Published : 17 Jan 2016 13:55 IST

అమ్మ పోషణ.. అమృత రక్షణ

అమ్మ పోష‌ణ‌.. అమృత ర‌క్ష‌ణ‌


  పచ్చటి మొక్క ఏపుగా ఎదగాలంటే...  ఏ దశలో నీరు పట్టాలో ఆ దశలోనే పట్టాలి.  ఎప్పుడు వెయ్యాల్సిన ఎరువు అప్పుడే పడాలి. అడుగడుగునా ‘అదను’ చూసి పోషణ చెయ్యాలి!  పసిబిడ్డలూ అంతే! వారికి ఏ దశలో ఇవ్వాల్సిన ఆహారం ఆ దశలో ఇవ్వాలి. పసిబిడ్డల సంరక్షణ.. పోషణ.. తరతరాలుగా మనకు అలవాటైనదే అయినా... ఇప్పటికీ పిల్లల ఆహారం విషయంలో బోలెడు అనుమానాలు. తల్లిపాల నుంచి ఉగ్గు పెట్టటం వరకూ ప్రతి అంశంలోనూ ఎన్నో అపోహలు. ఫలితమే మన దేశంలో ఎంతోమంది చిన్న పిల్లలు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. శిశు మరణాల సంఖ్యా ఎక్కువగా ఉంటోంది. మనం శాస్త్రీయమైన అవగాహనతో వ్యవహరిస్తే పిల్లలు చక్కగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అందుకే పసిబిడ్డల ఆహారానికి సంబంధించి సమగ్ర వివరాలను మీ కోసం....

* ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మంది మన భారతదేశంలోనే ఉన్నారు.
* ఐదేళ్లలోపు పిల్లల్లో 52% మరణాలు కేవలం పోషకాహార లోపం, దానివల్ల తలెత్తే సమస్యల కారణంగానే సంభవిస్తున్నాయి.
* మన దేశంలో 46% పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. పోషకాహారం అందటం లేదనటానికి ఇది కీలక సంకేతం.
* పిల్లల్లో మూడింట ఒకొంతు మంది పొట్టిగా ఉండిపోతున్నారు. ఇది దీర్ఘకాలిక పోషకాహార లోపానికి సూచిక.
- నిజానికి ఈ పోషకాహార లోపాన్ని అధిగమించటానికి ప్రజల్లో అవగాహన పెరగటం కీలకం. కేవలం దీంతోనే మనం 50% మరణాలను అరికట్టవచ్చు. దీన్ని సాధించాలంటే.. ప్రజలందరికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలియాలి:

* పుట్టగానే బిడ్డకు తొలి గంట లోపలే తల్లిపాలు ఇచ్చేయాలి.
* తొలి ఆర్నెల్లూ తల్లిపాలు తప్పించి మరే ఇతర ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి మంచి నీళ్లు ఒక్క చుక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటి బదులూ తల్లిపాలే పట్టాలి.

* ఆర్నెల్లు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు సరైన, సమతౌల్య అదనపు ఆహారం మనం ఇంట్లో చేసిపెడితే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం కొందరు 8, 9 నెలల తర్వాత పెడుతున్నారు. అందుకే చాలామంది పిల్లలు ఆర్నెల్ల వరకూ బొద్దుగా ఉండి, ఆ తర్వాత బక్కగా అయిపోతున్నారు. ఆర్నెల్లకు అన్నం ముట్టించాలని మన వాళ్లు ఎప్పుడో చెప్పారు. దీన్ని షోడశ సంస్కారాల్లో ఒకటిగా చేర్చారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసీచేసీ.. చివరికి పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పుడు ఆర్నెల్లకే అదనపు ఆహారం పెట్టాలని బోధిస్తున్నాయి.

 అపోహలు
* ఆరు నెలలు దాటిన పిల్లలకు కొందరు కేవలం ఆవు, బర్రె పాలనే ఎక్కువ ఇస్తుంటారు. పాలలో ఇనుము మోతాదు తక్కువ. పాలు సమతులాహారం కాదు. పాలు తాగే పిల్లలు బొద్దుగా బాగానే ఉంటారు కానీ ఇలాంటి వారందరిలోనూ రక్తహీనత కనబడుతుంది.
* పిల్లలకు జబ్బు చేసినప్పుడు తల్లిపాలనే ఇష్టపడి మిగతా ఆహారాన్ని పెద్దగా తీసుకోరు. అయితే మీది ఆహారం ఇవ్వకూడదనేమీ లేదు. ఎంత జబ్బు చేసినా తీసుకోగలిగితే తప్పకుండా ఇవ్వాలి. జబ్బు తగ్గిన తర్వాత తిండి మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఎదుగుదల తిరిగి గాడిలో పడేందుకు ఒకట్రెండు సార్లు అధికంగా కూడా పెట్టాలి.
* పిల్లలు ఒకట్రెండు సార్లు దొడ్డికి పోగానే చాలమంది తల్లిపాలు ఆపేస్తున్నారు. ఇది మరో అపోహ. దీంతో పిల్లల్లో పోషకాలు లోపిస్తాయి. బరువు తగ్గిపోయి, బలహీన పడతాడు. వ్యాధి మరింతగా బాధిస్తుంది. కాబట్టి నీళ్ల విరేచనాలు, న్యుమోనియా వంటివి వచ్చినా తిండి పెడుతూనే ఉండాలి.
* ఫలానా పొడిని పాలలో కలిపి తాగితే శక్తిమాన్‌ అయిపోతారు, కొడితే బంతి సిక్స్‌ ఖాయం, బిల్డింగుల మీది నుంచీ దూకొచ్చు.. ఇలాంటి అశాస్త్రీయ ప్రచారాలను ఏమాత్రం నమ్మొద్దు.
* అన్నింటికన్నా ముఖ్యంగా.. ఈ సూచనలు అన్నింటికీ పరిష్కారాలు చూపకపోవచ్చు గానీ ఈ చిన్నచిన్న చిట్కాలను రోజూ పాటించటం వల్ల పిల్లలకు అవసరమైన పోషకాలను చాలా వరకూ అందించొచ్చు. వారిలో గణనీయమైన మార్పు తెస్తాయి.
* ఒత్తిడిలో ఉన్నా తల్లులు బిడ్డకు పాలివ్వగలరు. అందులో అనుమానమేం లేదు. ఒత్తిడిలో ఉన్నా తల్లికి పాలు తయారవుతుంటాయిగానీ అవి బయటకు సరిగా రావు. (దీన్నే ‘లెడ్‌డౌన్‌ రిఫ్లెక్స్‌’ అంటారు) పాప చీకినప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి.
* బక్కగా పోషకాహారలోపంతో ఉన్న తల్లులు, రొమ్ములు చిన్నగా ఉన్న తల్లులు పిల్లలకు తగినంత పాలివ్వలేరన్నది మరో అపోహ. తల్లులు బక్కగా ఉన్నారా? రొమ్ములు చిన్నగా ఉన్నాయా? అన్నది అర్థం లేదు. పాలకూ, రొమ్ముల సైజుకూ సంబంధం లేదు.
* పిల్లలకు ఆర్నెల్ల లోపలే అదనపు ఆహారం, మీదిపాల వంటివి ఇవ్వటం వల్ల తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోతుంది. బిడ్డ చీకటం తగ్గినకొద్దీ పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

పరిశుభ్రత కీలకం
* బిడ్డకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండిన తర్వాత రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు, దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
* మీజిల్స్‌ టీకాతో పాటు విటమిన్‌-ఎ ఇప్పించాలి. ఏడాది తర్వాత ఆర్నెల్లకో సారి పొట్టలో పురుగులుంటే పోయేందుకు ‘అల్బెండజాల్‌’ ఒక చెంచా మందు పట్టాలి. ఇలా బిడ్డకు ఐదేళ్లు వచ్చే వరకూ పట్టటం మంచిది. ఇది మురికివాడల్లో, అపరిశుభ్ర వాతావరణంలో ఉండేవారికి మరీ తప్పనిసరి.

తొలి గంట నుంచి ఆర్నెల్లు: తల్లిపాలు
పుట్టిన బిడ్డ బతికి బట్టకట్టి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే 1. తల్లిపాలు కావాలి 2. తల్లి పక్కన లభించే ఆ వెచ్చదనం కావాలి. 3. ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్రత ఉండేలా చూడాలి. 4. పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టాలి. తల్లిపాలను మించినది, దానికి సాటి మరోటి లేదు.

* సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినా- తొలి గంటలోనే బిడ్డకు తల్లిపాలు పట్టచ్చు. సహజ కాన్పు కాదు కాబట్టి వెంటనే పాలు రావేమోనన్న శంక అవసరం లేదు.
* పుట్టగానే బిడ్డకు ముర్రుపాలు ఇచ్చేయాలి. గ్లూకోజు నీళ్లు, తేనె, పేకెట్‌ పాలు, ఆవుపాలు నాకించటం (ప్రీలేక్టెల్‌ ఫీడ్స్‌) వంటివేమీ చెయ్యద్దు.
* పుట్టుకతోనే సమస్యలున్న పిల్లలను ఇంక్యుబేటర్లలో పెడుతుంటారు. ఇలాంటి వారికి కూడా తల్లిపాలను పిండి ట్యూబ్‌ ద్వారానో, చెమ్చాతోనో ఇప్పించే ప్రయత్నం చేయాలి.
* బిడ్డ ఏడిస్తేనే పాలు ఇవ్వాలనేదేం లేదు. ఏడ్వటమన్నది పాలకోసం పసిబిడ్డలు చేసే ప్రయత్నాల్లో ఆఖరిది. ఏడ్వటానికి ముందు పిల్లలు పాల కోసం- చప్పళింత శబ్దాలు చేయటం, పెదాలు నాకటం, గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవటం, సున్నితమైన కూతలు.. కళ్లు అటూ ఇటూ వేగంగా తిప్పుతుండటం.. ఒక రకమైన చికాకులా కదలికల వంటివన్నీ మొదలుపెడతారు. తల్లులకు ఈ విషయాలు తెలిస్తే కరెక్టుగా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే పాలు ఇవ్వగలుగుతారు.
* బిడ్డకు 3, 4 నెలలు రాగానే చాలామందిలో.. బిడ్డ పెరుగుతోంది, ఇక నా పాలు సరిపోతాయా? అని తమ మీద తమకే అనుమానం, అపనమ్మకం మొదలవుతోంది. ఇది పూర్తి అపోహ. ఆర్నెల్ల వరకూ బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తల్లిదగ్గర కచ్చితంగా లభ్యమవుతాయి.
* చాలామంది 3 నెలలు రాగానే బిడ్డకు ఏం పెట్టాలని అడుగుతుంటారు. ఏమీ పెట్టనక్కర్లేదు. ఇవాళారేపూ ఇళ్లల్లో అమ్ముమ్మలు, నాయనమ్మలు కూడా- మూడు నెలలు వచ్చాయి, బిడ్డకు అవీఇవీ పెట్టరాదా? అని దెప్పటం, సాధించటం మొదలుపెడుతున్నారు. ఇది పురోగమనం కాదు, తిరోగమనం!
* పని చేసే తల్లులు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పాలు పిండి ఇంట్లో పెట్టివెళ్లొచ్చు. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పాలు పిండి నిల్వ చేయచ్చు.
* తల్లికి జ్వరం వస్తే తల్లి జ్వరం పిల్లకీ వస్తుంది, పాలివ్వద్దనే వారూ ఉన్నారు. ఇది పూర్తి అపోహ. తల్లికి జబ్బు ఉన్నా పాలు ఇవ్వవచ్చు. ఆ పాల ద్వారా వ్యాధులు రావు. ఇవ్వగలిగే శక్తి కూడా వారికి ఉంటుంది. గర్భిణి సమయంలో తల్లి బరువు పెరుగుతుంది. కాన్పు తర్వాత కొంత తగ్గినా.. మిగిలిన బరువంతా బిడ్డకు పాలివ్వటానికి సహకరించే ఆహారభద్రత. పిల్లలకు పాలివ్వటం ద్వారా తల్లులు గర్భం దాల్చటానికి ముందున్న బరువుకు వచ్చేస్తారు. పాలివ్వకపోతే వూబకాయం వస్తుంది. పైగా ఒకసారి పాలు ఆపితే మళ్లీ రావటం కొంత కష్టమవుతుందని చెప్పాలి.
* కొందరు తల్లులు ‘పాలు రాకపోతే మధ్యలో ఆపేశా!’ అని చెబుతుంటారు. వీళ్లు కూడా ఇవ్వటం ఆరంభిస్తే మళ్లీ పాలు వస్తాయి. దీన్నే ‘రీలాక్టేషన్‌’ అంటారు. పాలు పడితే వస్తాయి, పట్టకపోతే రావు! ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా వస్తాయి. ప్రధానంగా 1. పాలివ్వాలన్న తపన. 2. వస్తాయన్న నమ్మకం. 3. పడుతూ ఉండటం. 4. చుట్టూఉన్నవారి ప్రోత్సాహం.. ఇవి ఉంటే చాలు.. నూరు శాతం పాలు వస్తాయి.
* బిడ్డ ఆరోగ్యానికి సీసా శత్రువు. సకల జబ్బులకూ అది మూలం. ఏటా 5 లక్షల మంది పిల్లలు సీసా వల్ల చనిపోతున్నారు.
* బిడ్డకు పాలు సరిపోవటం లేదన్నది పెద్ద అపోహ. నెలనెలా బిడ్డ ఎదుగుదల బాగుండి, గ్రోత్‌ఛార్ట్‌లో పెరుగుదల చక్కగా ఉండి, బిడ్డ హాయిగా నిద్రపోతూ రోజుకు 6 సార్లు మూత్రం పోస్తుంటే పాలు సరిపోతున్నాయనే అర్థం. బిడ్డ పెరుగుదల కచ్చితంగా చెప్పేది ‘గ్రోత్‌ఛార్ట్‌’. ప్రతి తల్లీతండ్రీ ఈ ఛార్ట్‌ విషయంలో శ్రద్ధ పెట్టాలి.

6-12 నెలలు: పాలతో పాటు అదనపు ఆహారం
* బిడ్డకు ఆర్నెల్లు పూర్తి అయినప్పుడు ‘తల్లిపాలతో పాటుగా’ అదనపు ఆహారం ఇవ్వాలి. కేవలం అదనపు ఆహారం ఇచ్చి.. తల్లిపాలు మానెయ్యకూడదు.
* మొదటి ఆర్నెల్లూ బిడ్డ పోషకావసరాలు నూటికి నూరు శాతం తల్లిపాల ద్వారానే తీరతాయి. 6-12 నెలల వయసులో 50 శాతం తల్లిపాలు, మరో 50% అదనపు ఆహారం; ఇక 12 నెలలు నిండిన తర్వాత 33% తల్లిపాలతో, మిగతా 67% తిండితో రావాలి.
* అదనపు ఆహారంగా ఇంట్లో ఉండే దినుసులతో చేసిన ఆహారమే మంచిది. రకరకాల ధాన్యాలు, పప్పులు కలిపి పిండిపట్టించి దాన్ని రెండుపూట్లా జావలా చేసిపెట్టటం మంచిది. తమిళనాడులో- ముడిబియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, సగ్గుబియ్యం, పెసర పప్పు, మినప పప్పు, పుట్నాలు, సోయా, పల్లీ, జీడిపప్పు, బాదం, యాలకుల వంటి 18 రకాల దినుసులతో ‘కంజి కిట్‌’ అనేది ప్రాచుర్యంలో ఉంది. ఇది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే అదనపు ఆహారం. వీటన్నింటినీ పొడి చేసుకుని.. రెండు స్పూన్లు గంజి మాదిరిగా తయారు చేసి 6-8 నెలల వరకూ రోజూ రెండు పూట్లా పెట్టాలి. ఒకట్రెండు చెమ్చాల నుంచి మొదలుపెట్టి క్రమేపీ ఎంత తింటే అంత, మూతి తిప్పేసేదాకా పెట్టాలి. ఇది కాకుంటే ఇంట్లో ఉంటే బియ్యం, పప్పుతో ఉగ్గు తయారు చేసుకొని, జావ మాదిరిగా చేసి.. ఉప్పు-నెయ్యి లేదా చక్కెర-నెయ్యి వేసి తినిపించాలి. పిల్లల కడుపు చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ ఆహారంతోనే ఎక్కువ కేలరీలు లభించాలంటే ఉగ్గులో నెయ్యి, వెన్న వంటివి వేసుకోవచ్చు.
* చిరుతిండిగా (స్నాక్‌) అరటిపండు, ఉడకపెట్టిన ఆలుగడ్డ, ఆపిల్‌ వంటివి ఇవ్వొచ్చు. రోజులో రెండు సార్లు ఉగ్గు, ఒకసారి చిరుతిండి పెట్టొచ్చు. 9-11 నెలల వయసులో అయితే మూడు సార్లు ఉగ్గు, రెండుసార్లు చిరుతిండి పెట్టొచ్చు.
* ఇంట్లో వండిందే: అదనపు ఆహారం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవాలి. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మే వాటిని పిల్లలకు పెట్టొద్దు. ‘ఇన్‌ఫ్యాంట్‌ మిల్క్‌ సబ్‌స్టిట్యూట్‌’ చట్టం ప్రకారం ఎవరైనా వాణిజ్యంగా తయారు చేసిన పాలు, అదనపు ఆహారం గురించి ప్రకటనలు ఇవ్వటం, అది తల్లిపాలతో సమానమని చెప్పటం, దాన్ని ప్రోత్సహించటం శిక్షార్హమైన నేరం.
*చాలామంది బయట కొనుక్కొచ్చినదే చాలా శక్తినిస్తుందని పొరబడుతుంటారు. నిజానికి అందులో ఉండేది ఏదో ఒక పిండే. పైగా కొనుక్కొచ్చి పెడతారు కాబట్టి కొద్దికొద్దిగా ఇస్తారు, దీంతో బిడ్డ అవసరాలకు అదీ సరిపోదు. ఇంట్లో వండుకొన్నదైతే పిల్లలకు ఎంత కావాలంటే అంత ఇవ్వొచ్చు.
* 9 నెలలు నిండిన తర్వాత మనం ఇంట్లో వండుకునే ఆహారాన్నే చేత్తో గుజ్జుగుజ్జుగా చేసి దాంట్లోనే టమోటా, బీరకాయ, ఆకుకూరల వంటివి కలిపి ఇవ్వొచ్చు. ఏడాది దాటితే ఇంట్లో అంతా ఏం తింటే బిడ్డకూ అదే (ఫ్యామిలీ డైట్‌) మెత్తగా చేసి పెట్టొచ్చు. దాంతో పాటు తల్లి పాటు కూడా ఇవ్వాలి.

రెండేళ్ల వరకూ..
తల్లిపాలను రెండేళ్లు నిండే వరకు తప్పకుండా ఇవ్వాలి. అది తల్లి ధర్మం. తాగే హక్కు పిల్లవాడికీ ఉంది. రెండేళ్ల తర్వాత తల్లికి ఇష్టం ఉంటే ఇవ్వొచ్చు. లేకపోతే లేదు. గిరిజనుల్లో కొందరు నాలుగేళ్ల వరకూ పిల్లలకు పాలిస్తుంటారు. ఇది మంచిదే కానీ అదనపు ఆహారం ఇవ్వకుండా కేవలం తల్లిపాలే పడుతుండటం మాత్రం సరికాదు. దానివల్ల పిల్లలు చిన్నగా, పొట్టిగా, బక్కగా అయిపోతారు.

సమయానికి తగు చర్యలు
* పిల్లలకు అదనపు ఆహారం ఇచ్చేటప్పుడు 9-12 నెలల మధ్య కొద్దికొద్దిగా బరక గింజలు అలవాటు చెయ్యకపోతే వారికి తర్వాత ఆ అలవాటు చెయ్యటం కష్టమవుతుంది. ఆ సమయంలోనే వాళ్లకు అవి పరిచయం చేస్తే పిల్లలు వాటికి తేలికగా, నమిలి మింగటానికి అలవాటుపడతారు. ఇవాళారేపూ తల్లులు పిల్లలకు మిక్సీలో వేసినంత మెత్తగా తయారుచేసి.. మెత్తటిది కూరుతున్నారు. అది సరికాదు.
* తల్లి పుట్టగానే పడితే పాలు ఎక్కువ తయారవుతాయి. మొదటి 7 రోజులు పట్టలేదంటే పాలు ఎండిపోయే అవకాశాలుంటాయి. ఇది కీలక దశ అని గుర్తించాలి.
* 6-8 నెలల మధ్య పెట్టే పదార్థం.. కొద్దిగా వంచితే చెంచా నుంచి జారి కింద పడిపోయేలా ఉండకూడదు. అది చెంచాకు అంటుకునే ఉండాలి. అలా ఉంటేనే బిడ్డకు సరైన కేలరీలు అందుతాయి. పూర్తి పల్చటిది పెడితే శక్తిసరిపోక పిల్లలు బక్కగా అయిపోతారు.
* వాణిజ్యపరంగా తయారు చేసే జంక్‌ ఫుడ్‌ సమతౌల్యం ఉండదు. కొన్నింటిలో తీపి ఎక్కువ ఉంటే మరికొన్నింటిలో కొవ్వు, ఇంకొన్నింటిలో ఉప్పు.. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అంతేగానీ వీటిలో పోషకాహారం దొరకదు. అందుకే వీటిని జంక్‌ఫుడ్‌ అంటారు.
* సంపూర్ణ ఆహారంలో చాక్లెట్లు, బిస్కెట్లు, టాఫీలు, చిప్స్‌, కోలాలు భాగం కానే కావు. వాటివల్ల ఆరోగ్యానికి హానే ఎక్కువ. వీలైనంత వరకూ ఇంట్లో వండి ప్రేమ భావంతో పెట్టటం ముఖ్యం.

యుద్ధాలు చెయ్యొద్దు
పిల్లలకు ఏం తినిపిస్తున్నామన్నదే కాదు ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతతో, ఎంత సంతోషంతో తినిపిస్తున్నామన్నదీ కీలకమే. పిల్లలకు తినిపించటంలో రెండు మూడు రకాల పద్ధతులున్నాయి. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైంది ‘రెస్సాన్సివ్‌ ఫీడింగ్‌’. అయితే ప్రస్తుతం మన సమాజంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. తెలిసో, తెలియకో, ఓపిక లేకనో చాలామంది ‘కంట్రోల్డ్‌ ఫీడింగ్‌’ చేస్తున్నారు. అంటే బిడ్డను కాళ్ల మీద కూచోబెట్టుకునో, పండబెట్టుకునో నోట్లో కుక్కుతున్నారు. పైగా బిడ్డ ఆ ఆహారాన్ని ముట్టుకోకుండా చేతులు కట్టేస్తారు. చెమ్చాతో లేదా చేత్తో నోట్లో కుక్కుతారు. పిల్లాడేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేస్తూ పోరాటం చేస్తుంటాడు. తినకపోతే కొట్టేవాళ్లూ ఉన్నారు. ఈ తతంగం- ఇక చాలని తామే నిర్ధారణ చేసుకొనే వరకూ సాగుతుంది. దీనివల్ల పిల్లలకు తిండిపట్ల తిరస్కార భావం వస్తుంది. అన్నం కలుపుకొని వస్తున్నారంటేనే పిల్లవాడు పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తిండిపై ఇలాంటి వ్యతిరేక, తిరస్కార భావన పిల్లాడికి కలగనీయరాదు. ఎవరైనా గానీ సంతోషంగా తినాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. ఏది మంచిది అంటే.. పిల్లవాడి చేతులు కడగాలి. తినిపించేవాళ్లూ చేతులు కడుక్కోవాలి. పిలవాడిని తినిపించేవారి ఎత్తులో కూచోబెట్టుకోవాలి. ఒకరినొకరు కళ్లలోకి చూసుకోవాలి. నవ్వుకుంటూ.. ‘బుజ్జికన్నా.. ఇది నువ్వు తినాలి. బాగుంటుంది. తియ్యగుంటుంది’ అని ముచ్చట్లు చెబుతూ తినిపించాలి. అది కూడా చెమ్చాతో గానీ చేత్తోగానీ ఎక్కువ తీసుకోరాదు. కొంచెం తీసుకోవాలి. నోట్లో కుక్కొద్దు. ముద్దను పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానే లోనికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. కంట్రోల్డ్‌ ఫీడింగ్‌లో పిల్లవానికి ఈ తృప్తి దక్కదు. ‘నాది నేను తిన్నాను’ అనే ఆ స్వయంతృప్తి వాడికి దక్కేటట్టుచేయాలి. పిల్లాడు తన తిండి తాను తినగానే ‘వెరీగుడ్‌.. మంచిగ తిన్నవు బిడ్డా’ అని మెచ్చుకోవాలి. మనం బాధలో ఉన్నప్పుడు తక్కువ తింటాం. పిల్లలూ అంతే అని గుర్తించాలి. సంతోషపెట్టి ఎక్కువ తినిపించాలిగానీఏడిపిస్తూ తక్కువ తినిపిస్తే పిల్లాడికి సరైన పోషకాలు ఎలా లభిస్తాయి?

గుడ్డు - మాంసం
పిల్లలకు గుడ్డు.. పసుప్పచ్చది 6-9 నెలల్లో ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. ఖీమా (మిన్స్‌డ్‌ మీట్‌) తొమ్మిది నెలల తర్వాత ఇస్తే మంచిది. గుడ్డులోని తెల్లసొన, చేపలు మాత్రం ఏడాది దాటిన తర్వాత పెడితే అలర్జీలు రాకుండా ఉంటాయి. ఇక శాకాహారులు అదనపు ఆహారంలో- పాలు, పాల పదార్ధాలైన పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటివి విరివిగా వాడొచ్చు. పప్పుల్లో కూడా మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కనుక 6-12 నెలల్లోపు ఆహారంలో ఇవి ఉండేలా చూడటం అవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు