తోలు తెచ్చిన తంటా!

అసలే అది చలికాలం. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తోంది. మరోవైపు శీతల గాలులతో చలి విపరీతంగా వేస్తోంది. పగలు మాత్రం గుంపులు గుంపులుగా అడవిలో తిరిగే జంతువులు కూడా రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టడం లేదు.  

Published : 03 Nov 2022 00:09 IST

సలే అది చలికాలం. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తోంది. మరోవైపు శీతల గాలులతో చలి విపరీతంగా వేస్తోంది. పగలు మాత్రం గుంపులు గుంపులుగా అడవిలో తిరిగే జంతువులు కూడా రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టడం లేదు. 

ఇప్పుడు ఆకలిగొట్టు నక్కకు చలికాలం ఇబ్బంది తెచ్చిపెట్టింది. కాపు కాసి వేటాడదామంటే చలితో వణికిపోవాల్సి వస్తోంది. అలా అని ఆకలిని తట్టుకోలేక పోతోంది. తన సమస్యకు పరిష్కారం ఆలోచించి ఎత్తు వేసింది. దానిలో భాగంగా మృగరాజు దగ్గరకు వెళ్లింది. అప్పటికే మృగరాజు గుహలో వెచ్చదనం కోసం గొర్రె చర్మాలను కప్పుకొని ఉంది.

‘జయం, జయం మృగరాజా!’ అంటూ దర్శనం చేసుకుంది నక్క. ‘ఇలా వచ్చావు, ఏమిటి సంగతి?’ అడిగింది మృగరాజు. ‘మృగరాజా! మీ పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తోంది’ అని పొగిడింది నక్క. పొగడ్త పరమాన్నంతో సమానం కాబట్టి, మృగరాజు చెవులకు ఇంపుగా వినిపించింది. ‘ఎలా చెప్పగలిగావు?’ నవ్వుకుంటూ అడిగింది. ‘వర్షాకాలం వానలు కురిశాయి. ఇప్పుడు చలి కూడా మిమ్మల్ని ప్రసన్నం చేసుకోడానికి ప్రతిరోజూ మీ గుహ ముందు మోకరిల్లుతోంది. మీరు భగవంతుడి ప్రతిరూపం’ అంటూ ప్రకృతి ధర్మాన్ని అతిశయోక్తులతో రుజువుగా చూపించింది నక్క.

సింహం పరమానంద భరితమైంది. రాజసంగా నక్క వైపు చూసి ‘ఇప్పుడు బయటకు వచ్చి చలిని పలకరించే స్థితిలో లేను. తరువాత కలవమని చెప్పు’ అంటూ డాంబికాన్ని ప్రదర్శించింది. ‘నిజమే.. మీలాంటి వారి దర్శనం పూర్వజన్మ సుకృతం. చలి అంత పుణ్యం చేసుకుందో లేదో. మీ మాటలు చెప్పడానికి బయటకు వెళ్లాలంటే, నాలాంటి అల్పుడిపై ఆ చలి ప్రతాపం చూపిస్తుందేమోనని భయంగా ఉంది. మీ దగ్గరున్న ఒక గొర్రె చర్మం నాకు ఇస్తే అది కప్పుకొని మీ ప్రతినిధిగా మీ సందేశాన్ని వినిపిస్తా’ వినయంగా చెప్పింది నక్క.

నక్క మాటలకు బుట్టలో పడిన సింహం.. తన దగ్గర ఉన్న ఒక గొర్రె చర్మాన్ని దానికి అందజేసింది. ‘మహాప్రసాదం!’ అంటూ తీసుకొని నక్క ఉప్పొంగి పోయింది. ఆ చర్మాన్ని ధరించి బయటకు వచ్చింది. బయట చల్లగా ఉన్నా తన శరీరానికి వెచ్చదనపు హాయి ఇచ్చిన తోలును మెచ్చుకోలుగా చూసుకుంది. ఇప్పుడు శరీరానికి చలి తగ్గడంతో ఆకలి వైపు దృష్టి మరలింది. మాటు వేసే ఉద్దేశంతో అడుగులు వేయసాగింది. కొంతదూరంలో పొదల దగ్గర కుందేళ్లు వేలాడుతున్న చిక్కుడు కాయలను ఎగిరెగిరి అందుకుని తింటూ కనిపించాయి. నక్క తన పంట పండిందనుకుంది. నక్క రాకను గమనించి కూడా అవి అదరలేదు బెదరలేదు.

నక్క ఆశ్చర్యపోయింది. అంతా తాను కప్పుకున్న తోలు మహిమేనని గుర్తించి నవ్వుకుంది. ‘ఇక నుంచి ఈ తోలు కప్పుకొని శాకాహార జంతువుల దగ్గరకు వెళ్తే పొట్టేలు అనుకుని తన నోటికి సులభంగా చిక్కుపోతాయి..’ అని ఊహించుకుంటూ సంబరపడిపోయింది. ఇప్పుడు కుందేళ్లను పట్టుకోవడానికి పొట్టేలులా నడవడం ప్రారంభించింది.

దూరం నుంచి వస్తున్న పులికి, పొట్టేలు రూపంలో ఉన్న నక్క కనిపించింది. పులి నోట్లో నీళ్లూరాయి. ఒక్క ఉదుటున పరుగుపెట్టి వెంబడించింది. శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూసింది నక్క. పులి వేగంగా రావడం చూసి అవాక్కైంది. తన ఎత్తు బెడిసి కొట్టడంతో పొట్టేలు చర్మం నుంచి బయటపడింది. దగ్గరగా వచ్చిన పులి నక్కను చూసి ‘నువ్వా? పొట్టేలు అనుకుని భ్రమపడ్డాను’ అనుకుంటూ వెళ్లిపోయింది. ఆ అలికిడికి కుందేళ్లు పొదల్లోకి పారిపోయాయి. ‘ఎంత ప్రమాదం తప్పింది. పొట్టేలు తోలు వల్ల ఈ అడవిలో లాభం ఎంత ఉందో.. నష్టం కూడా అంతే ఉంది’ అనుకుంది నక్క. వెంటనే దాని బుర్రలో మరో ఆలోచన మెదిలింది.

పొట్టేలు తోలును నోట కరుచుకుని దగ్గర ఉన్న గ్రామం వైపు పరుగు పెట్టింది. అప్పటికే తెల్లారింది. దూరం నుంచి పొట్టేళ్ల మందను చూసింది. ఇప్పుడు పొట్టేలు తోలును కప్పుకుంది. తెలివిగా ఆ మందలో కలిసిపోయింది. పిల్లపొట్టేలు ఏ ఒక్కటి దొరికినా నోట కరుచుకుని పోవడానికి వెతుకులాట ప్రారంభించింది. మందలో కొన్ని పొట్టేళ్లు, తిన్న తిండి నెమరు వేసుకుంటూ బుర్రలతో ఢీ కొట్టుకుంటూ అటు వచ్చాయి. వాటి దృష్టిలో తోలు కప్పుకొన్న నక్క పడింది. అవి తోటి పొట్టేలు అనుకొని ఢీ కొట్టడం ప్రారంభించాయి. నక్క బుర్ర బొప్పి కట్టింది. ఇంకా ఉంటే ప్రాణానికే ప్రమాదమని తోక ముడిచి పరుగు పెట్టింది. చలికి కప్పుకొనే తోలును వెచ్చదనం కోసం వాడుకోవాలి కానీ, దురాశతో ఇలా ప్రవర్తిస్తే ఇటువంటి పరాభవాలే ఎదురవుతాయని తెలుసుకున్న నక్క తోలును తన నివాసానికి తీసుకుపోయి జాగ్రత్తగా దాచుకుంది. అప్పటి నుంచి నివాసంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వినియోగించడం ప్రారంభించింది.   

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని