కన్నయ్యకు వెండి కిరీటం!

అనగనగా ఒక ఊరు. ఊరి మధ్యన శ్రీకృష్ణుడి గుడి. అందమైన శ్రీకృష్ణుడి విగ్రహానికి నెమలి పింఛంతో కూడిన వెండి కిరీటం చేయిస్తే బాగుంటుందని గుడి పూజారికి అనిపించింది.

Updated : 18 Aug 2023 03:54 IST

నగనగా ఒక ఊరు. ఊరి మధ్యన శ్రీకృష్ణుడి గుడి. అందమైన శ్రీకృష్ణుడి విగ్రహానికి నెమలి పింఛంతో కూడిన వెండి కిరీటం చేయిస్తే బాగుంటుందని గుడి పూజారికి అనిపించింది. అదే విషయం భార్యకు చెప్పాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. ‘అయితే వెండి కిరీటం అంటే మాటలు కాదు కదా! దానికి ఎంతో డబ్బు కావాలి. ఏమి చేస్తే డబ్బులు పోగవుతాయి?’ అని ఆలోచనలో పడ్డారా దంపతులు.  

‘ఊళ్లో వాళ్లను అడిగి చూద్దాం. కొంతమందైనా ఇవ్వక పోతారా...?’ అని భార్యాభర్తలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా ఇంటింటికీ వెళ్లి... ‘దైవకార్యం తలపెట్టాం. తలా ఒక చేయి వేయండి’ అని డబ్బు అడిగారు.

చాలా వరకు రైతులైన ఆ గ్రామస్థులు... ‘మాకు దేవుడి మీద భక్తి లేక కాదు. ఈసారి పంటలు పండటమే అంతంతమాత్రం. మేం ఎక్కడి నుంచి తెచ్చి మీకు డబ్బు ఇవ్వగలం చెప్పండి?’ అని తమ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఎంతో ఆశ పడిన ఆ దంపతులు ఈ సమాధానాలతో బాగా నిరాశ చెందారు.

పక్కనుండే ఊళ్లకు వెళ్లి అడుగుదామని అనుకున్నారు. ‘మన ఊళ్లో వాళ్లే ఇవ్వలేకపోయారు. వేరే ఊరి వాళ్లు ఎందుకు విరాళాలు ఇస్తారు?’ అని పక్క ఊళ్లకు వెళ్లడం వృథా ప్రయాసే అవుతుందని ఆ ప్రయత్నం మానుకున్నారు. ‘అయినా ఇది మన వల్ల అయ్యే పని కాదులే!’ అని ఓ నిర్ణయానికి వచ్చారు.

‘ఇలా జరిగిందేమి భగవంతుడా...!’ అనుకుంటూ బాధగా ఇంటికి వెళ్లారు. పదో తరగతి చదువుతున్న వాళ్ల కూతురు అర్పిత, అరుగు మీద పాత నోటు పుస్తకాలను ముందర వేసుకుని కూర్చుని ఉంది. అమ్మానాన్నలు దిగులుగా ఉండటం చూసి కారణమేంటని అడిగింది. అమ్మ అన్ని విషయాలూ వివరంగా చెప్పింది.

అర్పిత చిన్నగా నవ్వుతూ... ‘నేను చేస్తున్నట్లే మీరు ఎందుకు చేయకూడదు?’ అని అడిగింది. ‘నువ్వేం చేస్తున్నావు?’ అని అర్పితను అమ్మ ఎదురు ప్రశ్న వేసింది. ‘మీరు చూడలేదా...! పాత నోటు పుస్తకాల్లోని వాడని కాగితాలను వేరు చేసి, వాటిని కుట్టి కొత్త నోటు పుస్తకంలా తయారు చేసుకుంటున్నాను. దీంతో ఆదాకు ఆదా, నా పనీ పూర్తవుతుంది’ అని చేతులు తిప్పుతూ చెప్పింది. ‘దీనికీ, మేం చెప్పిన దానికి సంబంధం ఏంటి?’ అని అడిగింది అమ్మ. ‘అమ్మా... రైతుల దగ్గర డబ్బులెక్కడ ఉంటాయి. పంట చేతికి వచ్చినప్పుడే కదా.. అందుకే, వాళ్ల మనసులో ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నారు. మీరు డబ్బులు కాకుండా పాత వెండి ఇవ్వమని అడిగి చూడండి. చాలామంది ఇళ్లలో ఉపయోగించని వెండి వస్తువులు, దీపాలు, గిన్నెలు దండిగా ఉంటాయి. పెద్దగా ఉపయోగపడని వాటిని మనకు తప్పక ఇస్తారు. మనకు కావాల్సింది వెండే కదా, డబ్బు కాదు కదా. వారిచ్చిన వెండిని కరగదీసి మనం కృష్ణుడికి కిరీటం చేయించవచ్చు కదా!’ అని సలహా ఇచ్చింది.

చిట్టితల్లి మంచి ఆలోచన చెప్పిందని భావించి, మరుసటి రోజే ఊరంతా తిరిగారు. వెండి కిరీటానికి ఇంట్లోని పాత వెండి వస్తువులు ఉంటే ఇవ్వమని అడిగారు. సంతోషంగా ఇవ్వగలిగినంత వెండి ఇచ్చారు గ్రామస్థులు. పూజారి దంపతులకు ధైర్యం వచ్చింది. అలాగే పక్కనున్న ఊళ్లకు కూడా వెళ్లారు. వాళ్లు సైతం ఉడుతా భక్తిగా తమకు తోచింది ఇచ్చారు. దానికి హుండీ డబ్బు కొంత చేర్చి మిలమిలలాడే వెండి కిరీటం చేయించి శ్రీకృష్ణుడి విగ్రహానికి అలంకరించారు. ఊళ్లో వాళ్లందరూ అర్పిత తెలివికి అభినందనలు తెలిపారు.  

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని