మంచి మిత్రుడు ఎవరు?

‘బంటీ.. బోలెడు మంది స్నేహితులు ఉన్నా అది గొప్ప కాదు. దేనికైనా నేనున్నానంటూ ముందుకొచ్చే మంచి మిత్రుడు ఒక్కరున్నా చాలు. అలాంటి వారు నీకెప్పుడూ తోడుగా ఉంటారు’ అని బిడ్డతో అంది తల్లి ఏనుగు. ‘అది సరేనమ్మా.. కానీ, మంచి మిత్రుడంటే ఎవరు?’ అని ప్రశ్నించింది బంటి.

Updated : 23 Aug 2023 06:48 IST

‘బంటీ.. బోలెడు మంది స్నేహితులు ఉన్నా అది గొప్ప కాదు. దేనికైనా నేనున్నానంటూ ముందుకొచ్చే మంచి మిత్రుడు ఒక్కరున్నా చాలు. అలాంటి వారు నీకెప్పుడూ తోడుగా ఉంటారు’ అని బిడ్డతో అంది తల్లి ఏనుగు. ‘అది సరేనమ్మా.. కానీ, మంచి మిత్రుడంటే ఎవరు?’ అని ప్రశ్నించింది బంటి. ‘అది నేను చెప్పడం కాదు.. ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి’ అని జవాబిచ్చింది తల్లి. ‘మంచి మిత్రుడు ఎవరూ?’ అని బంటి రోజంతా ఆలోచించింది. దానికే సమాధానమూ తట్టలేదు.

ఇక లాభం లేదనుకొని, మంచి మిత్రుడెవరో తెలుసుకునేందుకు మరుసటి రోజు ఉదయమే బయటకు వెళ్లింది. అలా వెళ్తుండగా.. అడవిలో ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు గెంతుతున్న ఒక కోతిని చూసింది. ‘ఓయ్‌ కోతీ.. నువ్వు నాతో స్నేహం చేస్తావా? మంచి మిత్రుడిగా ఉంటావా?’ అని అడిగింది బంటి. ‘చూడు బంటీ.. నీకు, నాకు తోకలో మాత్రమే పోలిక ఉంది. నీకు పెద్ద తొండం ఉంది. ఎప్పుడైనా నా మీద కోపం వస్తే దాంతో నన్ను విసిరి పారేస్తావు. నీతో స్నేహం నాకు సరిపడదు’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది కోతి. ఆ మాటలతో బంటి బాధపడింది.

ఇంతలో పొదలోకి వెళ్తున్న ‘హరితం’ అనే కుందేలుని పిలిచింది బంటి. ‘హరితం! నీకు, నాకు పోలిక లేదు. కానీ నువ్వు ముద్దుగా బాగున్నావు. నాతో స్నేహం చేస్తావా?’ అని అడిగింది. ‘బంటీ.. నువ్వు కూడా ముద్దుగానే ఉన్నావు కానీ, పెద్ద జంతువువి. నేనేమో చిన్న జీవిని. నీకు కోపం వచ్చిందనుకో.. నన్ను నీ కాలు కిందేసి తొక్కితే.. నా పని ఇక అంతే.. అందుకే నీకూ నాకూ సరిపడదు’ అంటూ అక్కడి నుంచి జారుకుంది. దాంతో బంటి మళ్లీ బాధపడింది. అలా వెళ్తూ ఉంటే.. భారీ వృక్షాలున్న ఒక ప్రదేశంలో.. కొన్ని జంతువులు కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాయి.

‘మిత్రులారా.. నా పేరు బంటి. మా అమ్మ మంచి మిత్రుడితో స్నేహం చేయమంది. మీలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా?’ అని అడిగిందది. వాటిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉంది. ‘బంటీ.. నీ ప్రశ్నకు జవాబు తరువాత చెప్తాను కానీ, నువ్వు మాతో ఆడతావా?’ అని అడిగిందది. ‘ఓ.. అలాగే ఆడతాను’ అని వాటితో కలిసిపోయింది గున్న ఏనుగు. ఇంతలో ఉన్నట్లుండి హరితం కనిపించకుండా పోయింది. చాలాసేపటి తర్వాత మిగతా జంతువులు ఆ విషయాన్ని గుర్తించి, చుట్టుపక్కల మొత్తం వెతకసాగాయి. కానీ, ఎక్కడా కుందేలు జాడను కనుగొనలేకపోయాయి.

దిగులుతో అన్నీ ఓ చెట్టు కింద చేరాయి. ఇంతలో ‘సహాయం చేయండి... కాపాడండి... కాపాడండి’ అంటూ కేకలు వినిపించాయి. అది హరితం గొంతేనని మిగిలిన జంతువులు గుర్తించి, ఆ కేకలు వచ్చిన దిశగా వెదుకుతూ వెళ్లాయి. కొంచెం దూరంలో వేటగాడి వలలో చిక్కిన హరితం కనిపించింది. అందరూ కంగారుగా అటువైపు వెళ్తుండగా.. దూరం నుంచి వేటగాడు వస్తున్న అలికిడి వినిపించింది. కుందేలును ఎలాగైనా రక్షించుకోవాలని జంతువులన్నీ ఓ ఉపాయం ఆలోచించాయి. ‘కొన్ని వేటగాడి దృష్టిని మరలిస్తే, ఇంకొన్ని జీవులేమో వలను కొరకాలి’ అని గుడ్లగూబ వాటికి సూచించింది.

గుడ్లగూబ చెప్పినదానికి జంతువులన్నీ సరేనన్నాయి. ఉడుత చెట్టు ఎక్కి వేటగాడిపైకి కాయలు విసరడం ప్రారంభించింది. అతడిని గందరగోళంలో పడేసేలా జింక అటూ ఇటూ పరిగెత్తసాగింది. పక్షులన్నీ తమ రెక్కలను వేగంగా ఆడిస్తూ.. చుట్టూ తిరగసాగాయి. ఇదంతా చూసి బంటి కూడా తొండం ఎత్తి ఘీంకారం చేసింది. అన్ని జంతువులు ఒకేసారి చుట్టుముట్టడంతో వేటగాడు భయంతోపాటు అయోమయానికి గురయ్యాడు. ఈలోగా ఎలుక చకచకా వలను కొరికేసి.. కుందేలును బయటకు తీసుకొచ్చింది.

కుందేలు తప్పించుకొని పోవడంతో.. వేటగాడి కోపం కట్టలు తెంచుకుంది. జంతువుల అంతు తేల్చాలనుకొని, ఆయుధాలు బయటకు తీయసాగాడు. కానీ, అప్పటికే అవన్నీ దాగుడుమూతలు ఆడిన చోటికి పరిగెత్తుకుపోయాయి. చేసేదిలేక వేటగాడు ఖాళీ చేతులతోనే వెనక్కి వెళ్లిపోయాడు. ‘కుందేలును రక్షించేందుకు అందరూ ఒక్కటయ్యారు.. అంటే మీరంతా మంచి మిత్రులు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. నాకు ఇలాంటి మిత్రులే కావాలి’ అంది బంటి ఆనందంగా..

‘బంటీ.. ఒకరు చెప్పిన దానికంటే స్వీయ అనుభవమే చాలా నేర్పుతుంది. అనుకోకుండా ఆ విషయం తెలుసుకునే అవకాశం నీకు వచ్చింది. హరితాన్ని రక్షించడానికి సాయం చేశావు. ఇకనుంచి నువ్వు కూడా మాలో ఒక దానివే..’ అంది గుడ్లగూబ. ‘భలే.. భలే..’ అంటూ సంతోషంతో ఘీంకరించింది బంటి. ఆ రోజు నుంచి ఆ జంతువులన్నీ మరింత స్నేహంగా ఉండసాగాయి.  

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని