వదల బొమ్మా... నిన్నొదల!!

బాబీ వాళ్ల అమ్మ పావని తినడానికి ఏది పెట్టినా.. ‘నాకు ఇది సరిపోదు, ఇంకా కావాలి...’ అని గొడవ చేస్తాడు. ‘బాబీ! పెట్టింది తిను, మొత్తం తినేస్తే మళ్లీ పెడతాను.

Published : 14 Aug 2023 00:21 IST

బాబీ వాళ్ల అమ్మ పావని తినడానికి ఏది పెట్టినా.. ‘నాకు ఇది సరిపోదు, ఇంకా కావాలి...’ అని గొడవ చేస్తాడు. ‘బాబీ! పెట్టింది తిను, మొత్తం తినేస్తే మళ్లీ పెడతాను. పదార్థాలు వృథా చేయకూడదు’ అని పావని ఎంత చెప్పినా వినడు. గొడవ భరించలేక ఎక్కువ పదార్థాలు పెడితే, తినకుండా వృథా చేస్తాడు. బాబీ వాళ్ల నాన్న రాజీవ్‌ బజారుకు తీసుకు వెళ్లినా అన్నీ కావాలని అడుగుతాడు. ఏదైనా ఒకటి కొంటే తృప్తి చెందక, మరొకటి చూపించి కొనమంటాడు.

‘అలా అన్నీ అడగకూడదు బాబీ! మనకు ఉన్న దాంతో తృప్తి పడాలి, లేని దాని కోసం ఆశ పడకూడదు’ అని చెబుతుంది పావని. ఒక ఆదివారం రాజీవ్‌ వాళ్ల స్నేహితుడు వీళ్లను భోజనానికి ఆహ్వానించాడు. రాజీవ్‌, పావని, బాబీ వాళ్ల ఇంటికి వెళ్లారు. వాళ్ల అబ్బాయి రవి కూడా బాబీతో పాటు మూడో తరగతి చదువుతున్నాడు. రవి తన దగ్గర ఉన్న బొమ్మలు బాబీకి ఆడుకోవడానికి ఇచ్చాడు. ‘రవీ! నీ దగ్గర రెండు బొమ్మలే ఉన్నాయి, కానీ నా దగ్గర చాలా బొమ్మలున్నాయి తెలుసా!’ అన్నాడు బాబీ. ‘నాకు డాడీ ఇవే కొనిచ్చారు. నేను వీటితో జాగ్రత్తగా ఆడుకుంటాను, పాడవకుండా మళ్లీ భద్రపరుచుకుంటాను’ అన్నాడు రవి. రవి దగ్గర ఉన్న బొమ్మలు బాబీకి బాగా నచ్చాయి. వాటిని చూస్తుంటే తనతో తీసుకెళ్లిపోవాలనిపించింది. రవి వాళ్ల అమ్మ ఇద్దరికీ రెండు చిన్న కప్‌ కేకులు ప్లేటులో పెట్టిచ్చింది.

బాబీ ప్లేటు తీసుకుని ‘ఆంటీ! నాకు కప్‌ కేకులంటే చాలా ఇష్టం. ఇంకా కావాలి’ అన్నాడు. ‘నువ్వు ఇవి తిను బాబీ! తిన్నాక ఇంకా పెడతాను’ అంది. అక్కడే ఉన్న పావని, రాజీవ్‌ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ‘తప్పు బాబీ! అలా అడగకూడదు, ఇచ్చినవి తినాలి’ అంది పావని. ‘నాకు కప్‌ కేకులంటే ఇష్టం కదమ్మా! అందుకే అడిగాను’ అన్నాడు బాబీ. ‘ఇష్టమైతే నేను తెస్తాను బాబీ!’ సిగ్గుపడుతూ అన్నాడు రాజీవ్‌.

‘మరేం ఫర్వాలేదండి... తిననివ్వండి’ అంది రవి వాళ్ల అమ్మ. భోజనాల దగ్గర కూడా.. ‘అన్నీ నాకు ఇష్టం, నాకు ఇంకా కావాలి’ అని అడిగాడు బాబీ. తీరా పెడితే తినలేక వదిలేశాడు. బాబీ ప్రవర్తన అతడి తల్లిదండ్రులను చాలా బాధ పెట్టింది. భోజనాలయ్యాక అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు రవి దగ్గర ఉన్న స్పైడర్‌ మాన్‌ బొమ్మ, వాటర్‌ గన్‌ బొమ్మ తీసుకున్నాడు బాబీ.

‘అమ్మా! ఇవి నాకు కావాలి, నేను తీసుకుంటాను’ అన్నాడు బాబీ. రవి బిత్తరపోయి చూస్తున్నాడు. రవి వాళ్ల అమ్మ, నాన్న కూడా బాబీని వింతగా చూస్తున్నారు. పావని, రాజీవ్‌కు చాలా అవమానంగా అనిపించింది. ‘బాబీ! పరాయి వారి వస్తువులు అలా తీసుకోకూడదు! నీ దగ్గర చాలా బొమ్మలున్నాయి కదా?! పద, ఇంటికి వెళ్లిపోదాం’ అన్నాడు రాజీవ్‌.

‘ఉహూ! నా దగ్గర ఉన్న స్పైడర్‌ మాన్‌ బొమ్మ వేరుగా ఉంది. ఇది బాగుంది డాడీ, నాకు ఇదే కావాలి’ అన్నాడు బాబీ. ‘మనం బయట కొనుక్కుందాం పద బాబీ’ అంది పావని. ‘ఇక్కడ కొంటాము అంటారు, బయటకు వెళ్లాక మాత్రం నీ దగ్గర ఉన్న బొమ్మలతో ఆడుకో అంటారు. నాకు ఈ బొమ్మలు కావాలి’ అని మొండిగా అన్నాడు బాబీ.

ఇదంతా చూస్తున్న రవి మెల్లిగా బాబీ దగ్గరకు వచ్చాడు. ‘బాబీ! నీకు ఈ బొమ్మలు కావాలా?’ అన్నాడు. ‘అవును కావాలి... నా స్పైడర్‌మాన్‌ బొమ్మ కన్నా ఇది బాగుంది. వాటర్‌ గన్‌ బొమ్మ కూడా నా బొమ్మ కన్నా బాగుంది’ అన్నాడు బాబీ. ‘సరే బాబీ! ఇవి నువ్వు తీసేసుకో, నీకు నచ్చని నీ బొమ్మలు నాకు ఇచ్చేస్తావా?’ అన్నాడు రవి.

ఊహించని ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు బాబీ. ‘ఇచ్చేస్తావా బాబీ?’ మళ్లీ అడిగాడు రవి. ‘ఇవ్వను..’ అన్నాడు అయిష్టంగా. ‘నీ బొమ్మలు నాకు ఇచ్చేసి, నా బొమ్మలు నువ్వు తీసుకో బాబీ’ అన్నాడు రవి. ‘నా బొమ్మలు ఇవ్వను, నీ బొమ్మలు కూడా ఇవ్వను’ అన్నాడు బాబీ.

‘అలా అయితే అది అత్యాశ అవుతుంది. బొమ్మలు కావాలనే కోరిక ఉంటే ఆశ అంటారు. ఎదుటి వారి బొమ్మలూ కావాలంటే దాన్ని అత్యాశ అంటారు. అశ పడటం మంచిదే కానీ అత్యాశే మంచి అలవాటు కాదని మా టీచర్‌ చెప్పారు’ అన్నాడు రవి. బాబీ సిగ్గుపడ్డట్లుగా తలవంచుకున్నాడు.

‘బాబీ! ఈ బొమ్మలు నువ్వు తీసుకో, నాకు నీ బొమ్మలు వద్దు. నీ వస్తువు ఇవ్వాలంటే నీకు బాధ కలిగింది కదా! అలాగే ఎదుటి వాళ్లకు కూడా వారి వస్తువు ఇవ్వాలంటే బాధ కలుగుతుంది. అలా అడగకూడదు. అలాగే నీకు ఎంత ఆహారం సరిపోతుందనేది ఆంటీకి తెలుసు, నువ్వు ఎక్కువ కావాలని అడిగావు కానీ తినలేకపోయావు. ఎప్పుడూ ఎక్కువగా ఆశ పడటం మంచిది కాదు’ అన్నాడు రవి.

బాబీ బుర్రలో రవి చెప్పిన విషయాలు సూటిగా నాటుకున్నాయి. ఇన్నాళ్లు అమ్మ, నాన్న చెప్పింది కూడా అర్థం కాలేదు. కానీ తన వస్తువులు ఇవ్వాలంటే బాధ కలిగింది. రవి దగ్గర ఉన్న రెండు బొమ్మలు కూడా తను అడిగితే ఇచ్చేస్తాను అన్నాడు. అలా తానెందుకు ఉండటం లేదని ఆలోచించాడు. ఉన్నదాంతో తృప్తి పడటంలోనే ఆనందం ఉందని అర్థమైంది. అప్పుడు అతడి ముఖంలో సంతృప్తి కనిపించింది. రవి వల్ల బాబీలో మార్పు వచ్చినందుకు పావని, రాజీవ్‌ చాలా సంతోషించారు. తర్వాత ఇంకెప్పుడూ బాబీ అత్యాశ పడలేదు.

కేవీ సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని