కన్నా!

నిద్రపోతుంటే ముద్దుగానే ఉంటారుగానీ.. ఆ నిద్రకు ముందు పెద్ద యుద్ధాలే చేస్తుంటారు! పగలంతా కమ్మగా నిద్రలాగిస్తారు.. రాత్రి అవుతూనే పిల్లసైనికుల్లా .....

Published : 17 Jan 2016 14:09 IST

కన్నా!

నిద్రపోతుంటే ముద్దుగానే ఉంటారుగానీ.. ఆ నిద్రకు ముందు పెద్ద యుద్ధాలే చేస్తుంటారు! పగలంతా కమ్మగా నిద్రలాగిస్తారు.. రాత్రి అవుతూనే పిల్లసైనికుల్లా ఎక్కళ్లేని చురుకుదనంతో ఎవర్నీ పడుకోనివ్వకుండా ఆటలు మొదలెడతారు. ఒకపక్క నిద్ర ముంచుకొస్తుంటుంది.. మనసు ఆటల వైపు లాగుతుంటుంది. ఏడుపు, నానా రభస. అతి కష్టమ్మీద నిద్ర పుచ్చుతాం.. వెనక్కితిరిగే లోపే లేచి కెవ్వున ఏడుపు. ఈ ‘పిల్ల నియంతృత్వం’తో ఇల్లంతా కల్లోలం. అమ్మా నాన్నలకు తలప్రాణం తోకలోకి వస్తుంటుంది. నిజానికి పిల్లల నిద్ర విషయంలో సరైన అవగాహన పెంచుకుంటే.. ఇవన్నీ సమస్యలే కాదు. వీటిని అధిగమించటం చాలా తేలిక. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు మీ ముందుకు తెస్తోంది సుఖీభవ.
నిద్ర ఎవరికైనా అవసరం, పిల్లలకు మరీ అవసరం.శిశువులు మూడునెలలు వచ్చేవరకు రోజులో కనీసం 18-20 గంటలైనా విడతలవారిగా నిద్రపోతారు. మధ్యమధ్యలో పాలు తాగటానికి లేవటం, మళ్లీ పడుకోవటం.. ఇలా ఉంటుంది వాళ్ల నిద్రశైలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంటుంది. మూడు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు రోజులో 14-15 గంటలు నిద్రపోతారు. 2-4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో సుమారు 12 గంటలు నిద్రపోతారు. స్కూలుకెళ్లే వయసు (5-9 ఏళ్లు) పిల్లలు కనీసం 10-12 గంటలైనా నిద్రపోవాలి. యుక్తవయసు వచ్చేసరికి పిల్లల్లో నిద్ర అవసరం తగ్గినా, వీళ్లుకూడా కనీసం 9 గంటలైనా పడుకోవాలి. ఇక యుక్తవయసు దాటిన పెద్దవాళ్లు రోజులో 6-8 గంటలు పడుకున్నా సరిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో పగటినిద్ర తగ్గినా ఏడాది వయసు పిల్లలు పగటివేళ కనీసం మూడు గంటలైనా నిద్రపోతారు. మిగతా పదీ పదకొండు గంటలు రాత్రివేళలో పడుకుంటారు.
కమ్మని నిద్రే ముఖ్యం: పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలు మధ్యలో నిద్రలేస్తున్నారా?లేస్తే మళ్లీ పడుకోబెట్టటానికి కష్టమవుతోందా? పొద్దున్నే వేళకు లేవటం లేదా? అనేవి ముఖ్యం. సరిగా నిద్రపోని పిల్లల్లో చికాకు కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ నాణ్యమైన నిద్ర లేకపోతే, పొద్దున లేవటానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. పదిపన్నెండేళ్ల వయసు పిల్లలు త్వరగా పడుకోరు. రాత్రి పన్నెండు గంటలదాకా కంప్యూటర్‌ గేమ్స్‌, టీవీలు, సినిమాలు చూడటం వంటివాటిలో గడిపేస్తారు. ఇవన్నీ నిద్ర నాణ్యతను దెబ్బతీసేవే. కొంతమంది నిద్ర మధ్యలో తరచూ లేచి ఏడుస్తుంటారు.ఇలాంటివారిలో నాణ్యమైన నిద్ర లేకపోవటం వల్ల పగలు నిద్రపోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఫలితంగా తరగతి గదిలో కునికిపాట్లు, పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవటం, నేర్చుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి, విషయగ్రాహ్య శక్తీ తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్లో కోపం, పిచ్చిపిచ్చిగా, అతిగా ప్రవర్తించటం వంటివి ఎక్కువవుతాయి. ఇవన్నీ ప్రవర్తన సంబంధ సమస్యలు. వీటన్నింటి ఫలితంగా మార్కులూ తగ్గుతాయి. ఇలాంటి లక్షణాలన్నింటినీ ప్రదర్శించే పిల్లలు రాత్రివేళల్లో సక్రమంగా నిద్రపోతున్నారా? అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
నిద్ర - సమస్యలు
మామూలుగా 25 శాతం మంది చిన్నారుల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ కొద్దికాలంపాటు ఉండి, తగ్గిపోయేవే.
* కొంతమంది చిన్నపిల్లలు రాత్రి నిద్రలో లేచి ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఈ సమస్య 50 శాతం మందిలో కనిపిస్తుంది.
* నిద్రలో అదేపనిగా కాళ్లు కదిలిస్తూ, తన్నుతూ అటూఇటూ పొర్లే ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌’తో బాధపడే పిల్లలు 25 శాతం ఉంటారు.
* నిద్రలో లేచి నడిచివెళ్లి (స్లీప్‌వాకింగ్‌) వేరేచోట పడుకునే అలవాటు ఉండే పిల్లలూ ఉంటారు. ఇలాంటివారు 15 శాతం మంది.
* కొంతమంది పిల్లల్లో పళ్లు నూరటం (బ్రక్సిజం) వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే దీనిని చాలామంది కడుపులో పురుగులు ఉంటే ఇలా పళ్లు కొరుకుతారని భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు. 25 శాతం మంది పిల్లలు ఎప్పుడో ఒకసారి పళ్లు నూరేవారే. దీనికి అంతగా ఆందోళన చెందాల్సిందేమీ లేదు.
* కొంతమంది పిల్లల్లో రాత్రివేళ భయంకరంగా అరవటం వంటి సమస్యలు కనిపిస్తాయి. రాత్రివేళ లేచి కేకలు పెడుతూ అరవటం, భయపడుతూ చెమటలు పట్టటం జరుగుతుంటాయి.
...ఇవన్నీ ఒకరకమైన ఉపశమనం పొందటంలో కనిపించే లక్షణాలు. అంటే.. తమలో దాచుకున్న అనుభూతుల్ని బయట పెట్టుకునే మార్గాలు. ఆందోళన స్థాయులు ఎక్కువగా ఉండే పిల్లలకు ఇవి ఎక్కువగా ఉంటాయి. కొద్దిరోజులపాటు ఇలాంటి లక్షణాలు కనిపించి పోతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమేం ఉండదు. చాలారోజులపాటు ఇలా ప్రవర్తిస్తుంటే వైద్యుల్ని సంప్రదించాలి.
వ్యాధులూ కారణమే: నిద్రకు భంగం కలిగించే సమస్యల్లో కొన్నిసార్లు వ్యాధులూ కారణమవుతుంటాయి. వాటిని పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.
* స్లీప్‌ అప్నియా: నిద్రలో గురకపెట్టటం వంటి సమస్య ఉన్నట్లయితే శ్వాసనాళంలో అడ్డంకులేవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ వాచటం వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుని నోటితో గాలిపీల్చే సమస్య తలెత్తుతుంది. అదేకాకుండా రాత్రి పడుకున్నప్పుడు గొంతు కండరాలు వదులుగా మారతాయి. దీనివల్ల నోటి ద్వారం కూడా మూసుకుపోయి పూర్తిగా శ్వాస ఆడని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఒక్కసారి భయంగా లేచి కూర్చుంటారు. దీనినే ‘అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా సిండ్రోమ్‌’ అంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే గుండె-­పిరితిత్తుల సమస్యలూ, మెదడుకూ ఆక్సిజన్‌ సరిగా అందక బుద్ధి, తెలివితేటలు మందగించే అవకాశం ఉంటుంది.

* తీసుకున్న ఆహారం వెనక్కి తన్నటం వల్ల ­పిరి అందక అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. ఇలాంటి రీఫ్లక్స్‌ సమస్య ఉందా అనేదీ గమనించాలి.
* ఆస్థమా, రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌ వంటి సమస్యల్లో కూడా సరిగా నిద్రపట్టదు.
* ఒక్కోసారి నిద్ర సరిగా పట్టకపోవటానికి మందులు కూడా కారణమవుతుంటాయి. ఆస్థమాకు ఇచ్చే కొన్నిరకాల మందులతో.. గుండె దడ, చేతులు వణకటం, నిద్ర పట్టకపోవటం వంటి దుష్ఫలితాలు తలెత్తుతుంటాయి.
* డిప్రెషన్‌లో వాడే కొన్నిరకాల మందులు కూడా నిద్ర రానివ్వకుండా మెలకువగా ఉంచుతాయి.
* పిల్లలకు ఫిట్స్‌ కోసం ఇచ్చే మందుల వల్ల మగతగా ఉండి, పగటి వేళల్లో నిద్రపోతుంటారు. ఫలితంగా రాత్రివేళ నిద్ర తగ్గుతుంది.
* పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రులు విడిచి వెళతారనే భయం, ఇంట్లో, స్కూల్లో వాతావరణం సరిగా లేకపోవటం వంటి సమస్యలుండే పిల్లల్లో ఎప్పుడూ భయం, ఆందోళన వ్యక్తమవుతుంటాయి. ఇవి కూడా నిద్రలేమికి దారితీస్తాయి.
* మెదడు ఎదుగుదల సరిగాలేని పిల్లలకు కూడా నిద్ర సరిగా రాదు. ఇలాంటి పిల్లలు హైపరాక్టివిటీ, అటెన్షన్‌ డెఫిసిట్‌ వంటి సమస్యలతో రాత్రివేళల్లో నిద్రపోరు.
* చాక్లెట్లు తినే అలవాటు ఎక్కువగా ఉండేవారిలో సైతం కెఫీన్‌ కారణంగా నిద్రపట్టని సమస్యలు కనిపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు పడుకునేముందు పాలల్లో చాక్లెట్‌ ఫ్లేవర్లు ఉండే డ్రింకుల్ని ఇస్తుంటారు. ఈ అలవాటు శ్రేయస్కరం కాదు.
* నిద్రలో మూత్రపోసుకోవటం కూడా నిద్రలేమికి ఒక కారణం. కాకపోతే.. ఇలాంటి అలవాటు వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోతుంది.
చికిత్స ఎలా?
తమ పిల్లలు నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నారంటూ తల్లిదండ్రులు వైద్యుల్ని సంప్రదించినప్పుడు.. పిల్లల నిద్ర అలవాట్లకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటారు. రాత్రివేళ మధ్యలో నిద్ర లేస్తున్నారా? స్కూల్లో మార్కులెలా వస్తున్నాయి? పగటి వేళల్లో నిద్రపోతున్నారా? అలర్జీలేమైనా ఉన్నాయా? ఏవైనా దీర్ఘకాలిక జబ్బులున్నాయా? మెదడు ఎదుగుదల ఎలా ఉంది? వంటివన్నీ పరిశీలిస్తారు. రాత్రివేళ నోరు తెరిచి పడుకుంటున్నారా? గురక శబ్దాలు వస్తున్నాయా? వంటివీ గమనించాలి. ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయనుకుంటే.. ఇవన్నీ కొద్దిరోజులు ఉండి తగ్గేవేనా, దీర్ఘకాలం వేధిస్తాయా? అనేది విశ్లేషిస్తారు. ఆయా కారణాలను బట్టి కౌన్సెలింగ్‌, జీవనశైలిలో చిన్నచిన్న మార్పుల ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా జబ్బులు ఉంటే వాటికి చికిత్స చేస్తే, చాలా వరకు నిద్ర సమస్యలు సర్దుకుంటాయి.
అమ్మకడుపు.. ఉయ్యాల
గర్భంతో ఉన్నప్పుడు తల్లి పగలంతా పనులు చేసుకుంటూ.. అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూఇటూ ­గుతూ.. హాయిగా ఉయ్యాల్లో ­గుతున్నట్టుండి.. కమ్మగా నిద్రపోతారు. అదే.. రాత్రివేళ తల్లి పడుకుని ఉంటుది కాబట్టి ఏ కదలికలూ లేకపోవటంతో రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇలా తొమ్మిది నెలల పాటు తల్లిగర్భంలో గడుపుతారు కాబట్టి.. ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు ఇదే పద్ధతి కొనసాగిస్తుంటారు. బిడ్డకు 3, 4 నెలలు వచ్చేసరికి పగలు, రాత్రి తేడాలను గుర్తించటం ఆరంభమై.. రాత్రి పడుకోవటం, పగలు ఆడుకోవటం మొదలుపెడతారు. కాబట్టి మొదటి 3, 4 నెలలూ రాత్రీపగలూ తేడా తెలీక శిశువులు ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ.. పడుకుంటూ ఉంటారని గుర్తించాలి. ఇది ప్రకృతి సహజం! ఈ సమయంలో శిశువుల ‘సర్కాడియన్‌ రిథమ్‌’ వేరేగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేస్కోవాలి. 4 నెలల తర్వాత ఈ పద్ధతిలో మార్పు వస్తుంది. ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. అంతేగానీ పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్పటికీ ఏదైనా అనుమానం ఉంటే వైద్యుల్ని సంప్రదించి.. బిడ్డలు సహజసిద్ధంగా హాయిగా నిద్రపోయేలా.. చక్కగా ఎదిగేలా చూడటమెలాగో తెలుసుకోవటం ఉత్తమం!
అమ్మానాన్న.. కొన్ని సూచనలు
* పిల్లలకు నిద్రవేళల్ని నిర్దేశించాలి. నిర్దిష్ట సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేయాలి. ఇలాంటివి ముందుగా ఆచరించాల్సింది తల్లిదండ్రులే. పిల్లల కోసమైనా పెద్దవాళ్లు వేళకు పడుకోవాలి, వేళకు లేవాలి. పెద్దలను చూసే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు.
* పిల్లల్ని స్కూలున్న రోజుల్లో ఎలాగైతే పొద్దునే లేపుతారో, సెలవు రోజుల్లో కూడా పొద్దున్నే లేపాలి.
* రాత్రి పడుకోవటానికి గంటముందు నుంచే వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు ఆడుకోవటం, ఉత్సాహంగా ఎగరటం వంటివేమీ చేయకుండా చూడాలి. పడుకునే గంటముందు నుంచీ టీవీలూ, కంప్యూట‌ర్‌ గేమ్‌లూ బంద్‌ చేయాలి. పడుకునేముందు తల్లిదండ్రులు పిల్లలతో ఆహ్లాదంగా గడపాలి. అలాచేస్తే నిద్ర సమస్యలు తలెత్తవు. భయంగొలిపే, థ్రిల్లర్‌ సినిమాలు చూసి పడుకుంటే అంతశ్చేతనలో అవే దృశ్యాలు మెదులుతూ ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదు.
* పిల్లల్ని ఖాళీ కడుపుతో పడుకోబెట్టొద్దు. భోజనం చేయగానే పడుకోనివ్వకుండా, గంటవ్యవధైనా ఉండాలి. ఒకవేళ పడుకునే ముందు ఆకలి వేస్తోందంటే తేలికైన చిరుతిళ్లు, పాలు ఇవ్వచ్చు. రాత్రిపూట కెఫీన్‌ ఉండే పదార్థాలేమీ ఇవ్వద్దు.
* పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తోటిపిల్లలతో ఆడుకునే అవకాశం కల్పించాలి. దీనివల్ల తోటివారితో అనుభూతుల్ని పంచుకునే, అనుబంధం పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఇదంతా మానసిక వ్యాయామం వంటిది, రాత్రికి హాయిగా నిద్ర పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని