మూడు మామిడి మొక్కలు!

తిరుపతి పక్కన ఉండే ఊరు వెంకటాపురం. ఆ గ్రామంలో బసవయ్య మంచి పేరున్న ఆసామి. ఆయనకు ముగ్గురు కొడుకులు. అందులో మొదటివాడు వీర. రెండోవాడు వెంకట్‌.

Updated : 11 Aug 2023 04:10 IST

తిరుపతి పక్కన ఉండే ఊరు వెంకటాపురం. ఆ గ్రామంలో బసవయ్య మంచి పేరున్న ఆసామి. ఆయనకు ముగ్గురు కొడుకులు. అందులో మొదటివాడు వీర. రెండోవాడు వెంకట్‌. మూడోవాడు కార్తికేయ. తన ముగ్గురు కొడుకులకు చదువుతోపాటు సంస్కారం, ధనం విలువను తెలియజెప్పాలని అనుకున్నాడు. దాంతో ఒక రోజు కొడుకులను పిలిచి, తన దగ్గర ఉన్న మూడు మామిడి మొక్కలను వాళ్లకు అందించాడు.
‘చూడండి! మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు. పెద్దవారయ్యాక నా నుంచి వచ్చే ధనాన్ని మీరు కాపాడుకోవడంతోపాటు స్వతహాగా సంపాదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా లేకపోతే నేను ఇచ్చే ధనం వృథాగా పోతుంది. దాని విలువ మీకు తెలియాలంటే మీ ముగ్గురూ నేనిచ్చిన మామిడి మొక్కలను ఉపయోగించి సంపద సృష్టించండి. ఎవరైతే ఇందులో మంచిపేరు సంపాదించుకుంటారో... వాళ్లకు నా నుంచి ఒక మంచి బహుమానమూ ఉంటుంది’ అన్నాడు బసవయ్య.
ముగ్గురు కొడుకులు తమ తండ్రి చెప్పిన విధంగా మూడు మొక్కలను వేరు వేరు ప్రదేశాల్లో నాటి, వాటికి నీరు పోసి పెంచడం ప్రారంభించారు. వాళ్లతోపాటు మొక్కలు కూడా పెరిగి పెద్దయ్యాయి. వాటిలో వీర నాటిన మొక్క పెద్ద వృక్షంగా మారింది. దాన్ని ఒక కొయ్యల వ్యాపారికి అమ్మి, దాని నుంచి వచ్చే ధనాన్ని తీసుకుని తన తండ్రికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇక రెండోవాడు వెంకట్‌.. తను పెంచి పెద్ద చేసిన మామిడి చెట్టుకు కాసిన పండ్లను ప్రతి సంవత్సరం బజారులోని వర్తకులకు అమ్మాలనుకున్నాడు. దాని నుంచి వచ్చిన ధనాన్ని తండ్రికి ఇవ్వాలనుకున్నాడు. ఇదే విషయాన్ని వాళ్లు తమ తండ్రితో పంచుకున్నారు.
కార్తికేయ మాత్రం ఏ విషయమూ చెప్పలేదు. ‘నీకు అప్పట్లో ఇచ్చిన మొక్కను ఏం చేశావు?’ అని అడిగాడు బసవయ్య. దానికి కార్తికేయ ‘నాన్నగారూ... మీరు నాతో వస్తే ఆ చెట్టు ఇప్పుడు ఏమైందో చూపిస్తాను’ అని అన్నాడు.
ఏం జరిగి ఉంటుందో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు బసవయ్య. కొద్దిదూరం నడిచి ఊరి బయటకు వెళ్లేసరికి అక్కడ తమకున్న ఖాళీ స్థలంలో ఒక మామిడి తోట కనిపించింది. ఆ తోట వరసలు గల చెట్లతో చూడడానికి నిండైన కాయలతో కనపడింది. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ఇన్ని చెట్లు ఎలా వచ్చాయో అర్థం కాక, ‘ఇది ఎవరిది?’ అని అడిగాడు బసవయ్య. అందుకు కార్తికేయ.. ‘నాన్నా.. మీరిచ్చిన మొక్కతోపాటు మరి కొన్నింటిని తీసుకొచ్చి నాటి సంరక్షించాను. అవి ఇచ్చిన ఫలాల నుంచి వచ్చిన మరికొన్ని మామిడి టెంకలనూ నాటాను. అవి కూడా మొలకెత్తి మొక్కలయ్యాయి. ఇప్పుడు ఈ తోట నుంచి నిరంతరం మనకు ఆదాయం వస్తుంది. అలాగే పర్యావరణానికి కూడా ఎంతో మేలు. ఇంకా... ఈ తోట నుంచి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి ఉపయోగించాలని అనుకుంటున్నాను’ అన్నాడు.  
ఆ మాటలు విన్న బసవయ్య.. తన చిన్నకొడుకు చేసిన పనికి ఉప్పొంగిపోయాడు. మిగతా ఇద్దరు కొడుకులతో... ‘మీరు కూడా ఇకపై ఇలానే ఆలోచిస్తే... మన కుటుంబంతో పాటు ఇంకొన్ని కుటుంబాలు కూడా బాగుంటాయి’ అన్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆస్తిని వాళ్ల ముగ్గురికీ పంచి, తాను విశ్రాంతి తీసుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఆనందంగా జీవించారు. పేదలకూ తమ వంతు సాయం చేశారు.  
సింగంపల్లి శేష సాయి కుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు