ఉడుతా ఉడుతా ఊచ్‌... చెప్పేదంతా తూచ్‌!

పచ్చని గొడుగు విచ్చుకున్నట్లు విశాలంగా ఉన్న చింత చెట్టుపైన రకరకాల పక్షులు, ఉడుతలు జీవనం సాగిస్తున్నాయి. పక్షులు పంటపొలాల నుంచి ధాన్యపుగింజల్ని తెచ్చి పిల్లలకు తినిపించేవి.

Updated : 19 May 2023 04:44 IST

చ్చని గొడుగు విచ్చుకున్నట్లు విశాలంగా ఉన్న చింత చెట్టుపైన రకరకాల పక్షులు, ఉడుతలు జీవనం సాగిస్తున్నాయి. పక్షులు పంటపొలాల నుంచి ధాన్యపుగింజల్ని తెచ్చి పిల్లలకు తినిపించేవి. ఉడుతలు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లి రకరకాల పండ్లు, గింజల్ని తిని చీకటిపడే వేళకు చేరుకునేవి. ఒకరోజు ఉడుతలకు ఆహారం దొరక్క చాలాదూరం వెళ్లాల్సి వచ్చింది. తల్లితోపాటు మేతకు వెళ్లిన ఉడుత పిల్ల అలసిపోయింది. సాయంత్రం వేళకు నెమ్మదిగా తల్లితోపాటు గూటికి చేరింది.

తెల్లవారగానే ఉడుతలన్నీ మేతకు బయలుదేరాయి. ఉడుతపిల్ల నీరసంగా ఉండటం చూసి తల్లి బాధపడింది. ‘ఈ రోజుకు విశ్రాంతి తీసుకో బిడ్డా! నీకోసం ఎంతదూరమైనా వెళ్లి, నీకు ఇష్టమైన గింజలు తెచ్చిపెడతాను. కడుపునిండా తిందువుగాని’ అంటూ బుజ్జగించి మేతకు బయలుదేరింది. ఉడుత పిల్ల చెట్టుతొర్రలో నిద్రపోయింది. కొంతసేపటికి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఒంటరిగా ఉన్న ఉడుత పిల్ల ఉలికిపడి నిద్రలేచింది. భయంతో బయటకు తొంగిచూసింది.

గుంపులు గుంపులుగా వస్తున్న పక్షుల్ని చూసి గూళ్లలోని పక్షి పిల్లలు నోళ్లు తెరచి అరుస్తున్నాయి. పంటపొలాల నుంచి తెచ్చిన గింజల్ని తల్లి పక్షులు పిల్లలకు తినిపిస్తున్నాయి. ఆ సమయంలో కొన్ని గింజలు పిల్లల నోటి నుంచి జారి కిందపడుతున్నాయి. ఈ సంగతి గమనిస్తున్న ఉడుత పిల్లకు ఒక ఉపాయం తట్టింది. కష్టపడకుండా కడుపు నింపుకొనే అవకాశం దొరికిందని సంబరపడింది. రెప్పపాటులో గూటి నుంచి బయటకు వచ్చి చెట్టుకిందకు చేరింది. తలపైకెత్తి చూస్తే ధాన్యపుగింజల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది.

దొరికిన గింజను దొరికినట్టు నోట్లో వేసుకొని ఆకలి తీర్చుకుంది. ఈ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది. తల్లి వచ్చే వేళకు బాధ నటించసాగింది. తల్లి ఉడుత బిడ్డ బాధను చూసి తల్లడిల్లిపోయింది.

‘ఇదిగో బిడ్డా.. నీకోసం రుచికరమైన గింజలు తెచ్చాను తిను’ అంటూ ఆప్యాయంగా తినిపించింది. తల్లి తెచ్చిన గింజల్ని తిని ఉడుత పిల్ల హాయిగా నిద్రపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక కారణం చెప్పి మేతకు వెళ్లడం మానేసింది ఉడుత పిల్ల. చెట్టుకింద రాలిపడిన గింజల్నే కాక తల్లి తెచ్చిన ఆహారం కూడా తింటూ కాలం గడపసాగింది.

నెలలు గడిచి పోతున్నా... బిడ్డ మేతకు రాకపోవడంతో తల్లికి ఆహార సంపాదన కష్టంగా మారింది. రోజుకో రోగం పేరు చెప్పి తప్పించుకుంటున్న ఉడుత పిల్ల మాటలపై సందేహం కలిగింది. దాన్ని దూరం నుంచి గమనించడం మొదలు పెట్టింది. ఒకరోజు ఉడుత పిల్ల రాలిన గింజల్ని తింటుండగా అక్కడికి ఒక కుందేలు గెంతుకుంటూ వచ్చింది.

అంత పెద్ద శరీరాన్ని చూసి అది భయపడింది. ‘ఎవరు మీరు!’ అని వణికిపోతూ అడిగింది. ‘ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఉడుతలన్నీ మేతకు వెళితే, నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ బెదిరించింది కుందేలు. ‘ఆరోగ్యం బాగాలేక మేతకు వెళ్లలేకపోయాను. ఇదిగో ఈ చెట్టుకింద రాలిన గింజల్ని తిని ఆకలి తీర్చుకుంటున్నాను’ అంటూ దీనంగా బదులిచ్చిందది. ‘ఛీ.. ఛీ.. సోమరిపోతా! అబద్ధం చెప్పకు... కష్టపడకుండా వచ్చిన గింజలు తిని ఒళ్లు పెంచుకుంటున్నావు. తోటివాళ్లు కష్టపడి ఆహారం సంపాదించుకుంటుంటే రోగం పేరుతో ఒళ్లు దాచుకుంటావా?.. పని చేయగలిగే శక్తి ఉండి కూడా ఇతరులపై ఆధారపడటం మన జంతు జాతికే అవమానం’ అంటూ కోపంతో ఊగిపోయింది కుందేలు. ‘మీరు పెద్దవారు. నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం మీకు తగునా?’ అంటూ ఏడవసాగింది ఉడుత పిల్ల.

‘పెద్దదాన్ని కాబట్టే నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. చేసిందంతా చేసి మొసలి కన్నీరు కారుస్తావెందుకు? అసలు విషయం చెబుతా విను’ అంటూ ఉడుత పిల్లను దగ్గరకు తీసుకుంది కుందేలు. ‘మీ అమ్మ నాకు మంచి స్నేహితురాలు. దారిలో కలిసి నీ గురించి చెప్పింది. ఒకరోజు మేతకు వెళ్లివస్తూ గింజలు మేసి, లేని రోగాన్ని నటిస్తున్న నీ మోసాన్ని గ్రహించి బాధపడిందట. బిడ్డ, తల్లికి భారంగా మారి, బాధ్యతల్ని మరిచిపోకూడదు కదా! నేరుగా నిన్నే అడగాలనుకుంది. కానీ నిన్ను చిన్నబుచ్చటం ఇష్టంలేక, అడగలేక పోయిందట. అదీ తల్లి మనసంటే! ఇప్పటికైనా అర్థమైందా?’ అంటూ వివరించింది. ఆ మాటలు విన్న ఉడుత పిల్ల సిగ్గుతో తలదించుకుంది. తన వల్ల తల్లికి కలిగిన కష్టాన్ని తలచుకొని బాధ పడింది.
‘ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఈ చింత చెట్టుకూడా ఎండిపోవడం మొదలైంది. పక్షులన్నీ గూళ్లను వదిలి వలస పోవడం ప్రారంభించాయి. నేడో రేపో ఈ గింజలు కూడా కరవై పోతాయి. నీకు ఆహారం కోసం వెతుకులాట తప్పదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఆహారం సంపాదించడం అలవాటు చేసుకో’ అంటూ అసలు విషయం చెప్పి ముందుకు సాగింది కుందేలు.

తన తప్పు తెలుసుకున్న ఉడుత పిల్ల, తల్లి గూటికి రాగానే క్షమాపణ కోరింది. అప్పటి నుంచి తల్లితో పాటు మేతకు వెళ్లడం మొదలు పెట్టింది. ఇతరులపై ఆధారపడటం మానేసి, సొంతంగా ఆహారాన్ని సంపాదించటం అలవాటు చేసుకుంది. కష్టపడి పనిచేయటంలో ఉన్న ఆనందాన్ని తిరిగి పొందగలిగింది.

పోతగాని సత్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని