‘నేను పెద్దయ్యాక ఏమవుతానంటే...!’

‘అమ్మా! పెద్దయ్యాక నేను క్రికెటర్‌నవుతా’ టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ అన్నాడు తేజ. ‘లా’ పుస్తకాలు తిరగేస్తున్న వాళ్లమ్మ జయలక్ష్మి అతడి వంక ఏమిటన్నట్టుగా చూసింది.

Updated : 17 Aug 2023 03:40 IST

‘అమ్మా! పెద్దయ్యాక నేను క్రికెటర్‌నవుతా’ టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ అన్నాడు తేజ. ‘లా’ పుస్తకాలు తిరగేస్తున్న వాళ్లమ్మ జయలక్ష్మి అతడి వంక ఏమిటన్నట్టుగా చూసింది. ‘నేను క్రికెటర్‌నవుతా అంటున్నా’ మళ్లీ చెప్పాడు. అది విని టీవీ వైపు, అతని వైపు చూసి నవ్వింది జయలక్ష్మి. ‘అమ్మ ఎప్పుడూ ఇంతే’ అనుకున్నాడు తేజ.
ఆ రోజు చంద్రయాన్‌- 3 ప్రయోగం సందర్భంగా టీవీలో లైవ్‌ వస్తోంది. అది చూస్తున్న తేజ, అమ్మానాన్నలతో.. ‘నేను కూడా పెద్ద సైంటిస్ట్‌ అవుతాను’ అన్నాడు. అది విని ‘చదువు మీద శ్రద్ధ పెట్టవోయ్‌ ముందు’ అన్నాడు నాన్న నరహరి. అమ్మ ఎప్పటిలాగే నవ్వింది. ‘వీళ్లెప్పుడూ ఇంతే’ అని చిరుకోపంతో మూతి ముడుచుకున్నాడు తేజ.
‘అమ్మా అమ్మా...! ఈ రోజు మా స్కూళ్లో ఆరోగ్య పరీక్షలు చేశారు. నేను బరువు సరిగ్గానే ఉన్నా, ఎత్తు కొంచెం పెరగాలన్నారు. ఆ డాక్టర్‌ అంకుల్‌ మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని ఎంత స్టైల్‌గా ఉన్నారో తెలుసా! నేను కూడా పెద్దయ్యాక డాక్టర్‌నవుతా’ అన్నాడు తేజ. ఎప్పటిలానే అమ్మ నవ్వింది.

‘ఎందుకు నవ్వుతున్నావమ్మా?’ అని కాస్త కోపంగా అడిగాడు తేజ. ‘స్టైల్‌గా ఉన్నారన్నావని..’ సమాధానం ఇచ్చింది అమ్మ. ‘కాదా మరి!’ అన్నాడు తేజ. ‘స్టైల్‌ అనుకుంటే చాలా పొరపాటు. అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేసి, వాళ్లు కోలుకునేలా చేసే డాక్టర్లు దేవుళ్లతో సమానం. మెడిసిన్‌ చదవడం ఆషామాషీ కాదు. దాని మీద శ్రద్ధ, ఇష్టంతో.. కొన్నేళ్లపాటు కష్టపడి చదవాల్సి ఉంటుంది. సైన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంటర్‌ పాసయ్యాక జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో మంచి ర్యాంక్‌ రావాలి. సీటు సాధించాలి. ఆరేళ్ల పాటు పట్టుదలగా చదవాలి. డాక్టర్‌ అయ్యాక నిరంతరం రోగులకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. అప్పుడే మంచి వైద్యులు అవుతారు’ అందామె.

‘అమ్మో.. అంత కష్టపడాలా’ అన్నాడు తేజ. ‘అవును.. నువ్వు ప్రముఖులు ఎవరిని చూస్తే వారిలా కావాలనుకుంటున్నావు. క్రికెట్‌ చూస్తే క్రికెటర్‌, సైంటిస్ట్‌ను చూస్తే సైంటిస్ట్‌, డాక్టర్‌ను చూస్తే డాక్టర్‌... నీ వయసులో అలా అనిపించడం సహజమే. కానీ నిజంగా నీకు దేని మీద ఆసక్తి ఉందో ముందు తెలుసుకోవాలి. చదువులోనూ నీకు ఏ సబ్జెక్టులంటే ఎక్కువ ఆసక్తి ఉందో, ఎందులో మార్కులు ఎక్కువ వస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏ రంగంలో ముందుకు వెళ్లాలో నిర్ణయించుకోవాలి’ అని చెప్పింది అమ్మ.
వెంటనే తేజ... ‘అమ్మా...! నాకో సంగతి చెప్పు, నువ్వు లాయర్‌ ఎలా అయ్యావు?’ అని అడిగాడు. ‘‘మంచి ప్రశ్న అడిగావు. చిన్నప్పుడు మా నాన్న ఆస్తి విషయంలో ఘోరంగా మోసపోయారు. కోర్టుల చుట్టూ తిరగాలంటే డబ్బు లేదు. మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ‘నువ్వు లాయర్‌ అయి పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలి’ అని అమ్మమ్మ నాతో అనేది. అప్పటి నుంచే నాకు లా మీద ఆసక్తి పెరిగింది. పట్టుదలగా చదివాను, సాధించాను’ అని చెప్పింది జయలక్ష్మి. ‘మరి నేను?’ అన్నాడు తేజ. ‘చూద్దాం. నువ్వింకా ఆరో తరగతే కదా. నీ ఆసక్తిని బట్టి చదవొచ్చు. ఇప్పుడు చదవడానికి ఇంకా అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముందు శ్రద్ధగా చదువు’ అంది అమ్మ. ‘సరే అమ్మా’ అంటూ ఆరోజు బుద్ధిగా వెళ్లి, శ్రద్ధగా హోం వర్క్‌ చేశాడు తేజ.

ఈ మధ్య తేజకు బొమ్మల మీద ఆసక్తి పెరిగింది. చాలా బాగా గీస్తుండటంతో అంతా మెచ్చుకుంటున్నారు. స్కూల్లో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులూ సాధించాడు. వాళ్లమ్మ అది గమనించి.. రంగు పెన్సిళ్లు, పెన్నులు, పోస్టర్‌ కలర్స్‌, డ్రాయింగ్‌ టెక్నిక్‌లు తెలిపే పుస్తకాలు, రకరకాల షీట్లు కొనిచ్చింది. తేజ మరింత ఉత్సాహంగా బొమ్మలు వేయసాగాడు. పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సొంతం చేసుకుంటున్నాడు. పదో తరగతికి వచ్చేసరికి తేజ, తాను ఆర్టిస్ట్‌ కావాలనే గట్టి నిర్ణయానికి వచ్చాడు. అమ్మకు కూడా అదే చెప్పాడు. ఈసారి అమ్మ నవ్వలేదు. ‘అలాగే.. నీకు పెయింటింగ్‌ ఇష్టమైతే, బాగా ప్రాక్టీస్‌ చేసి నైపుణ్యాలు సాధించు. ఆసక్తి ఉంటే కష్టం కూడా ఇష్టమవుతుంది. నిన్ను ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరుస్తాం. నువ్వు తప్పక పెద్ద చిత్రకారుడివి అవుతావు’ అంది కొడుకు భుజం తడుతూ. తేజ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు