బరువు తగ్గితే మేలు

సోరియాసిస్‌ ఒక పట్టాన మానేది కాదు. చర్మంపై తెల్లటి పొలుసులు, దురద వంటి వాటితో దీర్ఘకాలం వేధిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు సోరియాసిస్‌ లక్షణాలు...

Published : 17 Jan 2017 01:13 IST

సోరియాసిస్‌
బరువు తగ్గితే మేలు

సోరియాసిస్‌ ఒక పట్టాన మానేది కాదు. చర్మంపై తెల్లటి పొలుసులు, దురద వంటి వాటితో దీర్ఘకాలం వేధిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు సోరియాసిస్‌ లక్షణాలు ఉద్ధృతం కాకుండా చూసుకోవటం చాలా కీలకం. ఇందుకు బరువు తగ్గటం ఎంతో మేలు చేస్తుంది. దీంతో సోరియాసిస్‌ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు, రోజువారీ పనులను హాయిగా చేసుకోవటానికి తోడ్పడుతున్నట్టు తాజా డెన్మార్క్‌ అధ్యయనం సూచిస్తోంది. పైకి చర్మ సమస్యలాగా కనిపిస్తుంది గానీ సోరియాసిస్‌ ఒంట్లో వాపు ప్రక్రియతో ముడిపడింది. అందువల్ల ఇది అన్ని అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. అధిక బరువుతో గుండె, ఇతర అవయవాలపై ఒత్తిడి పడుతుంది. ఇది సోరియాసిస్‌ ఉద్ధృతం కావటానికీ దోహదం చేస్తుంది. బరువు పెరిగేలా చేసే ఆహార పదార్థాలు సైతం ఒంట్లో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయి. పైగా ఒత్తిడి బారినపడ్డప్పుడు ఎక్కువెక్కువగా తింటుంటారు. ఫలితంగా సోరియాసిస్‌ ఉద్ధృతమయ్యే అవకాశమూ ఉంది. దీనికి అధిక బరువు కూడా తోడైతే హైబీపీ, మధుమేహం, గుండెజబ్బుల వంటి వాటి ముప్పూ పొంచి ఉంటుంది. మిగతావారితో పోలిస్తే సోరియాసిస్‌ బాధితులు సగటున 7% ఎక్కువ బరువుంటారు కూడా. కాబట్టి ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం ద్వారా సోరియాసిస్‌ లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇతరత్రా జబ్బుల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాయామం చేయాలని ఉన్నా చాలామంది సోరియాసిస్‌ బాధితులకు వెనకడుగు వేస్తుంటారు. చర్మంపై పొలుసులు ఇతరులకు కనబడతాయేమోనని జంకుతుంటారు. అంతేకాదు ఆటలు ఆడుతున్నప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో చర్మంపై ఏదైనా గీసుకుపోయినా పొలుసుల సమస్య ఉద్ధృతమయ్యే అవకాశముంది. అలాగే చెమట, చర్మం ముడతల రాపిడి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వ్యాయామం, శారీరకశ్రమ ఎక్కువగా చేస్తే కీళ్ల నొప్పులు తలెత్తే అవకాశముంది. అయితే వ్యాయామానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులను చాలావరకు తొలగించుకోవచ్చు.

* వ్యాయామం చేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించాలి. దీంతో చర్మంపై రాపిడి తలెత్తకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మాన్ని రుద్దటం, నలపటం చేయకూడదు.

* గజ్జల్లో, చంకల్లో, రొమ్ముల కింద చర్మం ముడతలు అంటుకొని, రాసుకోకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవాలి.

* చెమటను పీల్చుకునే పౌడరు కూడా చల్లుకోవచ్చు.

* వ్యాయామంతో సోరియాసిస్‌ లక్షణాలు ఎక్కువవుతున్నట్టు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ సూచించిన పైపూత మందు రాసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని