మావయ్య మాట!

‘అమ్మా.. మంచినీళ్లు’ అంటూ అరిచాడు బంటి. ‘ఆ వస్తున్నాను’ అంటూ గబగబా నీళ్లు తెచ్చి ఇచ్చింది శాంత. ‘అమ్మా.. ఈ రిబ్బన్లు ఉతకలేదా?

Updated : 13 Aug 2023 06:33 IST

‘అమ్మా.. మంచినీళ్లు’ అంటూ అరిచాడు బంటి. ‘ఆ వస్తున్నాను’ అంటూ గబగబా నీళ్లు తెచ్చి ఇచ్చింది శాంత. ‘అమ్మా.. ఈ రిబ్బన్లు ఉతకలేదా?’ అంటూ చిరాగ్గా అడిగింది పదేళ్ల రాణి. ‘నిన్న తీరిక దొరకలేదమ్మా.. ఈరోజు ఉతుకుతాలే..’ అని బదులిచ్చింది అమ్మ. ‘ఎప్పుడూ ఇలాగే చేస్తావు. ఈరోజు ఈ రంగు డ్రెస్సూ, రిబ్బన్లు వేసుకోవాలని నేను, సుమ అనుకున్నాం. ఇప్పుడేం చెప్పాలి తనకు? వాళ్లమ్మ మాత్రం ఎప్పుడూ అన్నీ సిద్ధంగానే ఉంచుతుంది.. సరే.. ఇటొచ్చి గబగబా జడ వేయమ్మా..’ అని అడిగింది. ‘వస్తున్నాను ఆగు.. అక్కడ పోపు మాడిపోతుంది’ అంటూ వచ్చిందామె.

‘అమ్మా.. నా పెన్‌ ఏది? బూట్లు పాలిష్‌ చేశావా?’ అని అడిగాడు బంటి. ఇంతలో ‘నా ఎర్రచొక్కా ఏది?’ అంటూ బంటి వాళ్ల నాన్న, మరోవైపు ‘శాంతా.. మీ మామగారికి రెండోసారి కాఫీ ఇచ్చావా?’ అంటూ అత్తగారూ అడగసాగారు. ‘వస్తున్నా, చేస్తున్నా..’ అంటూ పరుగులు తీస్తోందామె. ఆ రోజే ఊరి నుంచి వచ్చిన శాంతా వాళ్ల అన్నయ్య రంగరాజు అన్నీ గమనిస్తున్నాడు. ఈలోగా ‘ఇదిగో అన్నయ్య కాఫీ’ అంటూ తనకో గ్లాస్‌ ఇచ్చి, తానొకటి పట్టుకుని కూర్చుంది. అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు.

సాయంత్రం భోజనాల వేళయింది. అందర్నీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు పిలిచింది అమ్మ. పిల్లలు హోంవర్క్‌ చేసేసుకొని గబగబా వచ్చేశారు. ‘అమ్మా కంచం పెట్టు.. నీళ్లు ఇవ్వు’ అంటూ హడావిడి చేయసాగారు పిల్లలు. ‘రాణీ, బంటీ.. అవి మీరు తెచ్చుకుని కూర్చోండి’ అన్నాడు మావయ్య. ‘ఎందుకు మావయ్యా.. అమ్మ ఇస్తుందిగా..’ అని బదులిచ్చారిద్దరూ. ‘రాణీ.. పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావు?’ అడిగాడు మావయ్య. ‘నేను డాక్టర్‌ అవుతాను’ అని టక్కున అంది. ‘నేను కూడా..’ అన్నాడు బంటి.

‘సరే బాగా చదువుకొని నువ్వు డాక్టర్‌ అయ్యావనుకో. ఆపరేషన్‌ చేసే ముందు ఏం చేస్తావు?’ అని అడిగాడు మావయ్య. ‘ఏం చేస్తాను? ఆపరేషన్‌కు కావాల్సిన సామగ్రి మొత్తం ఉందో లేదో చూసుకుంటాను. లేకపోతే నర్సులను పెట్టమని చెబుతాను’ బదులిచ్చింది రాణి. ‘ఒకవేళ పెట్టకపోతే ఏం జరుగుతుంది?’ మళ్లీ అడిగాడు మావయ్య. ‘అమ్మో.. రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు’ అంది కాస్త భయంగా.

  ‘కదా.. మరి ఇక్కడా అంతే.. తినేటప్పుడు కూడా పొలమారవచ్చు. సమయానికి నీళ్లు అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బంది పడతాం.. ఇదనే కాదు. ఏ పని చేయాలనుకున్నా, ముందుగా అందుకు కావాల్సిన కసరత్తు చేసుకోవాలి. సరైన ప్రణాళిక ప్రకారం అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలి. అప్పుడే ఆ పని తొందరగా అవుతుంది. ఎటువంటి ఇబ్బందీ ఉండదు.. ప్రతిదానికీ అమ్మపైనే ఆధారపడొద్దు.. ఎవరి పని వాళ్లకే కష్టమైతే, మరి ఇంట్లో అందరి పనీ అమ్మకు ఎలా సాధ్యమవుతుందని మనమూ ఆలోచించాలి కదా!’ అని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాడు మావయ్య.

ఇంతలో ఒకచేతిలో కంచాలు, మరో చేతిలో మంచినీళ్ల గ్లాసులు తీసుకొచ్చింది శాంత. ‘చూడమ్మా.. నువ్వు పిల్లలను సోమరుల్లా తయారు చేస్తున్నావు. కొన్ని కొన్ని పనులు సొంతంగా చేసుకునేలా చూడాలి’ అని చెల్లితో అన్నాడు రంగరాజు. ‘చిన్నపిల్లలు కదా..’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చిందామె. ‘ఇప్పటి నుంచి మనం నేర్పితేనే పెద్దయ్యాక వాళ్లకు ఎటువంటి కష్టమూ ఉండదు’ మరింత వివరంగా చెప్పాడాయన. అన్నయ్య చేప్పేది నిజమేననుకుంటూ తలూపింది శాంత.

 ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు