నిజం నిప్పులాంటిది!

ఒక అడవిలో కేసరి అనే పేరు గల మృగరాజు తన పుట్టినరోజును పురస్కరించుకుని అన్ని జంతువులకు వివిధ కానుకలు అందజేయాలని అనుకుంది.

Published : 21 Aug 2023 00:03 IST

ఒక అడవిలో కేసరి అనే పేరు గల మృగరాజు తన పుట్టినరోజును పురస్కరించుకుని అన్ని జంతువులకు వివిధ కానుకలు అందజేయాలని అనుకుంది. కోతులకు మాత్రం వాటి కోరికపై ఆ వేసవిలో ఎండ తగలకుండా కొత్త టోపీలను పంపిణీ చేద్దామని నిర్ణయించుకుంది. దాని పుట్టినరోజు రానే వచ్చింది. అది అనుకున్న ప్రకారం ఆ టోపీలను తెచ్చి అన్ని కోతులను పిలిచింది. అవన్నీ వరుసగా నిలబడి ఒక్కొక్క టోపీని తీసుకొనసాగాయి.

మర్కటం అనే పేరు గల కోతి కూడా ఒక టోపీని తీసుకొంది. కానీ అది దాన్ని దాచిపెట్టి అత్యాశతో తిరిగి వచ్చి, మరొక టోపీని కూడా తీసుకొంది. ఇది తిమ్మన్న అనే పేరు గల కోతి గమనించింది. ఒక్కొక్క కోతి ఒక టోపీ మాత్రమే తీసుకోవాలని, వాటిపై తమ పేర్లు కూడా ఎలుగుబంటితో రాయించుకోవాలని సింహం వాటిని ఆదేశించింది.
మర్కటం రెండోసారి తీసుకున్న టోపీపై తన పేరును రాయించుకుంది. మొదటి సారి తాను తీసుకున్న టోపీపై పేరును రాయించకుండా దాచిపెట్టి వచ్చింది. అదే సమయంలో సింహం బిడ్డ పెళ్లి నిశ్చయమైంది. అది తను ఇచ్చిన కొత్త టోపీలను అన్ని కోతులు విధిగా తలపై ధరించి తన బిడ్డ వివాహానికి రావాలని ఆదేశించింది.
వానరం అనే పేరు గల మరొక కోతి, సింహం బిడ్డ పెళ్లికి వెళుతూ త్వరగా వెళదామని మర్కటాన్ని రమ్మని తొందర పెట్టింది. మర్కటం ఆ తొందరలో తాను ముందు తీసుకున్న పేరు రాయించని టోపీని తలపై హడావుడిగా ధరించి సింహం బిడ్డ పెళ్లికి వెళ్లింది.

అక్కడ సింహం దాని టోపీని చూసింది. దానిపై పేరు లేకపోవడంతో ఆ మర్కటాన్ని ప్రశ్నించింది. అప్పుడు మర్కటం కంగారుపడి... ‘ఎలుగుబంటి వేయలేదు. నేనేం చేయాలి?’ అంది. వెంటనే సింహం అక్కడ ఉన్న ఎలుగుబంటిని పిలిచి, దీని టోపీపై  మర్కటం అని పేరు ఎందుకు రాయలేదని ప్రశ్నించింది. తనను అడిగిన అందరి టోపీలకు పేర్లు వేశానని ఎలుగుబంటి చెప్పింది.

అప్పుడే వచ్చిన తిమ్మన్న... ‘మృగరాజా! ఈ మర్కటం ఒక టోపీని అదనంగా తీసుకుంది. అది నేను చూశాను. ఇది ఆ టోపీకి తన పేరును కూడా వేయించుకోలేదు. మీకు ఆ సంగతి అప్పుడే చెబుదామంటే మీరు అక్కడ లేరు. ఇది రెండు టోపీలు తీసుకుంది’ అని చెప్పింది.

వెంటనే మర్కటం తెలివిగా... ‘మృగరాజా! నేను రెండు టోపీలు తీసుకోనే లేదు. ఈ తిమ్మన్న అన్నీ అబద్ధాలు చెబుతోంది. అనవసరంగా నా మీద నింద మోపుతోంది’ అని అంది. వెంటనే సింహం... ‘నువ్వు పెట్టుకున్న ఈ టోపీ అదనంగా తీసుకెళ్లినదేనా? దీనిపై నీ పేరు ఎందుకు లేదు?’ అని మర్కటాన్ని గద్దించింది. ‘ఇది నాకు పక్క అడవి సింహం బహుమానంగా ఇచ్చింది మృగరాజా!’ అని మర్కటం మరో అబద్ధం చెప్పింది. వెంటనే ఎలుగుబంటి ఆ టోపీ తీసుకుని లోపల ఉన్న పేరును పరిశీలించింది.

అందులో... ‘కేసరి జన్మదిన కానుక’ అని ఉంది. వెంటనే ఎలుగుబంటి.. అది సింహానికి చూపిస్తూ.. ‘మృగరాజా! ఈ టోపీ పక్క అడవి సింహం ఇవ్వలేదు. ఇది అబద్ధాలు చెబుతోంది. ఇది ఒక్క అబద్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకే మరొక అబద్ధం ఆడింది. ఎందుకంటే దీని లోపల మీ పేరు స్పష్టంగా ఉంది. తాను తప్పించుకోవడానికి ఒకసారి నా పేరు, మరోసారి పక్క అడవి సింహం పేరును సాకుగా చెబుతోంది. దీని మాటలను బట్టి ఈ మర్కటమే అదనంగా రెండోది తీసుకుందని స్పష్టమవుతోంది’ అని అంది.
అప్పుడు మృగరాజు.. ‘నువ్వు ఆ టోపీని అత్యాశతో తీసుకొని పైగా అబద్ధమాడుతావా! అందరికీ టోపీలు రావాలనే కదా! నేను ప్రతి ఒక్కరూ, ఒక్కొక్క టోపీ తీసుకోమని చెప్పింది. అందుకే కదా పేరు రాయించుకొమ్మంది. టోపీ రానివారు ఎంత బాధపడతారో నీకు తెలియదా! పైగా ఆ తప్పును ఎలుగుబంటి పైకి, పక్క అడవి సింహం పైకి నెడుతున్నావు. నీలాంటి వారు కొందరు ఉచితంగా వస్తే అక్రమంగా రెండేసి తీసుకోవాలని చూస్తారు! అది చాలా తప్పు. అలా చేయడం నా ఆజ్ఞను ధిక్కరించడం కాదా! తిమ్మన్న మంచిది కనుక ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, నాకు చెప్పింది. ఇందుకు శిక్షగా నువ్వు ఈ అడవిని వదలి వెళ్లిపో’ అని అంది.

అప్పుడు మర్కటం కన్నీళ్లతో తన తప్పును అంగీకరించింది. మరోసారి తాను ఈ తప్పు చేయనని, తనను మన్నించమని అది సింహంతో మొరపెట్టుకుంది. తన తప్పును క్షమించమని తిమ్మన్నను, ఎలుగుబంటిని ప్రాధేయపడింది. వాటి కోరిక మేరకు మర్కటాన్ని సింహం క్షమించింది. ‘చేసిన తప్పు దాగదు. నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా అది బయట పడుతుందని అందరూ గ్రహిస్తే మంచిది’ అని చెప్పి సింహం, తన పనిలో తాను నిమగ్నమైంది. ఇంకెప్పుడూ మర్కటం తప్పు చేయలేదు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని