ఎలుగుబంటికి జ్ఞానోదయం... తప్పిన అనర్థం!

హేలాపురి సమీప అడవిలో చిన్నా పెద్దా అన్ని రకాల జీవులు జీవిస్తుండేవి. ఒకదానితో మరోదానికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో అవన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి.

Updated : 24 Aug 2023 03:40 IST

హేలాపురి సమీప అడవిలో చిన్నా పెద్దా అన్ని రకాల జీవులు జీవిస్తుండేవి. ఒకదానితో మరోదానికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో అవన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. ఒకదాన్నొకటి అన్నా, అక్కా, వదినా, మావా అని వరసలతో పిలుచుకొనేవి. ఓ రోజు ఉదయాన్నే నక్క బావ మరణించిందన్న వార్త ఎలుగుబంటిని కలవరపరిచింది.

ఎలుగుబంటికి వంశపారంపర్యంగా వైద్యం చేయడం తెలిసింది. అడవిలో జంతువులకు జబ్బు చేసినప్పుడు వాటిని పరీక్షించి, తగిన మందులు ఇస్తుంటుంది. ఆ మధ్య నక్క బావకు ఆరోగ్యం సరిగా లేక తన వద్దకు వస్తే మంచి మందులు ఇచ్చి పంపించింది కూడా. కానీ వ్యాధి ముదిరి అది మరణించడం ఎలుగుబంటిని బాగా బాధపెట్టింది. గతంలో తన మిత్రులు ఏనుగు, కోతి, కుందేలు మరణించినప్పుడు కూడా ఎలుగుకు చాలా దుఃఖం కలిగింది. ‘అసలు తమ జంతుజాతికి మరణం అనేదే సంభవించకుండా ఉంటే ఎంత బాగుంటుంది? ఎల్లప్పుడూ అంతా సంతోషంగా ఉంటారు కదా! మరణం అనేదే లేకుండా చేసే మందు ఉంటే ఎంత బాగుండు’.. ఇలా ఆలోచించిన ఎలుగుబంటి... మరణం రానివ్వని మందు తానే కనిపెట్టాలని అనుకుంది.

ఈ ఆలోచన రాగానే అది రకరకాల మూలికలూ, వేర్లు, ఆకులు, గింజలూ వంటి అనేక పదార్థాలతో పలు ప్రయోగాలు చేసింది. ఏ జంతువుకూ మరణం సంభవించని దివ్యమైన ఔషధం ఒకటి కనిపెట్టింది. నీలిరంగులో ఉన్న ఆ మందుకు సంజీవని అని పేరు కూడా పెట్టింది. దాన్ని చిన్నచిన్న గుళికల రూపంలో తయారు చేసి అడవిలోని జంతువులు అన్నింటికీ పంచింది ఎలుగుబంటి. ఈ ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చింది. సంజీవని మందు పనిచేయసాగింది. ఇప్పుడు ఆ అడవిలో ఏ జంతువుకీ మరణం సంభవించడం లేదు. ఎలుగుబంటికి చాలా సంతోషం కలిగింది. ఇకపై తన మిత్రులకే కాకుండా అడవిలోని ఏ జంతువుకూ మరణం దరిదాపుల్లోకి రాకుండా చేయగలిగినందుకు ఎంతో ఆనందపడింది. ఎన్ని నెలలు గడిచినా అడవిలోని ఏ జంతువూ మరణించిందన్న వార్త వినబడలేదు. వేటగాళ్ల దాడిలో తమ శరీరాలకు గుచ్చుకున్న బాణాలను దులిపేసుకుని మరీ చెంగుచెంగున గంతులు వేసుకుంటూ... సంతోషంగా జీవించసాగాయి.

ఇలా అడవిలో మరణాలు లేకపోవడంతో జంతువులన్నీ ఎంచక్కా సంబరాలు చేసుకున్నాయి. ఇంత మంచి మందును కనిపెట్టి తమకు బహుమతిగా ఇచ్చిన ఎలుగుబంటి వైద్యుణ్ని తగిన రీతిలో సత్కరించాయి. చూస్తుండగానే జంతువుల జనాభా పెరిగింది. మరణాలు మాత్రం ఆగిపోయాయి. దాంతో అడవి అంతా జంతువులతో నిండిపోయి సందడి సందడిగా కళకళలాడసాగింది. కానీ దాని పర్యవసానం త్వరలోనే తెలియవచ్చింది. మరణాలు లేకపోవడం, కొత్త జననాలు సంభవిస్తుండటంతో ఆ పెరిగిన జంతువుల కోసం అడవి విస్తీర్ణం సరిపోని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా జన్మించిన పిల్ల జంతువులతో కలిసి అడవి అంతా కిక్కిరిసిపోయింది. వాటికి ఆహారంగా తినడానికి సరిపడా పళ్లు, గింజలు కూడా లభించడం లేదు.
పైగా ఏ జంతువుకూ మరణం లేకపోవడంతో క్రూర జంతువులకు మరే ఇతర జంతువునూ ఆహారం కోసం చంపడం సాధ్యం కావడం లేదు. ఆహారం లభించక అవి చిక్కి శల్యమై పోసాగాయి. అయినా సంజీవని మందు ప్రభావం వల్ల వాటికి మరణం మాత్రం సంభవించలేదు.

అప్పుడు ఎలుగుబంటికి జ్ఞానోదయం అయింది. తను ఎంత పెద్ద తప్పు చేసిందీ అర్థమైంది. సృష్టికి విరుద్ధంగా తను మరణం రాని సంజీవని మందు కనిపెట్టడం ఎంత పొరపాటో తెలిసొచ్చింది. భగవంతుడు పుట్టిన ప్రతి జీవికి మరణం ఎందుకు రాసి పెట్టాడో దానికి అప్పుడు అర్థమైంది.  

ఇంతలో ఏదో అలికిడి అయింది. ఎలుగుబంటికి మెలకువ వచ్చింది. ‘అమ్మో.. ఇదంతా కలా! సంజీవని కనిపెడితే ఇన్ని అనర్థాలా?! అయితే అస్సలు కనిపెట్టకూడదు’ అనుకుంది. తర్వాత తన పనిలో తాను నిమగ్నమైంది.

కోనే నాగ వెంకట ఆంజనేయులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు