moral story: భీమయ్య ఎలా మారాడు..?

రాఘవాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. విత్తనాలు కొనాలని పొరుగూరు బయలుదేరాడు. దారిలో ఒక పిల్లాడు పరుగెత్తుకుంటూ వచ్చి, రామయ్య కాలుకు అడ్డుపడటంతో.. కింద పడిపోయాడు.

Published : 12 Jun 2024 00:44 IST

రాఘవాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. విత్తనాలు కొనాలని పొరుగూరు బయలుదేరాడు. దారిలో ఒక పిల్లాడు పరుగెత్తుకుంటూ వచ్చి, రామయ్య కాలుకు అడ్డుపడటంతో.. కింద పడిపోయాడు. దాంతో చేతిలో ఉన్న సంచి పక్కకు పడిపోయింది. అందులో ఉన్న డబ్బుల మూట కూడా కింద పడిపోయింది. అది గమనించని రామయ్య.. సంచి తీసుకొని వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక.. సంచిలో పెట్టిన అరటిపండ్లు తినడానికని అందులో చూస్తే, డబ్బుల మూట కనిపించలేదు. కంగారు పడిన రామయ్య.. వెంటనే వెనుదిరిగి దాని కోసం వెతకసాగాడు. అప్పుడే భీమయ్య అతనికి ఎదురుగా వచ్చాడు. తను మోసగాడు.. మాయ మాటలతో జనాలను మోసగించి డబ్బులు కాజేస్తుంటాడు. రామయ్య కంగారుగా కనిపించడంతో.. ‘ఏంటి ఏదో వెతుకుతున్నట్లున్నావు?’ అని అడిగాడు. విషయం వివరించాడు రామయ్య. ‘అయ్యో! అవునా.. పద నీతో పాటు నేను కూడా వెతుకుతాను’ అంటూ భీమయ్య కూడా దారిలో వెతకసాగాడు. కాసేపటికి అతనికి ఒక చోట మూట కనిపించింది. వెంటనే రామయ్య దగ్గరకు వెళ్లి.. నువ్వు చాలా అలసిపోయావు. ఆ చెట్టు నీడలో కూర్చో.. నేను వెతుకుతాను. కనిపిస్తే తీసుకొచ్చిస్తాను’ అని మాయ మాటలు చెప్పి అతన్ని చెట్టు దగ్గరకు పంపించాడు. తర్వాత.. ఆ మూటలో నుంచి కొంత డబ్బు దొంగిలించి, మిగతాది అందులోనే ఉంచి.. దాన్ని తీసుకెళ్లి రామయ్యకు ఇచ్చాడు.
అతను సంతోషించి.. ‘నా మూట వెతికి పెట్టినందుకు.. ధన్యవాదాలు భీమయ్యా! మా ఇల్లు ఇక్కడే దగ్గర్లోనే ఉంది. మీకు వీలైనప్పుడు తప్పకుండా రండి’ అన్నాడు. దానికి అలాగేనంటూ బదులిచ్చాడు భీమయ్య. తర్వాత అక్కడి నుంచి సంతకు వెళ్లిపోయాడు రామయ్య. ఇక భీమయ్య.. దొంగిలించిన సొమ్ముతో కొట్టుకు వెళ్లి.. బియ్యంతో పాటు కావలసిన వస్తువులు కొనుక్కొని ఇంటికి చేరుకున్నాడు. అతను తీసుకొచ్చిన సరకు చూసి.. ‘ఇవన్నీ నిజంగా మీ కష్టార్జితంతోనే కొనుక్కొచ్చారా?’ అని సందేహంగా అడిగింది భార్య చంద్రమ్మ. ‘అలా అడుగుతావేంటి? నేను కష్టపడ్డ సొమ్ముతోనే తెచ్చాను’ అని తడబడుతూ సమాధానమిచ్చాడు భీమయ్య. 
కాసేపటికి చంద్రమ్మ వంట పూర్తి చేసి.. కొడుకు శీనయ్యకు అన్నం తినిపిస్తోంది. ఆ అబ్బాయి తింటూ.. ‘అమ్మ అన్నం ఎలా తయారవుతుంది?’ అని అడిగాడు. ‘రైతన్న భూమిని చదును చేసి.. వడ్లు కొని నారు పోసి, వాటిని పొలంలో నాటుతాడు. సకాలంలో వర్షాలు పడి ప్రకృతి సహకరిస్తే కొన్ని నెలలకు వరి పంట చేతికి వస్తుంది. దాన్ని రోకళ్లతో దంచి బియ్యంగా చేసి అమ్ముతారు’ అని వివరించింది చంద్రమ్మ. ఆ మాటలు విన్న శీనయ్య.. ‘అమ్మో! అన్నం వెనక ఇంత కథ ఉందా అమ్మా!’ అన్నాడు. ‘అవును నాన్నా.. అందుకే మనం అన్నాన్ని వృథా చేయకూడదు. రైతులు చాలా కష్టపడి పంట పండిస్తారు. విత్తనాల విషయంలో కూడా ఎన్నో మోసాలను ఎదుర్కుంటారు. వారే లేకపోతే.. మనకు తినడానికి ఆహారమే ఉండేది కాదు. అందుకే మనం ఎప్పుడూ రైతులను గౌరవించాలి’ అని చెప్పింది చంద్రమ్మ. 
అక్కడే ఉండి, ఇదంతా వింటున్న భీమయ్యకు.. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. రైతు రామయ్యను మోసం చేయడం తప్పు అనిపించింది. వెంటనే అతని ఇంటికి బయలుదేరాడు భీమయ్య. అతన్ని చూసిన రామయ్య.. ‘ఏంటి భీమయ్యా.. ఈ సమయంలో వచ్చావు?’ అని అడిగాడు. ‘పొద్దున ధనం మూట దొరికినప్పుడు నీకు తెలియకుండా అందులో నుంచి కొంత ధనం దొగిలించాను. నన్ను క్షమించు’ అన్నాడు భీమయ్య. ‘నీకు అవసరమయ్యి కొంత డబ్బు తీసుకున్నావు. మొత్తం డబ్బు దోచుకుని ఉంటే నేనేం చేసేవాడిని? ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు కదా! మరోసారి ఇలాంటి పనులు చేయకు’ అని చెప్పాడు రామయ్య. ఆ మాటలకు భీమయ్య కళ్లు చెమ్మగిల్లాయి. ‘రేపటి నుంచి కష్టపడి పని చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. నీ డబ్బులు కూడా కొంత కాలంలో తిరిగి ఇచ్చేస్తాను’ అన్నాడు భీమయ్య. ‘నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కానీ నీలో మార్పు వచ్చింది.. అది చాలు. మనం నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకో’ అన్నాడు రామయ్య. ఇక ఆ రోజు నుంచి భీమయ్య తన ప్రవర్తన మార్చుకొని కష్టపడి పని చేసుకోసాగాడు. 

యు.విజయశేఖర రెడ్డి  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని