ఎవరు నిజమైన దేశభక్తుడు?!

గస్టు పదిహేను సందర్భంగా పాఠశాలలో దేశభక్తుల ఎంపిక జరగబోతోంది. విద్యార్థులందరూ అందుకు సిద్ధంగా ఉండాలి. మంచి బహుమతులు కూడా ఉంటాయి’ అని తరగతుల వారీగా ప్రధానోపాధ్యాయుడు సర్క్యులర్‌ పంపించారు.

Updated : 15 Aug 2023 05:34 IST

గస్టు పదిహేను సందర్భంగా పాఠశాలలో దేశభక్తుల ఎంపిక జరగబోతోంది. విద్యార్థులందరూ అందుకు సిద్ధంగా ఉండాలి. మంచి బహుమతులు కూడా ఉంటాయి’ అని తరగతుల వారీగా ప్రధానోపాధ్యాయుడు సర్క్యులర్‌ పంపించారు. ‘అయినా... ఇప్పుడు దేశభక్తుల అవసరమేమొచ్చింది?’ అని కొందరు విద్యార్థులు తమలో తాము చర్చించుకున్నారు. మరికొందరైతే... ‘అసలు దేశభక్తులు ఎలా ఉంటారు?’ అని మాట్లాడుకున్నారు. ఈ విషయం ఇళ్లకు చేరింది. తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లల్లో దేశభక్తి భావన కలగజేసేందుకు వారు ఖద్దరు దుస్తులు కుట్టించాలనుకున్నారు.

తెల్లవారి పాఠశాలకు వచ్చిన పిల్లల్లో ఎక్కువ మంది ఖద్దరు దుస్తుల విషయం ప్రధానోపాధ్యాయుడికి తెలియజేశారు. ‘మీ తల్లిదండ్రులు దేశభక్తికి బీజం వేశారన్నమాట’ అన్నారాయన. ‘అయితే వేషం మార్చితే దేశభక్తులు అయిపోవచ్చన్నమాట’ అనేశాడు ఓ విద్యార్థి.

‘వేషం మార్చడమంటే ఈ సందర్భంగా మగ్గంపై ఖద్దరు నేసిన నేతన్నలకు, అవి కుట్టేందుకు దర్జీలకు పరోక్షంగా ఉపాధి కల్పించడం అవుతుంది. తోటివారికి ఉపాధి కల్పించడం కూడా  దేశభక్తిలో ఒక భాగం’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడు.

‘అంటే తోటివారికి సాయపడడమనేది దేశభక్తికి కొలమానం’ అని అర్థమౌతుంది అన్నాడు మరో విద్యార్థి. ‘ఇంకా దారులు ఉన్నాయి’ ఆలోచించండి అన్నారు ప్రధానోపాధ్యాయుడు. ఆ రోజు సాయంత్రం విద్యార్థుల్లో నలుగురు పాఠశాల మైదానంలో చిత్తుకాగితాలన్నీ ఏరి ఓ చోట చేర్చారు. మర్నాడు పాఠశాల ఆవరణ చూసి ప్రధానోపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు. ప్రార్థనా సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా దేశభక్తిలో భాగమే. ఈ పని ఎవరు చేశారో ఈ స్టేజ్‌ మీదకు రండి’ అని పిలిచారాయన.

ఆ నలుగురు విద్యార్థులు స్టేజిపైకి వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు వారిని అభినందించారు. ‘మీకెందుకు ఈ పని చేయాలనిపించింది?’ అని అడిగారు. ‘నిన్న గ్రౌండ్‌లో సోముకు ప్లాస్టిక్‌ డబ్బా కొన గుచ్చుకుంది. గాయమై రక్తం కూడా వచ్చింది. కొందరు చేసిన నిర్లక్ష్యపు పనికి ఇంకొందరు శిక్ష అనుభవించడంతో బాధపడ్డాం. గ్రౌండ్‌ శుభ్రం చేస్తే అందరికీ బాగుంటుందని ఆలోచించి ఈ పని చేశాం’ అని చెప్పాడు అందులో ఓ విద్యార్థి. ‘కొద్దిపాటి నిర్లక్ష్యం కొండంత అనర్థాలకు మూలం. అటువంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా దేశభక్తే’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడు.

ఇంకా అందరికీ ఉపయోగపడే పనులు ఏమున్నాయి. తరగతి గదుల్లో ఖాళీ పీరియడ్లలో చర్చ జరుగుతోంది. మర్నాడు కొంతమంది విద్యార్థులు మొక్కలు నాటి వాటి చుట్టూ కంచె వేయడం ప్రధానోపాధ్యాయుడి కంటపడింది. వాళ్ల దగ్గరికి వెళ్లి.. ‘మంచి పనే చేస్తున్నారు’ అని మెచ్చుకున్నారు. ‘అందరికీ ఉపయోగపడే పనుల్లో ఇదొకటి అని సైన్స్‌ పాఠాల ద్వారా నేర్చుకున్నాం’ అని చెప్పాడో విద్యార్థి. ఇది కూడా దేశభక్తేనన్నారు ప్రధానోపాధ్యాయుడు. ఇంతలో కొంతమంది విద్యార్థులు వంద రూపాయల నోటు దొరికిందని ప్రధానోపాధ్యాయుడికి ఇచ్చారు. సాయంత్రం జరిగే పాఠశాల సమావేశంలో దొరికిన వంద రూపాయల నోటు గురించి చెబుతూ.. ‘ఇది ఎవరిది?’ అని అడిగారు.

ఏడుపుతో ఎరుపెక్కిన కళ్లతో నీలిమ ముందుకు వచ్చింది. ‘మందులు కొనమని మా నాన్న ఇచ్చారు. డబ్బులు పోయినప్పటి నుంచి తరగతి గదిలో పాఠాలు కూడా అర్థం కావడం లేదు’ అని బోరున ఏడ్చింది. డబ్బులు దొరికిన విద్యార్థులను స్టేజి పైకి పిలిచి వాళ్లతో నీలిమకు ఇప్పించారు ప్రధానోపాధ్యాయుడు. వందరూపాయల నోటు అందుకుంటూ  ‘థాంక్యూ ఫ్రెండ్స్‌.. మీ నిజాయతీతో మా నాన్నగారికి అవసరమైన మందులు కొనుక్కొనే అవకాశం కల్పించారు’ అంది. నిజాయతీగా బతకడం కూడా దేశభక్తే అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడు.

‘మంచి పనులు చేసిన వారందరూ దేశభక్తులే అంటున్నారు.. కానీ, మా విద్యార్థుల్లో నిజమైన దేశభక్తుడెవరో తేల్చి చెప్పాల్సిందే’ అని పట్టుబట్టారు విద్యార్థులు. ‘అలాగే... తప్పకుండా’ అంటూ హామీ ఇచ్చారు ప్రధానోపాధ్యాయుడు. ఆగస్టు పదిహేను రానే వచ్చింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జెండాను ఎగుర వేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడి సందేశం ప్రారంభం అయ్యింది.

‘ప్రియమైన విద్యార్థులారా! బాల్యంలో దేశభక్తికి బీజాలు పడితే రేపటి భారతం స్వర్ణ భారతంగా నిలుస్తుంది. మన పాఠశాలలో విద్యార్థులందరూ తమ చేతలతో దేశభక్తులుగా నిరూపించుకున్నారు. ఇలా మసలుకుంటే ఉత్తమ పౌరులుగా భరతమాత రుణం తీర్చుకున్న భారతీయులుగా మిగులుతారు. మీ అందరికీ బహుమతిగా పాఠశాలలో గ్రంథాలయాన్ని గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఇలా గ్రామస్థులు కూడా తమ దేశభక్తి చాటుకున్నారు. ఇక విద్యార్థుల్లో నిజమైన దేశభక్తుడి గురించి తెలియజేయాలన్నారు కదా.. విద్యార్థి దశలో సమయపాలనే నిజమైన దేశభక్తి. అటువంటి సమయపాలన పాటిస్తూ అన్నిరోజులూ పాఠశాలకు హాజరైన ఉత్తమ విద్యార్థి రవినే నిజమైన దేశభక్తుడిగా ప్రకటిస్తున్నాను’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. రవిని విద్యార్థులందరూ అభినందించారు.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని