మృగరాజు తిక్క కుదిరింది!

మహేంద్రగిరి అడవికి సందేహి అనే సింహం రాజుగా ఉండేది. విశిష్ట అనే కుందేలు మంత్రి. పేరుకు తగ్గట్టుగానే.. మృగరాజుకు తిక్క తిక్క సందేహాలు వస్తూ ఉండేవి.

Updated : 18 Feb 2024 06:40 IST

మహేంద్రగిరి అడవికి సందేహి అనే సింహం రాజుగా ఉండేది. విశిష్ట అనే కుందేలు మంత్రి. పేరుకు తగ్గట్టుగానే.. మృగరాజుకు తిక్క తిక్క సందేహాలు వస్తూ ఉండేవి. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం తరచూ సమావేశాలు ఏర్పాటు చేసేది. అవి మృగరాజు పాలనకు సంబంధం లేకుండా ఉండేవి. ఒకరోజు దానికి ఏదో సందేహం రావడంతో అడవిలోని జీవులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని జంతువులు వచ్చిన తర్వాత.. ‘నా గుహ ఎదురుగా ఉన్న మామిడి చెట్టుకు ఎన్ని పత్రాలు ఉన్నాయో చెప్పగలరా’ అని అడిగింది. అన్నీ ఒక్కసారిగా.. మంత్రి విశిష్ట వైపు చూశాయి. అది వాటి పరిస్థితి అర్థం చేసుకొని.. ‘మృగరాజా! మన గుహ దగ్గర ఉన్న ఆ చెట్టుకు ఒకటి తక్కువ అయిదు వేల పత్రాలు ఉన్నాయి’ అని చెప్పింది. ఆ మాటలు విన్న మృగరాజు మంత్రి వైపు చూసి.. ‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు. నువ్వు ఏమైనా లెక్కించావా?’ అని ప్రశ్నించింది. ‘ప్రతిరోజూ అదే మార్గంలో వస్తున్నాను కదా! అలా చెట్టు దగ్గర నిలబడి ఒకసారి లెక్కించాను. నాకు ఆ సంఖ్య వచ్చింది. మీకు సందేహం ఉంటే.. ఇంకా ఎవరినైనా లెక్కించమని చెప్పండి’ అని బదులిచ్చింది మంత్రి. సమావేశానికి వచ్చిన ఒక కోతిని పిలిచి.. ‘మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి పత్రాలు లెక్కపెట్టి, మంత్రి చెప్పిన సంఖ్య సరిపోయిందా లేదా చెప్పు’ అని ఆదేశించింది మృగరాజు. చెప్పినట్లుగానే కోతి మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి, లెక్కించి.. మంత్రి విశిష్ట చెప్పిన లెక్క సరిపోయిందని తెలిపింది. సందేహం తీరినందుకు సంతోషంతో సమావేశాన్ని ముగించిందా మృగరాజు. జంతువులన్నీ వెళ్లిపోయాక మంత్రి.. ‘మృగరాజా! మీరు అనవసరమైన సందేహాలతో మీ సమయాన్ని, జంతువుల సమయాన్ని వృథా చేస్తున్నారు. అవన్నీ వదిలేసి.. అడవి జీవులకు ఉపయోగపడే విధంగా పాలన చేయండి’ అని సింహానికి చెప్పింది. ‘నేను ఈ అడవికి రాజుని. నాకు వచ్చే సందేహాలు తీర్చడం మీ అందరి బాధ్యత. నిన్న రాత్రి మరో సందేహం వచ్చింది. దాన్ని నివృత్తి చేసుకోవాలి.. దానికి సరిగ్గా సమాధానం చెప్పిన వారికి చక్కని కానుకలు కూడా ఇస్తాను. వెంటనే ఈ విషయం అడవిలోని జంతువులకు తెలియజేయి’ అని మంత్రిని ఆదేశించింది. విషయం తెలుసుకున్న అన్ని జీవులు సమావేశానికి హాజరయ్యాయి. కానీ.. ఈసారి మృగరాజుకు ఎలాంటి తిక్క సందేహం వస్తుందోనని అన్నీ అనుకోసాగాయి. మృగరాజు మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నా సందేహం తీర్చిన వాళ్లు ఏ బహుమతి కోరినా కాదనకుండా ఇచ్చేస్తాను’ అంది. కానీ దానికి ఎలాంటి చిక్కు సందేహం వస్తుందోనని ఏ ఒక్క జీవి కూడా ముందుకు రాలేదు. దాంతో మంత్రి.. ‘మృగరాజా! అనుమతిస్తే మీకు వచ్చిన సందేహం నేను తీర్చుతాను. అందుకు నాకు నచ్చిన జంతువు సహకారం తీసుకుంటాను’ అంది. దానికి సరేనంటూ బదులిచ్చిన మృగరాజు.. ‘నేను మొన్న రాత్రి నిద్రపోయేటప్పుడు ఆకాశం వైపు చూశాను. చాలా నక్షత్రాలు కనిపించాయి. వాటి సంఖ్య ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఉంది’ అని దాని సందేహాన్ని తెలిపింది. ఆశ్చర్యపోయిన జంతువులన్నీ.. ‘ఇది జవాబు లేని సందేహం. ఆకాశంలోని నక్షత్రాలు లెక్కించడం సాధ్యమవుతుందా?’ అన్నాయి. మంత్రి మాట్లాడుతూ.. ‘మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. దాని కోసం నేను కోతి సాయం తీసుకుంటాను. అంత వరకు మీరు మరో కొత్త సందేహం మా ముందు పెట్టకూడదు’ అని మృగరాజుతో అంది. అలాగేనంటూ బదులిచ్చింది సింహం.

అలా చాలా రోజులు గడిచిపోయాయి. మృగరాజు విశిష్టను పిలిచి.. ‘ఇంకా ఎన్ని రోజుల సమయం కావాలి. ఇప్పటికే నెలలు గడిచిపోయాయి. ఎప్పుడు సమాధానం చెబుతావు?’ అని ప్రశ్నించింది. దానికి.. ‘నేను, కోతి అదే పనిలో ఉన్నాం మృగరాజా!’ అని చెప్పిందా మంత్రి. ఇన్ని రోజులు మరో కొత్త సందేహానికి సమావేశం లేకపోవడంతో అడవిలోని జంతువులు కూడా ఆనందంగా తమ పనుల్లో తాము ఉండసాగాయి. వారం గడిచిన తర్వాత మృగరాజు అనుమతితో సమావేశం ఏర్పాటు చేసింది మంత్రి. ఎప్పటిలాగే అడవిలోని జీవులన్నీ హాజరయ్యాయి. ‘సందేహం తీర్చడానికి చాలా రోజులు పట్టింది. అందరూ క్షమించండి’ అంది మంత్రి. అంతలోనే కోతి ఒక బస్తా తెచ్చి మృగరాజు ముందు పెట్టింది. ‘ఈ కోతి సహాయంతో చాలా రోజులు కష్టపడి నక్షత్రాలు లెక్కించాను. ఈ బస్తాలో ఉన్న ఒక్కో ఇసుక రేణువు ఒక్కో నక్షత్రంతో సమానం. మా జవాబు మీద సందేహం ఉంటే.. ఆ ఇసుక రేణువులను మీరు ఒకసారి లెక్కించండి’ అంది విశిష్ట.

అప్పుడు ఏం చేయాలో అర్థం కాని మృగరాజు.. ‘నా సందేహం తీరింది. నీకు ఏ బహుమతి కావాలో అడుగు’ అంది. ‘ఇక నుంచి అడవికి ఉపయోగం లేని సందేహాల కోసం సమావేశాలు ఏర్పాటు చేయవద్దు మృగరాజా! అదే నాకు మీరు ఇచ్చే బహుమతి’ అని కోరింది విశిష్ట. చేసేదేం లేక అలాగేనంటూ జవాబిచ్చింది మృగరాజు. దాంతో అడవి జంతువులన్నీ మంత్రిని అభినందించాయి.  
- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని