నేర్చుకుంటే నష్టం లేదు!

కోరుపల్లెలో విజయుడు అనే యువకుడు చాలా తెలివైనవాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఊరిలోనే పాఠశాల విద్య పూర్తి చేసి, చిన్న చిన్న కూలి పనులకు వెళ్తుండేవాడు.

Updated : 20 Aug 2023 05:11 IST

కోరుపల్లెలో విజయుడు అనే యువకుడు చాలా తెలివైనవాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఊరిలోనే పాఠశాల విద్య పూర్తి చేసి, చిన్న చిన్న కూలి పనులకు వెళ్తుండేవాడు. ఒకరోజు దూరపు బంధువు ఏదో పని మీద విజయుడి ఇంటికి వచ్చాడు. అతడి సమయస్ఫూర్తి చూసి.. ‘నీ తెలివిని ఇక్కడే వృథా చేయకు. రాజధాని నగరానికి వెళ్తే, రాజాస్థానంలో నీకు తప్పక కొలువు దొరుకుతుంది’ అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు నిజమేననిపించడంతో రెండ్రోజుల తర్వాత రాజధానికి బయలుదేరాడు.
దారిలో ఓ పాక దగ్గర ఆగాడు విజయుడు. అక్కడ ఓ ముసలమ్మ తాటి ఆకులతో బుట్టలు అల్లుతోంది. పనిలో ఆమె వేగం చూసి ఆశ్చర్యపోయాడతను. ‘అవ్వా.. నా దగ్గర తినడానికి రొట్టెలు ఉన్నాయి.. కొద్దిగా మంచినీరు ఇస్తావా?’ అని అడిగాడు. ఆమె నవ్వుతూ ఓ ముంతతో మంచి నీరు తెచ్చి ఇచ్చి మరలా తన పనిలో మునిగిపోయింది. ‘అవ్వా.. నువ్వు అల్లే ఈ బుట్టలు దేనికి?’ అని అడిగాడు. ‘వీటిని చెట్లు కాపు కాసినపుడు ఆ కాయలకు తొడుగుతారు. ఇక చిలుకలు, పిట్టల బాధ ఉండదు’ అని చెప్పిందామె. ‘అలాగా.. నాకూ బుట్టలు అల్లడం నేర్పవా?’ అని అడిగాడు విజయుడు. సరేనంటూ తాటి ఆకులతో ఆ చిన్న చిన్న బుట్టలు అల్లడం నేర్పించింది అవ్వ. ఇక అక్కడి నుంచి బయలుదేరాడతను.
మరో ఊరు దాటాక.. ఒకచోట కొలిమిలో కత్తులు, బాణాలు తయారు చేయడం కనిపించింది. ఆ పని నేర్చుకోవాలనే తపనతో.. వారి దగ్గరకు వెళ్లి అడిగాడు. ‘బాబూ.. ఇది చాలా కష్టమైన పని’ అన్నారు. ‘ఫర్వాలేదు..’ అంటూ అక్కడే పనికి కుదిరాడు. శ్రద్ధతో వారం రోజుల్లోనే పని నేర్చుకున్నాడు. ఆ సామగ్రిని తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. ఆ కత్తులను పరీక్షిస్తూ.. వారు చేసిన విన్యాసాలను చూసి, తనకూ నేర్పమన్నాడు విజయుడు. ‘ఇవి ఒక్కరోజులో వచ్చేవి కాదు. నువ్వు మావెంట వచ్చి, వ్యాయామశాలలో కొంత కాలం నేర్చుకుంటే వస్తాయి’ అని చెప్పారు. ఆ కొలిమి దగ్గర సెలవు తీసుకుని వారితో పాటు వెళ్లాడు విజయుడు.
వ్యాయామశాలలో చిన్న చిన్న పనులు చేస్తూ వారి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు. ‘ఇప్పుడు నాకంటూ కొన్ని విద్యలు వచ్చు. రాజు గారిని పని అడగడానికి ఏదో ఒక అర్హత సాధించాను’ అని మనసులోనే అనుకున్నాడు. వ్యాయామశాలలో వారికి ధన్యవాదాలు తెలిపి, రాజధానికి పయనమయ్యాడు. రెండు రోజులైనా విజయుడికి రాజు దర్శనం దొరకలేదు. ఏం చేయాలో తెలియక.. పరధ్యానంలో కోట పక్కనే ఉన్న తోటలోకి అడుగు పెట్టాడు. అది రాజు గారి ఉద్యానవనం. అదే సమయంలో మహారాజు తోటలో విహరిస్తూ.. ‘అయ్యో.. పచ్చి కాయలను అనవసరంగా పిట్టలు కొట్టేస్తున్నాయే..’ అన్నాడు.
అక్కడే ఉన్న విజయుడు ఆ మాటలు విని.. ‘అయ్యా వాటికి బుట్టలు కడితే, పిట్టలతో బాధ ఉండదు’ అన్నాడు. ఒకరికొకరు తెలియకపోయినా.. ‘అదెలా?’ అని అడిగాడు రాజు. దాంతో తన దగ్గరున్న చిన్న కత్తితో పక్కనే ఉన్న తాటాకులతో చిన్న బుట్టలు అల్లి, రెండు కాయలకు కట్టాడు విజయుడు. ఇలా తేలికగా అన్నీ కాయలకు కట్టవచ్చన్నాడు. ఇంతలోనే భటులు వచ్చి విజయుడిని బంధించారు. ‘రేపు ఆస్థానానికి రా.. అక్కడ మాట్లాడదాం’ అన్నాడు రాజు. అప్పటికి కానీ ఆయన రాజు అని తెలియలేదు విజయుడికి. దాంతో ఆయనకు నమస్కరించి బయటకు వచ్చాడు.
ఆ రోజుకు అక్కడకు దగ్గరలో ఉన్న సత్రంలో బస చేశాడు. అర్ధరాత్రి వేళ ఏదో గొడవ జరుగుతుంటే అతడికి మెలకువ వచ్చింది. చూస్తే కొందరు దుండగులు అక్కడే బస చేసిన వ్యాపారి నుంచి సొత్తును లాక్కోసాగారు. తనకు తెలిసిన యుద్ధవిద్యలతో విజయుడు వాళ్లను తరిమేశాడు. ‘చాలా మంచి పని చేశావు. నేనొక నగల వ్యాపారిని. మహారాజుకు ఒక హారం కావాలంటే పట్టుకొచ్చాను. చీకటి పడడంతో రేపు ఉదయం రాజదర్శనం చేసుకుందామని ఇక్కడ బస చేశాను’ అని చెప్పాడతను. అప్పుడే అక్కడికి చేరుకున్న సైనికులు విజయుడిని అభినందించారు.
మరుసటి రోజు ఇద్దరూ సభలో రాజు గారిని కలిశారు. ముందురోజే విజయుడి ప్రతిభ, వ్యాపారి విషయంలో ధైర్యాన్ని చూసిన రాజు.. తన కోటలోనే ఉద్యోగం ఇచ్చాడు. కొత్త విషయాలు నేర్చుకోవడమే తనకు కలిసొచ్చిందని విజయుడు సంతోషించాడు.

 కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని