపాళ్లలో ఉంచుతూ.. నిరంతరం మన...

Published : 17 Jan 2016 11:08 IST

పథ్యం పెద్ద రక్ష!


 శరీరంలో వ్యర్థాలను వడపోస్తూ.. లవణాలు, ఖనిజాలను సమపాళ్లలో ఉంచుతూ.. నిరంతరం మన ఆరోగ్యాన్ని కాపాడటంలో... మూత్రపిండాల పాత్ర అసామాన్యం! ఇంతటి కీలకమైన మూత్రపిండాలకు ఇప్పుడు మధుమేహం, హైబీపీ, స్థూలకాయం వంటివి శరాఘాతాల్లా తయారయ్యాయి. పనితీరును దెబ్బతీసి, కిడ్నీ జబ్బు తెచ్చిపెడుతున్నాయి. సకాలంలో గుర్తించి తగు చికిత్సతో పాటు ఆహార నియమాలూ పాటిస్తే కిడ్నీల వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పాలకూర లేదా టమోటా వంటివి తినకూడదని తెలుసు. ఇలా రాళ్ల సమస్యలే కాదు.. కిడ్నీ జబ్బులున్న వారు కూడా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీకు అందిస్తోంది  సుఖీభవ!

  న మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించటమే కాదు, ఎరిత్రోపైటిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తూ రక్తం పరిమాణాన్ని నియంత్రిస్తాయి. విటమిన్‌-డి ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీయం, యూరిక్‌ ఆమ్లం వంటి వాటిని సమతులంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా రక్తాన్ని వడపోసి, వ్యర్థాలన్నింటినీ నీటితో కలిపి మూత్రం రూపంలో బయటకు పంపించేస్తాయి. ఈ పనులన్నింటినీ మూత్రపిండాలు సమర్థంగా చెయ్యలేకపోతుంటే దాన్నే మనం మూత్రపిండాల వ్యాధి (కిడ్నీ డిసీజ్‌) అంటాం.

మూత్రపిండాల పనితీరు హఠాత్తుగా అంటే.. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతే ‘అక్యూట్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌’ అంటారు. వారాల్లో తగ్గిపోతే ‘ర్యాపిడ్లీ ప్రొగ్రెసివ్‌ కిడ్నీ డిసీజ్‌’ అనీ.. ఇక మూడు నెలల పాటు మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ అంటారు. వ్యాధి బాగా ముదిరిపోయి, ప్రాణానికి హాని కలిగే స్థాయికి చేరుకుంటే ‘ఎండ్‌ స్టేజ్‌ కిడ్నీ డిసీజ్‌’గా పిలుస్తారు. కిడ్నీ వ్యాధి తీవ్రతను గ్లోమెర్యూలర్‌ ఫిల్టరేషన్‌ రేటు (జీఎఫ్‌ఆర్‌) ఆధారంగా నిర్ధరిస్తారు. ఎక్యూట్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌ హఠాత్తుగా వస్తుంది కాబట్టి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు తిరిగి పుంజుకునే అవకాశం కూడా ఇందులోనే ఎక్కువ. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌లో క్రమంగా మూత్రపిండాల పనితీరు తగ్గుతుంటుంది. కాబట్టి దీన్ని మందులతో, ఆహార నియమాలతో అడ్డుకోవటం అవసరం.

ముప్పు కారకాలేంటి?
క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ రావటానికి మధుమేహం, హైబీపీ ప్రధాన కారణాలు. మూత్రపిండాల వాపు (గ్లోమరులర్‌ నెఫ్రైటిస్‌), మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, రాళ్లు ఏర్పడటం వంటివీ కిడ్నీ డిసీజ్‌కు దారి తీయొచ్చు. రాళ్లు ఏర్పడినప్పుడు మూత్రం సరిగా బయటకు వెళ్లకపోవటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడి, కిడ్నీ వ్యాధి వస్తుంది. మూత్రం ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే అవకాశమూ ఉంది. వృద్ధుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి వాపుతో కూడా కిడ్నీ వ్యాధి రావొచ్చు. కొందరికి పుట్టుకతోనే ‘పాలీ సిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌’ వంటి జబ్బులుండొచ్చు. మూత్రంలో ప్రోటీన్‌ పోవటం కూడా కిడ్నీ వ్యాధికి కారణం కావొచ్చు. స్థూలకాయం కూడా కిడ్నీ జబ్బుల ముప్పును తెచ్చిపెడుతుంది. వీరికి మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవేవీ లేకపోయినా కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వుల వల్ల సమస్యలు రావొచ్చు.

మధుమేహుల్లో 5 దశలు
మధుమేహం కూడా కిడ్నీ వ్యాధికి ముఖ్య కారణం. నిజానికి చాలామందిలో మూత్రంలో ప్రోటీన్‌ పోవటాన్ని గుర్తించటం ద్వారానే మధుమేహం తొలిసారి బయటపడుతుంది కూడా. వీరిలో ఇది 5 దశలుగా కనబడుతుంది. మొదట్లో ‘జీఎఫ్‌ఆర్‌’ మామూలుకన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో దశలో జీఎఫ్‌ఆర్‌ మామూలుగా ఉన్నప్పటికీ పైకి ఎలాంటి లక్షణాలు కనబడకుండానే లోపల్లోపల మూత్రపిండాలు దెబ్బతింటూ ఉంటాయి. మూడోది ‘మైక్రో అల్బుమినూరియా’ దశ. ఈ సమయంలో మూత్రంలో తక్కువ మోతాదులో.. రోజుకి (24 గంటల్లో) 30-300 మి.గ్రా. ప్రోటీన్‌ పోతుంటుంది. అంటే అప్పటికే కిడ్నీ వ్యాధి ఆరంభమైందన్న మాట. నాలుగో దశలో మూత్రంలో ప్రోటీన్‌ మరీ అధికంగా (ఓవర్ట్‌ ప్రోటీనూరియా) పోతుంది. అంటే రోజుకి 300 మి.గ్రా. కన్నా ఎక్కువ ప్రోటీన్‌ పోతుందన్నమాట. దీన్నే ‘డయాబెటిక్‌ నెఫ్రోపతీ’ అంటారు. ఇక ఐదో దశ- కిడ్నీ వైఫల్యం! మూడో దశలో (మైక్రో అల్బుమినూరియా) వ్యాధిని గుర్తిస్తే మధుమేహం, హైబీపీలను నియంత్రణలో ఉంచుకోవటం, ఆహార నియమాలు, మందుల ద్వారా దాన్ని ఆపటం గానీ, తిరిగి సాధారణ స్థాయికి తేవటం గానీ చేయొచ్చు. నాలుగు, ఐదో దశలో గుర్తిస్తే కిడ్నీ పనితీరు మరింత తగ్గిపోకుండా చూడొచ్చు గానీ తిరిగి మామూలు స్థాయికి చేర్చటం అసాధ్యం.

అధిక రక్తపోటు ముప్పు
వ్యర్థాలను వడపోసే ప్రక్రియ అంతా కూడా మూత్రపిండాల్లోని నెఫ్రాన్‌లో జరుగుతుంటుంది. దీన్ని గ్లోమెరులస్‌ నిర్వహిస్తుంది. అధిక రక్తపోటు గలవారిలో ఈ గ్లోమెరులస్‌పై ఒత్తిడి పెరిగిపోయి అది దెబ్బతింటుంది. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్‌ పోతూ, క్రమేపీ అది కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది.

లక్షణాలేంటి?
కిడ్నీ వ్యాధి ఆరంభంలో ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల దీని ముప్పు అధికంగా ఉండే మధుమేహం, హైబీపీ బాధితులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉండి ఉంటే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరును పరీక్షించుకోవాలి. కిడ్నీ జబ్బు గలవారిలో మూత్రం గాఢత (కాన్‌సెంట్రేషన్‌) తగ్గిపోతుంది. అందువల్ల రాత్రిపూట కూడా మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం కోసం నిద్ర నుంచి లేవాల్సి వస్తుంటే కిడ్నీ వ్యాధి ఉందేమోనని పరీక్షించుకోవటం ఉత్తమం. కిడ్నీ జబ్బు వ్యాధి ముదురుతున్నకొద్దీ అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్‌ పోవటం, కాళ్ల వాపు, ఆయాసం రావటం, ముఖం ఉబ్బరించటం, ఆకలి మందగించటం, మూత్రం తగ్గిపోవటం, రక్తహీనత, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనబడతాయి. ‘యురెమిక్‌ న్యూరోపతీ’ కారణంగా కాళ్లు చేతుల్లో తిమ్మిరి కూడా రావొచ్చు. కిడ్నీ జబ్బు మరీ తీవ్రతరమైతే మూర్ఛ వచ్చి స్పృహ తప్పిపోవటమూ జరగొచ్చు. ఇలాంటి సమయంలో డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. జీఎఫ్‌ఆర్‌ 10 ఎం.ఎల్‌. కన్నా తగ్గితే డయాలసిస్‌ చేయాల్సిన అవసరముందని అర్థం. లేదంటే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.

ఏయే పరీక్షలు అవసరం?
*మూత్రంలో ప్రోటీన్‌ పరీక్ష: ఇది కిడ్నీ జబ్బు ఉందో లేదోనని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో అల్బుమిన్‌ రోజుకి 30 మి.గ్రా. కన్నా తక్కువుండాలి. 30-300 మి.గ్రా. మధ్యలో ఉంటే మైక్రో అల్బుమినూరియా అనీ, 300 మి.గ్రా. కన్నా ఎక్కువైతే ‘ప్రొటినూరియా’ అంటారు.

*సీరం క్రియాటినైన్‌ పరీక్ష: ఇది ఎంత ఉండొచ్చన్నది వయసును బట్టి, లింగాన్ని బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంటుంది, మొత్తమ్మీద 1.2 నుంచి 1.4 లోపు ఉండాలి. దాటితే కిడ్నీ వ్యాధి ఉందని అనుమానించాలి. దీని ఆధారంగా జీఎఫ్‌ఆర్‌ను అంచనా వేసి, వడపోత ప్రక్రియ ఎలా ఉందో తెలుసుకుంటారు. సాధారణంగా మూత్రపిండాల్లో నిమిషానికి 100 ఎం.ఎల్‌. రక్తం శుద్ధి అవుతుంది. ఇది నిమిషానికి 80 ఎం.ఎల్‌. కన్నా తగ్గితే కిడ్నీ వ్యాధి ఆరంభమైనట్టే. ఇలా మూడు నెలల పాటు ‘జీఎఫ్‌ఆర్‌’ క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’గా భావిస్తారు.

*అల్ట్రాసౌండ్‌ పరీక్ష: ఇందులో కిడ్నీల పరిమాణం ఎలా ఉం ది, రాళ్లు, నీటితిత్తులు (పాలీ సిస్టిక్‌ కిడ్నీ) వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. గ్లొమెరూలర్‌ నెఫ్రైటిస్‌, అధిక రక్తపోటు గలవారిలో కిడ్నీ పరిమాణం తగ్గుతుంటుంది. పాలీ సిస్టిక్‌ డిసీజ్‌లో, మూత్రమార్గంలో రాళ్ల వంటివి అడ్డుపడినప్పుడు కిడ్నీ సైజు పెరుగుతుంది. మధుమేహుల్లో ముందు కిడ్నీ ఆకారం పెరిగి, తిరిగి మామూలుగా అవుతుంది.

*పీటీహెచ్‌ పరీక్ష: క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ గలవారిలో పారా థైరాయిడ్‌ హార్మోన్‌ (పీటీహెచ్‌) ఎక్కువతుంది. కాబట్టి దీన్ని కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కిడ్నీ జబ్బు ఉంటే సీరం క్యాల్షియం, సీరం ఫాస్ఫరస్‌, సీరం యూరిక్‌ యాసిడ్‌, ఆల్కలైన్‌ ఫాస్ఫేట్‌జ్‌ వంటి పరీక్షలూ అవసరం.

చికిత్స ఏంటి?
మధుమేహులైతే గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు 120/80 ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే స్టాటిన్స్‌.. యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటే అలోప్యూరినాల్‌ వంటి మందులు ఇస్తారు. క్యాల్షియం తక్కువుంటే క్యాల్షియం మాత్రలు ఇస్తారు. వీటిని పరగడుపున వేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్యాల్షియం బాగానే ఉండి ఫాస్ఫరస్‌ మాత్రమే ఎక్కువుంటే వీటిని భోజనంతో పాటు గానీ భోజనం చేశాక గానీ వేసుకోవాల్సి ఉంటుంది. క్యాల్షియం మాత్రల మూలంగా రక్తంలో క్యాల్షియం మోతాదు పెరుగుతుందనే అనుమానముంటే ‘సెవలామెర్‌’ వంటి మాత్రలు ఇస్తారు. వీటిని భోజనంతో పాటు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫాస్ఫరస్‌ స్థాయి తగ్గి క్యాల్షియం పెరగకుండా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్‌ స్థాయిలు అదుపులోకి వస్తాయి. పీటీహెచ్‌ స్థాయులూ తగ్గటానికి అవకాశముంటుంది. పీటీహెచ్‌ మరీ ఎక్కువగా ఉంటే ‘సినాక్యాల్సెట్‌’ మందు ఇస్తారు. దీంతో రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోవటం తగ్గుతుంది. ఎముకలు బలహీనపడకుండా చూస్తుంది. కిడ్నీ జబ్బు బాధితుల్లో ఇనుము లోపమూ కనబడుతుంది. దీన్ని నివారించటానికి ఇనుము మాత్రలు ఇవ్వాల్సి రావొచ్చు. అవసరమైతే ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు.

 1. చక్కెర, బెల్లం, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తక్కువగా తినాలి. బియ్యం, గోధుమల వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
*ఎందుకు?: సంక్లిష్ట పిండి పదార్థాలతో కూడిన తృణ ధాన్యాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. శక్తి కూడా నెమ్మదిగా విడుదల కావటం వల్ల దాన్ని శరీరం వెంటనే వినియోగించుకుంటుంది. చక్కెర, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తినటం వల్ల ఒక్కసారిగా శక్తి విడుదల అవుతుంది. దాన్ని శరీరం వెంటనే ఖర్చు పెట్టుకోలేదు. అప్పుడది కొవ్వు రూపంలోకి మారి, నిల్వ ఉండిపోతుంది. దీంతో బరువు పెరగటం, స్థూలకాయం రావటం జరుగుతాయి. ఇది కిడ్నీలకు మంచిది కాదు. ఇక మధుమేహులు తీపి పదార్థాలు తినటం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రణ దెబ్బతింటుంది. మధుమేహం లేనివాళ్లు ఎప్పుడైనా స్వీట్లు తిన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మితిమీరి తినరాదు.

2. మాంసాహారం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి?
*ఎందుకు?: కిడ్నీ జబ్బు బాధితుల్లో ప్రోటీన్ల నియంత్రణ చాలా కీలకం. కూరగాయల కన్నా మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ ప్రోటీన్లు జీర్ణమయ్యాక మిగిలిపోయే పదార్థాలను బయటికి పంపిచేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అదే కూరగాయల నుంచి లభించే ప్రోటీన్లతో అంత భారం ఉండదు.
అయితే డయాలసిస్‌ చేయించుకునే వారికి ప్రోటీన్ల అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రోటీన్ల నియంత్రణ పనికిరాదు. కిడ్నీ చేయాల్సిన పనిని డయాలసిస్‌ చేస్తుంది కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. ప్రోటీన్లను తగ్గిస్తే వీరిలో పోషకాహార లోపం ఏర్పడొచ్చు. అయితే ప్రోటీన్లతో పాటు ఫాస్ఫరస్‌ కూడా అందుతుంది కాబట్టి దాని మోతాదును అదుపులో ఉంచుకోవటానికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది 

3. వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులు తక్కువగా తినాలి. అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌ నూనె, చేప నూనె, అవిసె నూనె ఎక్కువగా తినాలి.
*ఎందుకు?: కిడ్నీ జబ్బు గలవారిలో, మధుమేహుల్లో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది కూడా. అందువల్ల వీళ్లు వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులను బాగా తగ్గించాలి. పాలీ, ఒమేగా-3 అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌ నూనె వంటివి తింటే మంచిది. మాంసాహారులైతే చేపనూనె తీసుకోవచ్చు. వీటిల్లోని ఒమేగా త్రీ కొవ్వులు అధిక రక్తపోటు తగ్గించటానికి.. రక్తంలోని ప్లేట్‌లెట్ల పనితీరును, కొవ్వులను నియంత్రణలో ఉంచటానికి తోడ్పడతాయి. అవిసె నూనె (ఫ్లాక్స్‌ సీడ్స్‌ ఆయిల్‌)లోనూ ఒమేగా-3 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజల పొడిని కూరలో వేసుకున్నా, అన్నంలో కలుపుకొని తిన్నా మంచిదే. పొద్దుతిరుగుడు నూనె, నువ్వుల నూనె కూడా మంచివే. ఈ నూనెలను మార్చి మార్చి వాడుకుంటే మేలు.

4. మాంసం కన్నా చేపలు తినటం మేలు.
*ఎందుకు?: చేపల్లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మాంసం కన్నా చేపలు తినటం మంచిది. సముద్రపు చేపలైతే ఇంకా మంచిది. అలాగే మాంసం ద్వారా లభించే ప్రోటీన్లలో ఫాస్ఫరస్‌ కూడా అధికంగా ఉంటుంది. కిడ్నీ జబ్బు గలవారిలో ఫాస్ఫరస్‌ మోతాదు పెరిగితే ఒంట్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌ స్థాయుల్లో సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. రక్తనాళాల్లో క్యాల్షియం చేరి, గట్టిపడటంతో అడ్డంకులు ఏర్పడి ఆయా అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశముంది. రక్తనాళాల్లో క్యాల్షియం మరీ ఎక్కువగా పోగుపడి గట్టిపడితే చర్మం నెక్రోసిస్‌ రావొచ్చు. దీంతో కండరం, చర్మం చనిపోయే ప్రమాదముంది. కొన్ని పప్పు దినుసుల్లోనూ ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు గానీ పరిమితంగా తీసుకోవాలి. బీరు, పన్నీరు, చాక్లెట్లలోనూ ఫాస్ఫరస్‌ ఎక్కువే. 

5. ఉప్పు తక్కువగా తినాలి.
*ఎందుకు?: ఉప్పు ఎక్కువగా తినటం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరిపోతుంది. ఉప్పుతో పాటు నీరు కూడా నిల్వ ఉండటంతో బరువు పెరుగుతారు. కాళ్ల వాపులు, ఆయాసం వస్తాయి. అలాగే ఉప్పు మూలంగా నీటితో పాటు రక్తం మోతాదూ పెరగటంతో గుండె మీద అధిక భారం పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది కూడా. ఉప్పు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకూ దోహదం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహులు తీపి పదార్థాలతో పాటు ఉప్పునూ పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే వీరికి మామూలుగానే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. దీనికి ఉప్పు కూడా తోడైతే అది మరింత ఎక్కువవుతుంది. చివరికిది కిడ్నీ జబ్బుకు దారితీస్తుంది.

కిడ్నీ జబ్బు బాధితులు రోజుకు 4 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తినకూడదు. కాబట్టి వండేటప్పుడు కాకుండా వండిన తర్వాత కూరల్లో ఉప్పు కలుపుకోవటం మంచిది. దీంతో ఎంత మోతాదు తింటున్నామనేది తెలుస్తుంది.

నిల్వ పచ్చళ్లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఒంట్లో నీటి శాతం పెరగటం, బీపీ పెరగటం వంటి సమస్యలకు దారితీస్తుంది. అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చళ్లల్లో అంత ఉప్పు ఉండదు కాబట్టి వీటిని తినొచ్చు.

పిజ్జాలు, గింజపప్పులు, ఆలు చిప్స్‌, శుద్ధిచేసిన ఆహార పదార్థాలు, బటర్‌, కెచప్‌, సాస్‌లు, ఉప్పు కలిపి ఎండబెట్టిన చేపలు, మాంసంలోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుంది.


6. అరటి, పుచ్చ, నారింజ, కమలా, బత్తాయి పండ్ల వంటివి పరిమితంగానే తినాలి.

*ఎందుకు?: వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి తగ్గించి తినాలి. జీఎఫ్‌ఆర్‌ తగ్గిపోయినపుడు ఒంట్లో అధికంగా ఉన్న పొటాషియంను మూత్రపిండాలు సరిగా బయటకు పంపించలేవు. దీంతో పొటాషియం మోతాదు పెరుగుతుంది. అందువల్ల పొటాషియం లభించే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆపిల్‌, బొప్పాయి, జామ, సీతాఫలం వంటి వాటిల్లో పొటాషియం మోతాదు తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవచ్చు. మొక్కజొన్నల్లోనూ పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి పరిమితంగానే తినాలి.

దాదాపు అన్ని కూరగాయల్లోనూ పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటిని ముక్కలుగా తరిగిన తర్వాత గంటసేపు నీటిలో నానేసి ఉంచటం మంచిది. దీంతో అందులోని పొటాషియం నీటిలోకి చేరుకుంటుంది. ఈ పద్ధతిని ‘లీచింగ్‌’ అంటారు. ఆ తర్వాత కూరగాయల ముక్కలను వంటలో ఉపయోగించుకోవాలి.

 7. బేకరీ పదార్థాలు మానెయ్యాలి.
* ఎందుకు?: బేకరీ పదార్థాల్లో ఉప్పుతో పాటు పొటాషియమూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకూ వీటిని మానెయ్యటమే మంచిది. నిమ్మ ఉప్పు, నల్ల ఉప్పులనూ మానెయ్యాలి. బేకరీ పదార్థాలు, మసాలా దినుసుల్లోనూ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. బిస్కట్లు, కేకులు, బ్రెడ్లలో పొటాషియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తక్కువగానే తినాలి

8. పాలు, పెరుగు వంటి పాల పదార్థాలు పరిమితంగానే తీసుకోవాలి. పల్చటి మజ్జిగ మంచిది.
* ఎందుకు?: కిడ్నీ జబ్బు గలవారిలో క్యాల్షియం మోతాదు తగ్గే అవకాశముంది. అలాగే విటమిన్‌-డి లోపం కూడా ఎక్కువే. కాబట్టి క్యాల్షియం, విటమిన్‌-డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క్యాల్షియం జీవక్రియ కొంతవరకు మెరుగుపడుతుంది. పాలు, పెరుగు వంటి వాటితో క్యాల్షియం లభిస్తుంది కానీ దాంతో పాటే ఫాస్ఫరస్‌ కూడా ఎక్కువగా లభించే అవకాశముంది. అందువల్ల వెన్న తీసిన పాలు, పెరుగు తీసుకోవాలి. అదీ పరిమితంగానే వాడుకోవాలి. పల్చటి మజ్జిగ తీసుకుంటే అంత ప్రమాదమేమీ ఉండదు. 

9. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే స్వభావం గలవారు మాత్రం- పాలకూర, టమోటా, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ మానెయ్యటం మంచిది. స్వీట్లూ తగ్గించాలి.
*ఎందుకు?: వీటిల్లో ఆగ్జలేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా పోగుపడితే రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. ఇవి కిడ్నీ డిసీజ్‌కు దారితీస్తాయి. కాబట్టి రాళ్ల సమస్యలున్నవారు టమోటా, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటివి మానెయ్యాలి. వీళ్లు డాక్టర్ల సలహా లేకుండా విటమిన్‌-సి కూడా ఎక్కువగా తీసుకోరాదు. ఇది ఆగ్జలైట్లుగా మారిపోయి తిరిగి రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. వీళ్లు స్వీట్లు ఎక్కువగా తింటే మూత్రంలోకి క్యాల్షియం ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో తిరిగి రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.

10. గుడ్డులో పచ్చసొన మంచిది కాదు.
*ఎందుకు?: ఇందులో కొలెస్ట్రాల్‌, ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ డిసీజ్‌ గలవారికి ఇది అంత మంచిది కాదు. తెల్లసొన తింటే ఫర్వాలేదు. 

11. అవసరమైన మేరకే నీరు తాగాలి.
*ఎందుకు?: మనం ఎప్పుడైనా నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలు ఆ మేరకు నీటిని బయటకు పంపించేస్తాయి. కానీ కిడ్నీ జబ్బు గలవారిలో మూత్రపిండాలు ఆ పనిని సమర్థవంతంగా చేయలేవు. దీంతో ఒంట్లో నీటి శాతం ఎక్కువై రక్తపోటు పెరగటం, ఆయాసం, కాళ్లు, ముఖం ఉబ్బటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రం ఎంత మోతాదులో వస్తోందనేది దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు నీరు తాగాల్సి ఉంటుంది. అంటే మూత్రం తక్కువగా వస్తుంటే నీళ్లూ తక్కువే తాగాలన్నమాట.

12. కాఫీ, టీలు ఎక్కువగా తాగరాదు.
*ఎందుకు?: కెఫీన్‌ మూలంగా ఒంట్లో కొవ్వు పదార్థాలు పెరిగే అవకాశముంది కాబట్టి కాఫీ, టీలను పరిమితంగానే తీసుకోవాలి. ఇన్‌స్టంట్‌ కాఫీ కన్నా ఫిల్టర్‌ కాఫీ మేలు. ఇన్‌స్టంట్‌ కాఫీలో పొటాషియం మోతాదూ ఎక్కువగానే ఉంటుంది. 

13. చింతపండు తక్కువగానే తినాలి
*ఎందుకు?: చింతపండులో ఆగ్జలైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ పనితీరు మందగించినపుడు ఇవి శరీరంలో పేరుకుపోయే అవకాశముంది. కాబట్టి పులుపు కోసం చింతపండు బదులు నిమ్మరసం వాడుకోవచ్చు. అయితే దీన్నీ పరిమితంగానే తీసుకోవాలి.

14. పొగ మానెయ్యాలి. మద్యం పరిమితంగా తీసుకోవాలి.
*ఎందుకు?: పొగ తాగటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలూ గట్టిపడతాయి. పొగలోని విష పదార్థాలు నేరుగా మూత్రపిండాల్లోని గ్లోమరులస్‌ను దెబ్బతీస్తాయి. గుట్కా కూడా పొగ మాదిరిగానే దుష్ప్రభావం చూపుతుంది. ఇక మద్యం నేరుగా కిడ్నీ ట్యూబుల్స్‌ను దెబ్బతీస్తుంది. దీంతో ఒంట్లో కొవ్వు పెరిగే అవకాశమూ ఉంది. మద్యం అలవాటు గలవారు ఇతర పదార్థాలు అంతగా తీసుకోకపోవటం వల్ల వీరిలో పోషకాహార లోపం రావొచ్చు. 

15. వక్కపొడి మంచిది కాదు.
* ఎందుకు?: ఇందులో పొటాషియం, ఆల్కలాయిడ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.

16. కూల్‌డ్రింకులు మానెయ్యాలి.
*ఎందుకు?: వీటిల్లో ఫాస్ఫేట్‌ అధికంగా ఉండటం వల్ల ఎముకల్లో క్యాల్షియం చేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. వ్యాయామం మరవరాదు కిడ్నీ జబ్బు బాధితులు రోజుకి అరగంట సేపైనా వ్యాయామం చేయటం మంచిది. నడక, సైక్లింగ్‌ వంటివి ఏదైనా చేయొచ్చు. వీటికి తోడు యోగా కూడా చేసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు తగు వ్యాయామాలు చేయాలి. కిడ్నీ జబ్బు బాధితుల్లో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగే అవకాశం ఎక్కువ. ఇది గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటికి దారితీయొచ్చు. కాబట్టి వీళ్లు జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిన అవసముంది. దీంతో వ్యాధి మరింత ముదరకుండా చూసుకోవచ్చు. కిడ్నీల పనితీరును మెరుగుపరచుకునే అవకాశమూ ఉంది. డయాలసిస్‌ చేయించుకుంటున్నప్పుడూ తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని