వాయిదా వద్దు.. వెనకబడొద్దు!

రాము ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ చదువులో ముందుండే తను ఈమధ్య ఎందుకో వెనకబడుతున్నాడు. ఉపాధ్యాయులకూ కారణం తెలియకపోవడంతో, రాముని పిలిచి ప్రశ్నించారు.

Updated : 16 Aug 2023 04:02 IST

రాము ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ చదువులో ముందుండే తను ఈమధ్య ఎందుకో వెనకబడుతున్నాడు. ఉపాధ్యాయులకూ కారణం తెలియకపోవడంతో, రాముని పిలిచి ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా.. ‘రేపటి నుంచి బాగా చదువుతాను సార్‌.. ఈసారి తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుంటా’ అని జవాబిచ్చేవాడు. అయినా రాములో మార్పు రాకపోవడంతో, విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లింది. మరుసటి రోజే రాము తండ్రికి ఫోన్‌ చేసి పిలిపించారు. ఆయన స్కూల్‌కి రాగానే.. ‘మా రాము ఏమన్నా తప్పు చేశాడా?’ అని ప్రశ్నించారు. లేదన్నారు తరగతి ఉపాధ్యాయుడు. ‘మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? మార్కులు ఎలా వస్తున్నాయి?’ అని మళ్లీ ప్రశ్నించారు.

ప్రధానోపాధ్యాయుడు ఆయనను ఉద్దేశించి.. ‘రాము మంచి పిల్లవాడు. బాగా చదువుతాడు. మార్కులు కూడా బాగానే వచ్చేవి. కానీ, అదంతా గతం. ప్రస్తుతం అతడు చదువులో వెనకబడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్‌ అవుతున్నాడు. మేం అడిగినప్పుడల్లా, ఇక నుంచి బాగా చదువుతానంటూ చెబుతున్నాడు కానీ, మారడం లేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది’ అన్నారు. ‘అలా అయితే.. మా అబ్బాయిలో మార్పు ఎలా తీసుకురావాలి?’ అని ప్రశ్నించారు ఆయన. ‘రాములో తప్పకుండా మార్పు వస్తుంది. మీరు కూడా ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాడో గమనించండి’ అన్నారు తరగతి ఉపాధ్యాయుడు. సరేనంటూ తిరిగి ఇంటికి వెళ్లిపోయాడాయన.
సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లగానే.. పుస్తకాల సంచిని బల్ల మీద పడేసి తల్లి దగ్గరకు వెళ్లాడు రాము. ‘అమ్మా.. నేను ఆడుకోవటానికి వెళ్తున్నా’ అన్నాడు. ‘నీకోసం జంతికలు చేశాను. తిని వెళ్లు’ అందామె. ‘వచ్చాక తింటానమ్మా..’ అంటూ బయటకు పరిగెత్తాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒళ్లంతా చెమటలతో ఇంటికొచ్చాడు. గబగబా స్నానం చేసి వచ్చి.. ‘అమ్మా.. ఆకలేస్తుంది’ అన్నాడు. ఆమె వచ్చి అన్నం, కూర కలిపి తినిపించింది. ‘జంతికలు కావాలా?’ అని అడిగితే.. ‘వద్దమ్మా.. ఇక పడుకుంటా’ అని జవాబిచ్చాడు.

‘అదేంటి.. కాసేపైనా చదువుకో.. ఈమధ్య నువ్వు స్నేహితులపై చూపిస్తున్న శ్రద్ధ చదువు మీద లేదు. స్కూల్‌ నుంచి వచ్చాక అసలు పుస్తకాలే తీయడం లేదు. ఏమైనా అంటే రేపట్నుంచంటూ వాయిదా వేస్తున్నావు. ఇలాగైతే చదువులో వెనకబడతావు’ అని మందలించిందామె. ‘రేపట్నుంచి కచ్చితంగా చదువుతానమ్మా’ అంటూ మంచం ఎక్కాడు. ఆ మాటలు తండ్రి చెవిన పడ్డాయి. ఆటల్లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయనకు అర్థమైంది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఓ ఆలోచనకొచ్చారు.

ఉదయాన్నే లేచిన రాము.. స్నానం చేసి రాగానే దుస్తుల కోసం అమ్మ దగ్గరకు వెళ్లాడు. ‘వర్షం పడటంతో దుస్తులు ఆరలేదు. నిన్న వేసుకున్నవే ఈరోజు కూడా వేసుకో’ అని అందామె. ‘అదేంటమ్మా.. నిన్నటివే ఈరోజు ఎలా వేసుకుంటారు?’ అని ప్రశ్నించాడు. ఈ ఒక్కరోజు ఎలాగోలా వేసుకో.. రేపు చూద్దాం’ అని నచ్చజెప్పిందామె. రాము అయిష్టంగా వేసుకున్నాడు. ఆ తర్వాత ‘అమ్మా.. ఆకలేస్తుంది.. టిఫిన్‌ పెట్టు’ అని అడిగాడు. ‘ఈ పూట టిఫిన్‌ చెయ్యలేదు. రాత్రి చద్దన్నం కంచంలో కలిపి పెట్టాను.. తిను’ అని అమ్మ చెప్పడంతో.. ‘చద్దన్నం నేను తిననని నీకు తెలుసు కదా..’ అన్నాడు అయిష్టంగా. ‘ఎలాగోలా సర్దుకో.. రేపట్నుంచి చూద్దాం’ అని మళ్లీ అదే జవాబిచ్చింది తల్లి. ఏదో రెండు ముద్దలు తిని స్కూలుకి బయలుదేరాడు రాము.

మధ్యాహ్నం భోజనం చేద్దామని బాక్సు తెరిస్తే, ఉదయం తిన్న అన్నాన్నే అమ్మ మళ్లీ బాక్సులో సర్దింది. అది చూడగానే అమ్మ మీద కోపం వచ్చింది. అన్నం తినాలనిపించలేదు. సాయంత్రం ఆ బాక్సును అలాగే తీసుకొచ్చి అమ్మ ముందుంచాడు. ‘అమ్మా.. ఈరోజు నీలో ఏదో మార్పు కనబడుతుంది. ఉతికిన దుస్తులు అడిగితే మాసినవే వేసుకోమన్నావు. నాకు చద్దన్నం ఇష్టం లేదని తెలిసినా, అదే పెట్టావు. మధ్యాహ్నం బాక్సులో కూడా అదే పెట్టావు. ఏదన్నా అంటే రేపట్నుంచి చూద్దాం అంటున్నావు. నీ గురించి నాన్న వచ్చాక చెబుతాను’ అన్నాడు కోపంగా. ఇంతలో రాము వాళ్ల నాన్న ఇంట్లోకి వచ్చారు. ‘ఏంటి.. రామూ.. అమ్మతో గొడవ పడుతున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా నాన్నకు వివరించాడు రాము.

తండ్రి కొడుకుని దగ్గరకు తీసుకుని.. ‘రామూ.. నీకు నచ్చనివి ఒక్కరోజు చేస్తేనే తట్టుకోలేకపోయావు. అంత బాధపడ్డావు. కోపం కూడా వచ్చింది. పైగా అమ్మ మీద నాకు ఫిర్యాదు చేశావు. మరి నువ్వు ప్రతిరోజు చదవకుండా, రేపు చూద్దాంలే.. అని వాయిదా వేయడం మంచి పద్ధతేనా? ఏ రోజు దుస్తులు ఆరోజే వేసుకోవాలని, అన్నం కూడా వేడిదే కావాలనడం తెలిసిన నీకు.. ఏరోజు పాఠాలు ఆరోజే చదువుకోవాలని తెలియదా? అలా వాయిదా వేసుకుంటూ పోతే.. పరీక్షల సమయానికి నీకు భారం కాదా? మార్కులు తక్కువ వస్తే, నీతోపాటు మేము కూడా ఎంత బాధపడతామో ఒకసారి ఆలోచించు. అందుకే, ఇప్పటినుంచైనా వాయిదా వేయకుండా తరగతిలో చెప్పిన అంశాలను సాయంత్రం రాగానే ఒకసారి చదువుకో. ఆ తర్వాత వెళ్లి ఆడుకో..’ అని అర్థమయ్యేలా వివరించారు.

తాను చేసిన తప్పేంటో రాముకి అర్థమైంది. ఇకనుంచి చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండనని, ఏరోజు పాఠాలు ఆరోజే చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని అమ్మానాన్నకు మాటిచ్చాడు. తల్లి అప్పుడే వండిన అన్నం తీసుకురావడంతో.. తండ్రి ముద్దలు చేసి తినిపించాడు. రాములో వచ్చిన మార్పు చూసి వారు ఎంతో సంతోషించారు.  

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని