మనసు మార్చుకున్న రాజు!

అవంతీపురం, పార్వతీపురం ఇరుగుపొరుగు రాజ్యాలు. అవంతీపురం రాజుకి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. ఇప్పటికే చాలావరకూ చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించాడు.

Updated : 07 Jan 2023 05:13 IST

వంతీపురం, పార్వతీపురం ఇరుగుపొరుగు రాజ్యాలు. అవంతీపురం రాజుకి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. ఇప్పటికే చాలావరకూ చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించాడు. ఇప్పుడు తన కన్ను పక్కనే ఉన్న పార్వతీపురం రాజ్యంపైన పడింది. వేగుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు పార్వతీపురం రాజు. దాంతో అప్పటి నుంచి రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ రాబోయే విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కాసాగాడు. యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న తరుణంలో ప్రజలు కూడా దేశభక్తిని చాటుకుంటూ రాజుకి అండగా నిలబడ్డారు. గురుకులాల్లో విద్యార్థులకు మనోధైర్యాన్ని పెంపొందించే అంశాలను ప్రత్యేకంగా బోధించాలని ఆదేశాలను జారీ చేశాడు.

పార్వతీపురం రాజ్య శివారు ప్రాంతంలో విద్యాధరుడి గురుకులం ఉంది. ఒకరోజు ఇద్దరు బాటసారులు ఆ గురుకులానికి వెళ్లారు. ‘విద్యాలయాలంటే దేవాలయాలని మా నమ్మకం. దారిలో మీ గురుకులం కనిపించడంతో ఓసారి సందర్శించి వెళ్దామని వచ్చాం’ అని విద్యాధరుడితో వారు చెప్పారు. ‘మీ మంచి మనసుకు ధన్యవాదాలు. ఇది విద్యార్థులకు ఆటవిడుపు సమయం. ఇందులో తార్కిక ఆలోచనలకు పెద్దపీట వేస్తాం. ఆ ఆలోచనలు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని మా రాజుగారి నమ్మకం. అందుకే ప్రతి గురుకులంలో కొంత సమయం కేటాయించమని ఆదేశించారు. అభ్యంతరం లేకపోతే మీరూ ఇందులో పాల్గొనవచ్చు’ అంటూ వివరించాడు విద్యాధరుడు. వారు సరేనంటూ విద్యార్థుల దగ్గరకు వెళ్లారు.

విద్యార్థులు పొడుపు కథలు ప్రారంభించారు. బాటసారులిద్దరూ ఆసక్తిగా వినసాగారు. ఓ విద్యార్థి లేచి నిలబడి.. ‘తుపాకీ ఒకటి.. గొట్టాలు రెండు.. వానలో తడిస్తే, పేలును తూటాలు.. ఏమిటది?’ అంటూ పొడుపు కథ వేశాడు. మిగతా విద్యార్థులతోపాటు బాటసారులూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక పిల్లవాడు నేను సమాధానం చెబుతానంటూ లేచి.. ‘ముక్కు’ అని పొడుపు కథను విప్పాడు. ‘ఎలా?’ అని బాటసారుల్లో ఒకతను అడిగాడు. ‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. తుమ్ములే ఇక్కడ తూటాలు. వాటికి కారణం ముక్కు’ అంటూ వివరణ ఇచ్చాడు. ఆ జవాబుకు విద్యార్థులతోపాటు బాటసారులు కూడా చప్పట్లు కొట్టారు.

మరో విద్యార్థి లేచి ఇంకో పొడుపు కథకు శ్రీకారం చుట్టాడు. ‘తొండం ఉండును కానీ ఏనుగు కాదు.. రక్తం పీల్చును కానీ రాక్షసి కాదు.. ఇంట్లో తిరుగును కానీ మనిషి కాదు.. చీకటి పడితే రాగం తీయును.. సూదిపోటుగా ఒకటే గుచ్చును.. అప్రమత్తంగా లేకపోతే జ్వరం వచ్చును.. ఏమిటది?’ అని అడిగాడు. వెంటనే బాటసారుల్లో ఒకరు నేను చెబుతానంటూ ముందుకు వచ్చి.. ‘దోమ’ అంటూ సమాధానమిచ్చాడు. ‘నిజమే..’ అంటూ చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశాడు పొడుపు కథ చెప్పిన విద్యార్థి. ‘దోమ గురించి అంతలా వర్ణించావు. ఎలా తెలుసు?’ అంటూ కుతూహలంగా అడిగాడా బాటసారి. ‘మా గురుకులంలో దోమలకు కొదవే లేదు’ అంటూ నవ్వాడా విద్యార్థి. ‘అయితే.. ఈ రాజ్య రాజు గారు నాకు బాగా తెలుసు. మీ గురుకులంలో దోమల సమస్యను చెప్పమంటావా?’ అని అడిగాడు ఆ బాటసారి.

అప్పుడు విద్యాధరుడికి.. ఆ వచ్చిన బాటసారులు మారువేషాల్లో ఉన్న రాజప్రతినిధులేమోనన్న అనుమానం కలిగింది. ‘అయ్యా! పిల్లలు కదా కాస్త తొందరపడ్డారు. కొద్దికాలం క్రితం వరకు పరిసరాల శుభ్రతకు నిధులు కేటాయించి.. ప్రాధాన్యం ఇచ్చేవారు. యుద్ధమేఘాలు కమ్ముకురావడంతో ఆ నిధులన్నీ రక్షణ రంగం వైపు మరలుతున్నాయి. రాజుగారైనా ఏం చేయగలరు?’ అంటూ సర్ది చెప్పాడు విద్యాధరుడు. ‘పిల్లల మధ్య గడపడంతో చాలా సంతృప్తి కలిగింది. వారి సమస్య తొందరలోనే పరిష్కారం కావాలని కోరుకుందాం..’ అంటూ ఆ ఇద్దరు బాటసారులు వెళ్లిపోయారు. మర్నాడు పార్వతీపురం రాజు తన పరివారంతో గురుకులానికి వస్తున్నట్టు భటుల ద్వారా విద్యాధరుడికి కబురువచ్చింది. తన అనుమానం నిజమైందని అనుకున్నాడు.

సాయంత్రం వేళ పార్వతీపురం రాజు గురుకులానికి వచ్చాడు. నమస్కరిస్తూ రాజు వైపు పరిశీలనగా చూశాడు విద్యాధరుడు. ముందు రోజు బాటసారుల ముఖకవళికలు కాస్తయినా ఆయనలో కనిపించలేదు. ‘అయితే నిన్న వచ్చిందెవరు?’ అనే ఆలోచనలో పడ్డాడా గురువు. ‘గురువర్యా! నిన్న మారువేషాల్లో వచ్చింది అవంతీపురం రాజు, మంత్రి. ఏదైనా రాజ్యంపైన యుద్ధానికి ముందు అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం వారికి అలవాటు. అలాగే మన గురుకులానికీ వచ్చారు. మీ శిక్షణలో పిల్లలు వారి మనసు గెలిచారు. పరోక్షంగా నన్నూ గెలిపించారు. రాజ్యాన్ని జయించిన ఆనందం కంటే పిల్లల పొడుపు కథలే తమకు ఎక్కువ సంతోషం కలిగించాయని లేఖ ద్వారా తెలియజేశాడా రాజు. పిల్లల భవిష్యత్తుకు యుద్ధమే అడ్డంకిగా నిలిస్తే.. ఆ నిర్ణయాన్ని విరమించుకుంటాననీ, రక్షణ రంగానికి బదులుగా ఆ నిధులను మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఉపయోగించమని సూచన కూడా చేశాడు. అది కూడా ఈ గురుకులం నుంచే ప్రారంభించమనీ కోరాడు. అందుకే.. ఆ విషయం తెలిపి మిమ్మల్ని, పిల్లల్ని అభినందించేందుకు వచ్చాను’ అని వెనుదిరిగాడు పార్వతీపురం రాజు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని