గుణపాఠం!

అదొక అందమైన పూల తోట. ఆ తోటలో గులాబీ, మల్లె, చామంతి, సంపెంగ, సన్నజాజి తదితర మొక్కలు ఉన్నాయి. అవి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆ తోటకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి.

Published : 08 Jan 2023 00:16 IST

దొక అందమైన పూల తోట. ఆ తోటలో గులాబీ, మల్లె, చామంతి, సంపెంగ, సన్నజాజి తదితర మొక్కలు ఉన్నాయి. అవి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆ తోటకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి. వేసవి కాలం కావడంతో మల్లె చెట్టు విరగబూసింది. అది తోట పరిమళాన్ని ఇంకా పెంచుతోంది. కొమ్మ కొమ్మకూ ఉన్న తన తెల్లని చిట్టి పువ్వులను చూసుకుని మల్లె మురిసిపోసాగింది. తన చుట్టూ ఉన్న మొక్కలను ఒకటికి రెండుసార్లు గమనించింది. ఏ మొక్కకూ తన కంటే ఎక్కువ పువ్వులు లేవని గర్వపడింది. అదే గర్వంతో.. ‘ప్రకృతిలోని పచ్చదనానికి నా ఆకులే ప్రతీకలు.. పున్నమి జాబిలి వెన్నెలకు నా పువ్వులే ప్రత్యక్ష నిదర్శనాలు.. నన్ను, నా అందమైన పువ్వులను చూసి మీరంతా తెల్లబోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. గుబురుగా ఉండటంతోపాటు తుమ్మెదలకు కూడా గూడునిస్తాను. నా ముందు మీరెంత?’ అంటూ అహంకారాన్ని ప్రదర్శించింది.

మల్లె చెట్టు మాటలు విని తోటి మొక్కలన్నీ నివ్వెరపోయాయి. ‘మల్లెకు ఎందుకంత గర్వం?’ అంటూ మనసులోనే అనుకున్నాయి. గులాబీ మొక్క మాత్రం మల్లె మిడిసిపాటు చూసి గట్టిగా నవ్వింది. ‘ఓటమిని ఒప్పుకోని వారే అలా నవ్వుతారు.. అంతే కదూ!’ అంటూ అదే గర్వంతో గులాబీని అడిగింది మల్లె. ‘కాదు.. నీ చుట్టూ ఉన్న ముళ్లను చూసి నవ్వుతున్నా’ అంది గులాబీ. ‘నీ చుట్టూ ముళ్లున్నాయని.. నాకూ ఉన్నాయని అబద్ధం ఆడతావా?’ అంటూ కోపంతో గట్టిగా అడిగింది మల్లె. ‘కోపం వద్దు.. నా చుట్టూ ముళ్లున్నాయనడం నిజమే. కానీ నీ చుట్టూ రాకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నా’ అంది గులాబీ సమాధానంగా. ‘ఎందుకు వస్తాయి?’ అని ఒకింత ఆశ్చర్యపోతూ అడిగింది మల్లె. అలా అడిగావు కాబట్టి చెబుతున్నా.. జాగ్రత్తగా విను అంది. ‘నువ్వు ఈ తోటలోకి రాకముందు నేను కూడా నా పువ్వులు, వాటి ఎర్రటి రంగు చూసి నీలాగే మురిసిపోతూ.. గర్వించాను. నా గులాబీ పువ్వుల ముందు మీరెవరూ నిలబడలేరని ఇతర మొక్కలతో పొగరుగా మాట్లాడాను’ అని చెబుతూ గులాబీ ఒక్కసారిగా ఆగింది. ‘ఆ తరువాత ఏమైంది?’ అని ఆసక్తిగా అడిగింది మల్లె.

‘ఏముంది.. కన్నూమిన్నూ కానకుండా గర్వంగా ప్రవర్తిస్తున్న నాకు బుద్ధి చెప్పడానికి వనదేవత ప్రత్యక్షమైంది. వినయం మిత్రులను పెంచుతుందనీ, గర్వం బంధువులను కూడా దూరం చేస్తుందని చెప్పింది. అహంకారం ఎవరికైనా మంచిది కాదనీ, తోటి మొక్కల విలువను తగ్గిస్తూ మాట్లాడకూడదని హెచ్చరించింది’ అని వివరించింది. ‘నువ్వు తగ్గావా?’ అంటూ అంతే ఆసక్తిగా అడిగింది మల్లె. అప్పుడు గులాబీ మొక్క చిన్నగా నవ్వుతూ.. ‘లేదు.. మరింత గర్వంగా మాట్లాడాను. వనదేవత మాటలను పట్టించుకోలేదు’ అని చెప్పింది. ‘తర్వాత ఏం జరిగింది?’ అడిగింది మల్లె. ‘ఏ అందాన్ని చూసి మురిసిపోతున్నావో.. అక్కడే నువ్వు బాధ పడేలా చేస్తానంటూ నా చుట్టూ ముళ్లు రప్పించిందా వనదేవత. అప్పటికి నా తప్పేంటో నాకు తెలిసింది.. కానీ, ఏం లాభం? ఎప్పటికీ నాకు ఈ ముళ్లు తప్పవు. నీ చుట్టూ ముళ్లు ఉన్నాయనడం సరైనదేనని ఇప్పటికైనా ఒప్పుకొంటావా?’ అంటూ మల్లెను అడిగింది గులాబీ. ఆ మాటలతో మల్లె చెట్టు ఆలోచనలో పడింది. ‘నాకు జ్ఞానోదయమైంది. ఇంకెప్పుడూ గర్వంగా ప్రవర్తించను’ అంటూ తోటలోని ఇతర మొక్కలకు క్షమాపణలు చెప్పింది మల్లె.

కాసేపటికి.. ‘నువ్వు చెప్పింది నిజమేనా?’ అని గులాబీని సందేహంగా అడిగింది చామంతి. ‘నా చుట్టూ ముళ్లు ఉండటం ప్రకృతి ధర్మం. కానీ, నేను చెప్పింది మాత్రం నిజం కాదు. మల్లెకు గుణపాఠం చెప్పాలని అల్లిన కట్టుకథ అది. ఎలాగైతేనేం, నా ఉపాయం ఫలించింది’ అంటూ నవ్వింది గులాబీ. బదులుగా చామంతి కూడా నవ్వింది.

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని