చందనం.. కుందనం.. నందనం..!

నందనం అనే అడవిలో ‘కుందనం’ అనే కుందేలుకు ఓ బుజ్జి కుందేలు పుట్టింది. దానికి ‘చందనం’ అనే పేరు పెట్టుకుంది తల్లి కుందేలు. ఆడపిల్ల... పైగా చాలా కాలం తరువాత పుట్టడంతో దాన్ని చాలా గారాబం చేసింది కుందనం.

Published : 07 Aug 2023 00:03 IST

నందనం అనే అడవిలో ‘కుందనం’ అనే కుందేలుకు ఓ బుజ్జి కుందేలు పుట్టింది. దానికి ‘చందనం’ అనే పేరు పెట్టుకుంది తల్లి కుందేలు. ఆడపిల్ల... పైగా చాలా కాలం తరువాత పుట్టడంతో దాన్ని చాలా గారాబం చేసింది కుందనం. చందనం చాలా చురుకైనది. పైగా దానికి చాలా సందేహాలు. ఎప్పుడూ తల్లి వెంటే ఉంటూ రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. రాత్రి కొలను గట్టున తల్లి ఒడిలో కూర్చుంది చందనం.
‘అమ్మా.. ఆ చందమామ ఈ నీటిలో ఊగుతున్నాడు ఎందుకు? మనకు రెండు చందమామలు ఉన్నాయా?’ అంది గారాలు పోతూ. ‘అమ్మో..! దీనికి మళ్లీ సందేహం వచ్చేసింది’ అనుకుంటూ... ‘లేదమ్మా.. అది చందమామ నీడ అలా నీటిలో పడి అలల తాకిడికి ఊగుతోంది అంతే’ అని సమాధానం చెప్పింది. ‘కానీ.. మొన్న నీడ అంటే ఏదైనా కాంతికి అడ్డు వస్తే పడేది అన్నావు కదా! ఇప్పుడు చందమామ ఒకటే కదా.. ఆకాశంలో ఉంది. అది ఎవరికీ అడ్డు రాలేదు! మరి దాని నీడ అని ఎలా అంటావు?’ అని ప్రశ్నించింది చందనం.

‘అది నీడ కాదమ్మా.. నేను వివరంగా చెప్పలేదు. అది చందమామ ప్రతిబింబం. చందమామ ఎలా ఉంటే ప్రతిబింబం అలాగే ఉంటుంది.. చూడు రంగుతో సహా, అదే నీడ అయితే రంగు ఉండదు నల్లగా పడుతుంది’ అని సర్ది చెప్పింది కుందనం. ‘అంటే ఎండలో పడేది నీడ, నీటిలో పడేది ప్రతిబంబం’ అన్నమాట అంది చందనం. ‘అంతే.. అంతే!’ అంది కుందనం.

‘మరి మొన్న కథలో, కుక్క తన నీడను నీటిలో చూసుకుని మాంసం ముక్క పడేసుకుంది అని చెప్పావే!’ అంది. ‘ఇక చాలమ్మా.. నీ ప్రశ్నలు.. పడుకో’ అంటూ చందనాన్ని జో కొట్టి నిద్దుర పుచ్చింది తల్లి కుందేలు కుందనం. ‘ఇలా ఇది ప్రశ్నలతో ఇతరులను విసిగిస్తే ఎలాగో ఏంటో’ అనుకుంటూ తానూ నిద్రపోయింది.  

ఉదయాన్నే నిద్ర లేచిన చందనంతో.. ‘జాగ్రత్తగా ఉండు. నేనలా వెళ్లి.. నీ కోసం మంచి చిలగడ దుంపలు తెస్తాను. నీ ప్రశ్నలతో మాత్రం ఎవరినీ విసిగించకు’ అని జాగ్రత్తలు చెప్పి వెళ్లింది కుందనం. అమ్మ అలా వెళ్లాక, పచ్చికలో పాటలు పాడుకుంటూ.. ఆడుకుంటోంది చందనం. అప్పుడే అటుగా వచ్చింది మృగరాజు. రాజును చూడగానే.. ‘నమస్కారం మృగరాజా!’ అంది చందనం. ముద్దుగా ఉన్న ఆ కుందేలు పిల్లను చూడగానే మురిసిపోయింది మృగరాజు.

వెంటనే నీ పేరేంటి అంది అది. ‘నా పేరు చందనం. మా అమ్మ పేరు కుందనం. ఈ అడవి పేరు నందనం’ అంది ముద్దు ముద్దుగా. ‘భలే.. భలే... బాగా మాట్లాడుతున్నావు’ అంది మృగరాజు. ‘మహారాజా! నాదో సందేహం’ అంది చందనం. ‘చెప్పు.. తీరుస్తా’ అంది మృగరాజు. ‘దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు కదా!’ అంది. ‘అవును.. అందులో సందేహం ఏముంది?’ అని సమాధానం ఇచ్చింది మృగరాజు. ‘మరి అటువంటప్పుడు మేము దుంపలు, గడ్డిలాంటివి తింటుంటే మీరు మాలాంటి జంతువులను ఎందుకు చంపి తింటున్నారు. పైగా మా అమ్మ ఎప్పుడూ క్రూర జంతువులు ఉంటాయి.. జాగ్రత్తగా ఉండాలి అంటుంది. మేమెందుకు అప్రమత్తంగా ఉండాలి’ అంది అమాయకంగా! దాని ప్రశ్నకు జవాబు చెప్పలేక.. ‘మీ అమ్మ వచ్చాక, నా దగ్గరికి రమ్మని చెప్పు’ అని గట్టిగా చెప్పి వెనుతిరిగింది మృగరాజు. సమాధానం చెప్పలేక వెళ్లిపోతున్న మృగరాజును చూసి కిసుక్కున నవ్వింది చందనం. మృగరాజు ఈ విషయాన్ని గమనించనే గమనించింది.

‘కావాల్సిన దుంపలు తీసుకుని గూడు దగ్గరకి వచ్చింది తల్లి కుందేలు కుందనం. నేను వెళ్లిన తర్వాత ఎవరూ రాలేదు కదా!’ అంది. ‘ఎందుకు రాలేదు. ఏకంగా మృగరాజే వచ్చింది. ఒక్క ప్రశ్నకే జవాబు చెప్పలేక తుర్రుమని వెళ్లిపోయింది’ అంది చందనం. ‘ఏంటీ మృగరాజును ప్రశ్నలు అడిగావా..? నీకు చెప్పాను కదే ఎవరినీ ఏమి అడగవద్దని’ అంది కుందనం. ‘ఎందుకు ఆడగకూడదు. ఆయన ఈ అడవికి రాజు. రాజును ఏదైనా అడగవచ్చని మొన్న కథలో చెప్పావు గుర్తు లేదా?’ అని ఎదురుప్రశ్న వేసింది చందనం.

‘భలే దానివి నువ్వు. అసలింతకూ మృగరాజును ఏం అడిగావు’ అంది కుందనం. ‘తనకు మృగరాజుకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పి, నువ్వు వచ్చాక తన దగ్గరకు రమ్మని చెప్పింది’ అంది చందనం.

‘కొంప ముంచావు కదే! అమ్మ చెప్పిన మాట వినవు కదా!’ అనుకుంటూ చందనాన్ని తీసుకొని మృగరాజు దగ్గరకు వెళ్లింది కుందనం. మృగరాజు దగ్గర ఏనుగు, నక్క, ఎలుగు ఉన్నాయి. అవి ఏవో మాట్లాడుతున్నాయి. ‘మృగరాజా..! నా బిడ్డ చేసిన తప్పునకు మన్నించండి’ అంది కుందనం. ‘అదేమి తప్పు చేసింది. అదింకా చిన్నపిల్ల. చురుకైనది కనుక అలా మాట్లాడుతోంది. నిన్ను రమ్మన్నది ఎందుకంటే, దాన్ని వెంటనే ఓ గురువు దగ్గర చేర్పించు. చదువుకుంటే దానికి అన్నీ తెలుస్తాయి. దాని సందేహాలు తీరుతాయి. లేకుంటే అది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని క్రూర జంతువుల వల్ల దాని ప్రాణానికే ప్రమాదం’ అంది మృగరాజు.

‘అదీ మృగరాజు లక్షణం. ఆకలేసినప్పుడు జంతువులను చంపినా మిగతా సమయంలో వాటి యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది అనుకున్నాయి మిగిలిన జంతువులు. రాజు సలహాతో చందనాన్ని హరితం అనే లేడి దగ్గర చదువు కోసం పంపింది కుందనం. తక్కువ సమయంలోనే చదువు పూర్తి చేసుకుని, అన్నీ తెలుసుకుని తిరిగి వచ్చింది చందనం. ఇప్పుడది తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం నేర్చుకుంది.

 కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు