చుర్ర్‌... చుర్ర్‌.. కోతి!

అడవిలోని ఒక కోతి ‘చుర్ర్‌.... చుర్ర్‌’ అంటూ పరిగెత్తసాగింది. దాన్ని చూసిన ఒక ఏనుగు కోతితో... ‘ఏమైంది కోతి బావా! అలా చుర్ర్‌... చుర్ర్‌... అంటూ పరిగెత్తుతున్నావే! అసలు సంగతి ఏంటో చెప్పు?’ అని అడిగింది.

Updated : 29 Nov 2022 05:52 IST

డవిలోని ఒక కోతి ‘చుర్ర్‌.... చుర్ర్‌’ అంటూ పరిగెత్తసాగింది. దాన్ని చూసిన ఒక ఏనుగు కోతితో... ‘ఏమైంది కోతి బావా! అలా చుర్ర్‌... చుర్ర్‌... అంటూ పరిగెత్తుతున్నావే! అసలు సంగతి ఏంటో చెప్పు?’ అని అడిగింది. కోతి దాంతో మాట్లాడకుండా మళ్లీ.. ‘చుర్ర్‌... చుర్ర్‌...’ అని అంటూ దాన్ని రమ్మని సైగ చేస్తూ పరిగెత్తసాగింది. ఆ సైగను చూసి భయపడిన ఏనుగు కూడా...  ‘చుర్ర్‌... చుర్ర్‌...’ అని అంటూ పరిగెత్తసాగింది.

ఆ రెంటిని చూసిన జింక.. ‘ఏమైంది కోతి బావా! ఏనుగు మామా! మీరు ఎందుకలా పరుగు తీస్తున్నారు?’ అని అడిగింది. అవి రెండూ దాన్ని ‘చుర్ర్‌... చుర్ర్‌..’ అంటూ రమ్మని సైగ చేస్తూ పరిగెత్తాయి. ‘ఏదో భయంకరమైన ఆపద వచ్చినట్టుంది’ అని అనుకున్న జింక కూడా ‘చుర్ర్‌....చుర్ర్‌....’ అని అంటూ వాటి వెంబడి పరిగెత్తింది.

ఈ మూడింటికి నక్క ఒకటి ఎదురైంది. అది పరిగెత్తుతున్న వాటితో... ‘ఏమైంది కోతి బావ? ఏనుగు మామా! జింక పిల్లా! ఎందుకు మీరు అలా పరిగెత్తుతున్నారు’ అని ప్రశ్నించింది. ఆ మూడూ మాట్లాడకుండా రమ్మని సైగ చేస్తూ.. ‘చుర్ర్‌.... చుర్ర్‌....’ అంటూ పరిగెత్తాయి.

ఎంత ఆలోచించినా అవి ఎందుకలా అంటున్నాయో నక్కకు అర్థం కాలేదు. బహుశా ఏదో శత్రువు పొంచి ఉందనుకొని అది కూడా ‘చుర్ర్‌.. చుర్ర్‌...’ అంటూ పరిగెత్తింది. అవి పరిగెత్తడం చూసిన కుందేలు ఒకటి.. ‘ఏమైంది మీకు? ఎందుకలా పరిగెత్తుతున్నారు? ఏమన్నా పరుగు పందెమా! చెప్పండి. నేనూ పాల్గొంటాను’ అంది.

అవి ఏమీ చెప్పకుండా దాన్ని రమ్మని సైగ చేశాయి. ఆ కుందేలు కూడా భయపడి వాటి వెంట పరిగెత్తింది. దూరం నుంచి సింహం వాటిని చూసి ఆపి, ఏమైందని ప్రశ్నించింది. అవి ‘చుర్ర్‌... చుర్ర్‌...’ అంటూ సింహాన్ని కూడా వాటి వెంబడి రమ్మని సైగ చేశాయి. సింహానికి ఇది ఏమీ అర్థం కాలేదు. ‘ఆగండి. నేను రాను. మీకు ఎవరు శత్రువో చెప్పండి. దాని అంతు తేలుస్తాను’ అంది సింహం.

అవి ‘చుర్రు.. చుర్రు..’ అని అనడం తప్ప మరేమీ మాట్లాడటం లేదు. వెంటనే సింహం వాటిని ఆపి, కూర్చోబెట్టి అక్కడే ఉన్న ఎలుగుబంటిని అడగమంది. అప్పుడు ఎలుగుబంటి ముందుగా కుందేలును ఏమైందని ప్రశ్నించింది. ‘నాకేం తెలియదు. ఇది చుర్ర్‌.. ...చుర్ర్‌.. అంటుంటే ఏదో శత్రువు వస్తుందనుకొని, నేను కూడా భయపడి వాటి వెంబడి.. చుర్ర్‌.... చుర్ర్‌... అంటూ పరిగెత్తాను’ అంది. ఆ తర్వాత ఎలుగుబంటి ఆ నక్కను ప్రశ్నించింది. అది కూడా... ‘ఇవి చుర్ర్‌.... చుర్ర్‌... అంటూ పరిగెత్తితే నేను కూడా అదేదో భూతం అనుకొని పరిగెత్తాను’ అంది.

ఆ తర్వాత అది జింకను ప్రశ్నించింది. ఆ జింక ఎలుగుబంటితో... ‘ఇవి ఆగకుండా, నాకన్నా ఎక్కువ పరిగెత్తేసరికి ఏదో ఆపద వచ్చిందని భావించి నేను కూడా వీటి వెంబడి పరిగెత్తాను’ అని అంది. ఆ తర్వాత ఎలుగుబంటి ఏనుగును ప్రశ్నించింది. అప్పుడు ఏనుగు... ‘నాకూ తెలియదు. ఈ కోతిని అడిగితే ఇది ఆగకుండా, ఏమీ జవాబు చెప్పకుండా నన్ను రమ్మని సైగ చేస్తూ పరిగెత్తింది. అందుకే నేను కూడా దాని వెంబడి పరిగెత్తాను’ అంది. ఆ తర్వాత ఎలుగుబంటి, కోతిని ప్రశ్నించింది.

ఆ కోతి.. ‘చుర్ర్‌... చుర్ర్‌..’ అని అరుస్తూ, కొంచెం మంచినీరు ఇవ్వమని సైగ చేసింది. ఆ ఎలుగుబంటి వెంటనే దానికి మంచినీరు ఇచ్చింది. ఆ కోతి మంచినీటిని తాగి.. ‘హమ్మయ్యా! మృగరాజా! నేను ఆకలి వల్ల అక్కడి తోటలో ఎర్రగా ఉన్న పండ్లు, ఆకు పచ్చగా ఉన్న కాయల్ని తిన్నాను. అవి చాలా ఘాటుగా, కారంగా ఉన్నాయి. అందువల్ల చుర్ర్‌.. చుర్ర్‌.. అని నాకు మంటలేసి, ఈ అడవికి వచ్చి నీటి కోసం తిరిగాను. నాకు ఎక్కడా దొరకలేదు. అందువల్ల మాట్లాడలేక ఇతర జంతువులకు నాకు నీరు దొరకడం లేదని సైగ చేశాను. వాటిని రమ్మని, ఆ నీటిని చూపించమని నేను.. చుర్ర్‌.. చుర్ర్‌.. అని సైగ చేశానంతే! అవి నాకు నీటి జాడను చూపిస్తాయని, అందుకే నా వెంబడి వస్తున్నాయని నేను అనుకున్నాను’ అంది.

అప్పుడు మృగరాజు నవ్వి.. ‘ఛీ ఛీ.. నీ కోతి బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. తోటలో ఏవి కనబడితే అవి తినవచ్చా! అవి విషపు పండ్లో, కాయలో, మంచి పండ్లో, కాయలో తెలుసుకోవద్దా! వాటిని దొంగతనంగా తినడం నీ తప్పు. అవి మిరప పండ్లు, కాయలు.. మొత్తానికి అవి తిని అన్ని జంతువులను భయపెట్టి హడావుడి చేశావు. ఆ నీరు కావాలని నువ్వు నోటితో అడగవచ్చు కదా!’ అంది.

అప్పుడు కోతి.. ‘మృగరాజా! ఆ మిరప పండ్ల ఘాటు, కారం వల్ల మాట్లాడలేకపోయాను. అందువల్లనే నేను చెప్పలేదు. అయినా మన అడవిలో నీటి గుంతలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చేది వేసవికాలం. దయచేసి మీరు నీటిగుంతల్లో నీరు నిలువ ఉండేటట్లు అడవిదున్నలు, పంది కొక్కులు మొదలైన వాటితో అన్ని చోట్ల వెంటనే తవ్వించండి. అప్పుడు ఎక్కువ చోట్ల నీరు నిల్వ ఉండి మా అందరి దప్పిక తీరుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో కొన్ని పండ్ల విత్తనాలు చల్లించండి. అప్పుడు మాకు ఆహార కొరత ఉండదు. మేము గ్రామాలకు ఆహారం కోసం వెళ్లే పని ఉండదు. ఈ చుర్ర్‌.. చుర్ర్‌ బాధ కూడా ఉండదు’ అని అంది. అందుకు సింహంతో పాటు అన్నీ నవ్వాయి. సింహం దాని మాటలకు సరేనంది.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని