సాధనే మార్గం!

ఒకరోజు లేత క్యారెట్‌ నములుతూ కులాసాగా నడవసాగింది కుందేలు. ఇంతలో పక్కనే కోకిల నివసిస్తున్న మామిడి చెట్టు మీద నుంచి ఏవో కేకలు వినిపించాయి. వినసొంపైన పాటలే గానీ ఏనాడూ వేరే శబ్దం వినిపించని ఆ చెట్టు మీద నుంచి అరుపులూ కేకలూ రావడం విన్న కుందేలు ఆశ్చర్యపోయి అక్కడే ఆగింది.

Updated : 06 Aug 2023 00:55 IST

కరోజు లేత క్యారెట్‌ నములుతూ కులాసాగా నడవసాగింది కుందేలు. ఇంతలో పక్కనే కోకిల నివసిస్తున్న మామిడి చెట్టు మీద నుంచి ఏవో కేకలు వినిపించాయి. వినసొంపైన పాటలే గానీ ఏనాడూ వేరే శబ్దం వినిపించని ఆ చెట్టు మీద నుంచి అరుపులూ కేకలూ రావడం విన్న కుందేలు ఆశ్చర్యపోయి అక్కడే ఆగింది. ‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు.. దాని గొంతు విన్నావా.. అసలది ఈ చెట్టు దాటి బయటకు రావడం లేదు. వసంత రుతువు వచ్చి వారం రోజులైంది. అడవిలోని కోకిలలన్నీ తెగ పాడుతున్నాయి. మన బిడ్డ మాత్రం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పాడలేదు. ఇలా అయితే ఎలా? మిగతా జంతువులన్నీ ఏమనుకుంటాయి? అది ఎందుకు పాడలేకపోతోందో ఏంటో.. నాకేమీ అర్థం కావడం లేదు. వైద్యం చేసే ఎలుగు మామ దగ్గరికి తీసుకెళ్దాం’ అని తన భర్తపైన అరవసాగింది తల్లి కోకిల.

ఆ మాటలు విన్న కుందేలు మరింత ఆశ్చర్యపోయింది. ‘నిజమే.. వసంతం రావడంతో పిల్ల కోకిలలన్నీ ఎంచక్కా రాగాలు తీస్తున్నాయి. ఈ చెట్టు మీదున్న పిల్లది మాత్రం నోరు విప్పడం లేదు. దాని పాట విన్నదే లేదు. ఎందుకబ్బా?’ అని మనసులోనే అనుకుంటూ అడవి దాటి పక్కనే ఉన్న రామాపురం పొలిమేరల్లోకి వెళ్లిందది. ‘సరే.. ఎటూ వచ్చాను కదా..’ అనుకుంటూ కాలక్షేపంగా ఊళ్లోకి వెళ్లింది. కాస్త దూరం నడవగానే బడిలో పిల్లలంతా మాస్టారికి ఏదో పద్యం అప్పజెబుతూ కనిపించారు.
వారిలో ఒక కుర్రాడు మాత్రం పద్యం సరిగ్గా చెప్పడం లేదు. దాంతో మాస్టారు అతడిని దగ్గరికి పిలిచి.. ‘చూడు బాబూ.. నువ్వు తెలివైనవాడివి. బద్ధకమే నిన్ను చెడగొడుతోంది. ఈ బడిలో చేరిన మొదట్లో రోజూ పొద్దున్నే లేచి పాఠాలు చదివేవాడివి. తర్వాత్తర్వాత ఇంట్లో గారాబం ఎక్కువైంది. దాంతో నీకు బద్ధకం వచ్చింది. నువ్వు రోజూ చదవకపోతే ఈ వచ్చిన కాస్త కూడా మర్చిపోతావు. ఇప్పటికైనా ఇంటికెళ్లాక పుస్తకాలు బయటకు తీసి చదువు’ అన్నారు. ఆ మాటలు విని కుందేలు తల గోక్కుంటూ.. ‘చదువు సరే.. పాట కూడా అంతేనా.. ఎవరైనా చెబితే బాగుండు’ అనుకుంటూ ముందుకు కదిలింది.

రెండు వీధులు తిరిగాక.. ఒకచోట పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతూ ఓ గురువు కనిపించారు. కుందేలు వెళ్లేసరికి ఆయన ఎవరినో గట్టిగా మందలిస్తున్నారు. ‘ఇదేదో కోకిలమ్మలాంటి గొడవలాగే ఉందే..’ అనుకుంటూ అక్కడే ఆగి వినడం ప్రారంభించిందది. తనకెదురుగా తలవంచుకుని కూర్చున్న పాపతో ‘చూడమ్మా.. మీ తాతయ్య ప్రముఖ సంగీత విద్వాంసుడు. మీ నాన్న కూడా సంగీతంలో ఎంతో పేరు సంపాదించారు. అలాగని.. నీకు సంగీతం రాదా అంటే కాదు.. నువ్వు గొంతు విప్పితే చాలు.. కోకిలలే చిన్నబోతాయి. అలాంటిది నువ్వు నోరు విప్పడానికే ఇంత కష్టపడుతున్నావు. కారణం ఏమిటో తెలుసా.. సాధన లేకపోవడమే.. సాధన లేకపోతే కోకిల కూడా తనకు సహజంగా వచ్చిన గాత్రాన్ని మర్చిపోతుంది. ఏ విద్యలో అయినా సరే.. ఎంత సాధన చేస్తే అంత రాణించగలం. ఇప్పటికైనా బద్ధకం వదిలిపెట్టి రోజూ సంగీత సాధన చెయ్యి’ అని చెప్పారా గురువు.

ఆ మాటలు వినగానే కుందేలుకు అడవిలోని మామిడి చెట్టు మీది కోకిల పిల్ల ఎందుకు పాడలేకపోతుందో అర్థమైంది. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో అమ్మానాన్నలు గారాబంగా పెంచారు. చెట్టు మీద నుంచి కనీసం బయటకు కూడా రానిచ్చేవారు కాదు. సాధన లేకపోవడంతో దాని గొంతు పూడుకుపోయింది’ అనుకుంది కుందేలు. వెంటనే అడవిలోకి పరిగెత్తి.. మామిడి చెట్టు కింద నిలబడి.. తల్లి కోకిలను కిందకు పిలిచింది. ‘నీ బిడ్డకు ఎటువంటి వైద్యమూ అక్కర్లేదు. సాధన చేయకపోవడమే అసలు లోపం’ అంటూ ఊరిలో జరిగిన విషయమంతా వివరించింది. ‘అదా సంగతి’ అంటూ రివ్వున చెట్టుమీదకు ఎగిరింది తల్లి కోకిల. ఆ క్షణం నుంచి బిడ్డతో రోజూ సాధన చేయించింది. వారం తిరక్కుండానే పిల్ల కోకిల మధురమైన గొంతు నుంచి వచ్చే పాటలతో అడవి మొత్తం పులకించింది.

లక్ష్మీ గాయత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని